‘కమలం’ అత్యాశలపల్లకి!

– 75 అసెంబ్లీ,12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తట
– బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి గొప్పల తిప్పలు
– ఏపీలో బీజేపీకి అంత సీనుందా?
– ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవని దుస్థితి
– ఒక్క జడ్పీ, చైర్మన్ సీటును గెలిపించలేని నేతలు
– విష్ణు ప్రకటన అధికారికమా? అనధికారికమా?
– అనధికారికమైతే ఆయనపై చర్యలేవీ?
– అధికారికమైతే మరి పురందేశ్వరి పాత్రేమిటి?
– విష్థువర్ధన్‌రెడ్డికి పురందేశ్వరి అనుమతి ఇచ్చారా?
– పొత్తులు-సీట్లపై కోర్ కమిటీలో చర్చించారా?
– అన్నీ విష్ణు ప్రకటిస్తే ఇక రాష్ట్ర- జాతీయ కమిటీలు ఎందుకు?
– పురందేశ్వరి లౌక్యమే పార్టీ కొంపముంచుతోందా?
– ‘కమలం’లో కట్టుదాటుతున్న క్రమశిక్షణ
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నది సామెత. ఏపీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి చేసిన ప్రకటన చూస్తే, ఈ సామెత మరోసారి గుర్తుకురాక తప్పదు. వి.రామారావు, పివి చలపతిరావు, జూపూడి యజ్ఞనారాయణ, వెంకయ్యనాయుడు, కృష్ణంరాజు వంటి ప్రముఖులను వెలిగించిన ఏపీ బీజేపీ.. ఇప్పుడు కొడిగట్టినదీపం అన్నది మనం మనుషులం అన్నంత నిజం. పనికి పోతురాజులు తిండికి తిమ్మరాజులన్న సామెత ఏపీ బీజేపీకి బాగా వర్తిస్తుందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తరచూ వినిపిస్తుంటాయి. అందుకే ఏపీ బీజేపీని జాతీయ పార్టీ లైట్ తీసుకుంటోందన్నది సీనియర్ల వ్యాఖ్య.

ఎంతోమంది కేంద్రమంత్రులు, గవర్నర్లను, జాతీయ పార్టీ నాయకులుగా తీర్చిదిద్దిన బీజేపీ.. ఇన్నేళ్లకాలంలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయింది. పదిమంది బలమైన నేతలను తయారుచేసుకోలేకపోయింది. ఏపీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కూడా దక్కిన ఘనత కూడా ఉంది. కనీసం మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల సంగతి ఎంత తక్కువ చెబితే అంతమంచిది. ఇప్పుడు కూడా పేరుకు చాలామంది పేపర్‌టైగర్లు ఉన్నా, వారికి స్థానికంగా పలుకుబడి శూన్యం. పేరు జాతీయ పార్టీ. తీరు ఉప ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానం. ఇదీ ఏపీలో బీజేపీ వాస్తవ దృశ్యం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం .84 మాత్రమే. అంటే ఒక్క శాతం కూడా రాలేదన్న మాట. ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ వచ్చిన స్థానాలే ఎక్కువ. ఒక్క జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలు గెలిస్తే ఒట్టు. రోజూ టీవీల్లో కూర్చునే మేధావుల నియోజకవర్గాల్లో అయితే, అసలు బీజేపీ పత్తా లేదు. అప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత జిల్లాల్లోనే, పార్టీ గెలిచే దిక్కులేకుండా పోయింది. ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి సొంత నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. పెద్ద నేతలున్న నియోజకవర్గాల్లో కూడా సేమ్ టు సేమ్.

బీజేపీ-జనసేన పొత్తు ఉన్నప్పటికీ… జనసేన-టీడీపీ అవగాహనతో కలసి పోటీ చేసి గెలిచిన స్థానాలే ఎక్కువ. అంటే బీజేపీకి క్షేత్రస్థాయిలో కనీస బలం లేదన్నది నిష్ఠుర నిజం. మీడియా ముందు ఫోజులు కొట్టే కొందరు పేపర్ టైగర్లను.. ఎన్నికల్లో పోటీ చేయమంటే, మాకొద్దని పారిపోయిన ఘటనలూ లేకపోలేదని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి వారికి పార్టీలో పెద్దపీట వేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయకపోయినప్పటికీ, ఆ అవకాశం కూడా బీజేపీ వినియోగించుకోలేకపోయింది. ఒక్క ఉప ఎన్నికలో కూడా విజయం సాధించలేకపోయింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఉపయోగించుకోలేని, అసమర్ధ స్థితిలో ఉందన్నది సుస్పష్టం.

అంతకుముందు ఎన్నికల్లోటీడీపీ కలసి పోటీ చేసి, దాదాపు 6 శాతం ఓట్లు సాధించింది. టీడీపీతో పొత్తు కింద 18 అసెంబ్లీ, 4 ఎంపీలు తీసుకున్న బీజేపీ… 13 చోట్ల మాత్రమే అభ్యర్ధులను నిలబెట్టుకోగలిగింది. 4 అసెంబ్లీ-2 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. ఇచ్చాపురం, విశాఖ నార్త్, పాడేరు, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, కైకలూరు, నర్సరావుపేట, నెల్లూరు, సంతనూతలపాడు, మదనపల్లి, కడప, కోడుమూరులో మాత్రమే పోటీ చేసింది. అంటే పొత్తులో సీట్లు ఇచ్చినా.. పోటీ చేసే అభ్యర్ధులకూ దిక్కులేదన్నది, బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికయినా అర్ధమయి తీరాలి.

పట్టుమంది పదిమందిని కూడా పోగేసుకోలేని స్థితి.. టికెట్లు ఇచ్చినా మాకొద్దంటూ పారిపోయే నేతలున్న బీజేపీ విషాద పరిస్థితికి.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కింద 75 అసెంబ్లీ, 12 లోక్‌సభ సీట్లు ఇవ్వాలని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి చేసిన డిమాండ్ సొంత పార్టీ వారికే నవ్వుతెప్పిస్తోందట.

‘ఏ పార్టీ అయినా అన్ని సీట్లు ఇస్తేనే పొత్తు’ అని స్పష్టం చేసిన సదరు విష్ణువర్దన్‌రెడ్డి.. అప్పట్లో ఒక్కసారి తప్ప, ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసింది లేదు. అప్పుడు కూడా ఆయనకొచ్చిన ఓట్లు 1400 లోపే. కనీసం ఆయన సొంత నియోజకవర్గంలోనూ, పార్టీని గెలిపించింది లేదు. కన్నా హయాంలో సీటు ఇస్తానన్నా, తనకు వద్దని తప్పించుకున్నారన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. ఏళ్ల తరబడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో హడావిడి చేసే విష్ణువర్ధన్‌రెడ్డి కనీసం సొంత జిల్లా పక్కనపెడితే, సొంత నియోజకవర్గంలో ఇప్పటిదాకా చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా గెలిపించుకోలేకపోయారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంటాయి.

నిజానికి టీడీపీ బీజేపీ – వైసీపీ బీజేపీగా చీలిపోయిన పార్టీలో చెల్లనికాసులే ఎక్కువ. జనంలో కంటే టీవీలు, పత్రికల్లో కనిపించేవారి సంఖ్యనే ఎక్కువ. పార్టీ విధానాలను వీరే డిసైడ్ చేస్తుంటారు. ఈ బాపతు నాయకులకు జనంలో స్థానం ఉండదు. కేంద్ర పార్టీ ప్రముఖులతో పైరవీలు, లాబీయింగ్‌తోనే చాలామంది రాజకీయ జీవనం సాగిస్తున్నారన్నది పార్టీలో వినిపించే ప్రధాన విమర్శ.

ఈ బాపతు నేతలకు జనంలో బలం లేకపోయినా… కేంద్రమంత్రులు, ఢిల్లీలో పలుకుబడి బాగా ఎక్కువ. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఆరితేరిన కొందరు.. జనంలో బలం లేకపోయినా, ప్రముఖులుగా వెలగటానికి ఇదే ప్రధాన కారణమన్నది సీనియర్ల విశ్లేషణ. సంఘటనా మంత్రులు, కేంద్రమంత్రుల ‘అవసరాలు తీర్చే’ అంశాల్లో ముందడటమే.. కొందరు నేతలకు పార్టీలో, ప్రాధాన్యం కొనసాగటానికి కారణమన్నది సీనియర్ల ఉవాచ.

జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ జీవీఎల్ వంటి కొందరు నేతలు మాత్రమే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా సత్యకుమార్, జాతీయ కార్యదర్శిగా తనకు అప్పగించిన రాష్ట్రాల్లో పర్యటిస్తూనే, ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ప్రస్తుతం సత్యకుమార్ రాయలసీమపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం పార్లమెంటులో ఆయన ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జీవీఎల్ విశాఖ పార్లమెంటులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికారపార్టీ ఎంపీ కంటే, ఆయనే ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, ఎంపి సీఎం రమేష్ సేవలను పార్టీ నాయకత్వం.. పెద్దగా వినియోగించుకున్నట్లు కనిపించడం లేదు.

గతంలో కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా, ఇప్పుడు పురందేశ్వరి కూడా అధ్యక్ష హోదాలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి, నాగోతు రమేష్‌నాయుడు, భానుప్రకాష్‌రెడ్డి, జయప్రకాష్, లంకాదినకర్, ఆర్‌డి. విల్సన్ వంటి మరికొందరు నేతలు చురుకుగా పనిచేస్తున్నారు. గత తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసిన, మాజీ ఐఏఎస్ రత్నప్రభ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.

ఇక కోర్ కమిటీలో ఉన్న చాలామంది సభ్యులకు సొంత నియోజకవర్గాల్లో ఆదరణ లేదు. గత కమిటీ హయాంలో ఉన్నవారినే కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. జిల్లా స్థాయికి సైతం పనికిరాని వీరిలో చాలామందికి, కోర్‌కమిటీలో స్థానం కల్పించడమే ఆశ్చర్యమన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించిన విషయం తెలిసిందే.

రేపు టీడీపీతో ఒకవేళ పొత్తు కుదిరితే.. విష్ణు వర్దన్‌రెడ్డి డిమాండ్ చేసినట్లు.. 75 అసెంబ్లీ, 12 లోక్‌సభ సీట్లు ఇస్తే, మరి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులున్నారా? అన్నది ప్రశ్న. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపాలిటీల్లో పోటీకే అభ్యర్ధులు దిక్కులేని పరిస్థితి ఉన్న పార్టీలో.. అంతమందిని ఎక్కడినుంచి తీసుకువచ్చి పోటీ చేయిస్తారన్నది ప్రశ్న. పోనీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, విష్ణువర్దన్‌రెడ్డి కూడా ఇప్పటిదాకా చెప్పకపోవడమే ఆశ్చర్యం.

కాగా విష్ణువర్దన్‌రెడ్డి ప్రకటన తర్వాత, పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ‘విష్ణువర్దన్‌కు తెలియక ఏదో 75 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తు అన్నారు. కానీ మా పార్టీకి ఉన్న బలానికి అవి ఏమాత్రం సరిపోవు.పైగా మాకు ఒక్కో నియోజకవర్గంలో అరడజను మంది పోటీ పడుతున్నారు. అందువల్ల 150 అసెంబ్లీ-20 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తు అని చెబితే బాగుండేది’ అని ఓ సీనియర్ నేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘అసలు ఇవన్నీ ఎందుకు? టీడీపీ- జనసేన చెరో పది అసెంబ్లీ, చెరో రెండు ఎంపీ సీట్లు తీసుకుని, మిగిలిన సీట్లన్నీ మాకు ఇస్తేనే పొత్తు ఉంటుందని చెబితే సరిపోయేది కదా’ అని, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యంగ్యాస్త్రం సంధించారు.

అసలు క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో.. ఈవిధంగా ఏ స్థాయి నాయకులైనా సీట్లు-పొత్తుపై మాట్లాడే అధికారం ఉందా? రేపు మరో ప్రధాన కార్యదర్శి.. తమకు 170 అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు ఇస్తేనే పొత్తు అని ప్రకటించినా, నాయకత్వం ఇంతే మౌనంగా ఉంటుందా? ఇంకో అనుబంధసంస్ధ అధ్యక్షుడు మాకు 5 లోక్‌సభ-7 అసెంబ్లీ ఇస్తే చాలని ప్రకటిస్తే, మరి అదే పార్టీ విధానమవుతుందా? అన్న చర్చకు పార్టీవర్గాల్లో తెరలేచింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని.. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఓ వైపు స్పష్టం చేస్తున్నారు.

మరి అదే నిజమైతే 75 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఏ హోదాలో ప్రకటించారు? ఆయన ప్రకటనకు జాతీయ-రాష్ట్ర నాయకత్వాల అనుమతి ఉందా? కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే విష్ణు రాష్ట్ర పార్టీ అభిప్రాయం స్పష్టం చేశారా? ఒకవేళ విష్ణువర్దన్‌రెడ్డి ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమయితే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? అంటే అధ్యక్షురాలే విష్ణుకు అలా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారా? పోనీ అదే పార్టీ వైఖరి అయితే, దానిని పురందీశ్వరి ఎందుకు ధృవీకరించడం లేదన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పొత్తు-సీట్ల వంటి విధాన నిర్ణయాలన్నీ విష్ణునే ప్రకటిస్తే, ఇక రాష్ట్ర-జాతీయ కమిటీ, కోర్ కమిటీలు ఎందుకన్నది సీనియర్ల ప్రశ్న.

అయితే రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇలాంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించకుండా, ఎవరితో గొడవ పెట్టుకోకూడదన్న లౌక్యం పాటించటంతోనే సమస్యలు వస్తున్నాని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. జిల్లా కమిటీల తొలగింపు-నియామకాల్లో కూడా ఆమె ఇదేవిధంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. ‘‘అధ్యక్షుడు మారిన తర్వాత సహజంగా కోర్‌కమిటీ మారుస్తారు. కానీ ఏపీలో మాత్రం పాతవారినే కొనసాగించడం ద్వారా… పురందేశ్వరి ఎవరితో గొడవ పెట్టుకోకుండా, ఎవరినీ దూరం చేసుకోకుండా చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారని అర్ధమవుతుంది. ఈ వ్యూహం, నైజం దీర్ఘకాలం పనిచేయద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Leave a Reply