– డాక్టర్ ఎన్. తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నీటిపారుదల ప్రాజెక్టులకు ఐదు శాతం లోపే కేటాయిస్తూ ఆచరణలో మూడు శాతం లోపే వ్యయం చేస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పేర్కొన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ గుంటూరులో ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సమస్యల పై జరిగిన సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు.
ప్రధాన వక్తగా విచ్చేసినడాక్టర్ ఎన్. తులసి రెడ్డి ప్రసంగిస్తూ వ్యవసాయ ప్రాధాన్యత గల ఆంధ్రప్రదేశ్ ను నేటి ప్రభుత్వము నిర్వీర్యం చేసిందన్నారు. 2004 నుండి 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో 15% నుండి 17% వరకు కేటాయించి, పూర్తిగా ఆ నిధులు వినియోగిస్తే నేటి రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులన్నిoటినీ విస్మరించిందన్నారు. 75% నుండి 90% వరకు పూర్తయిన ప్రాజెక్టులు సహితం పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్వహణ లోపంతో పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ లో 2,75,279 కోట్ల రూపాయలలో కేవలం 11905 కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నికర జలాలు లేకపోయినప్పటికీ కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర పై ఎగువ భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తుందని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 5300 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అక్షరాస్యతలో విషయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 30వ స్థానంలో ఉందని ఇలాంటి పరిస్థితులలో ఉపాధి కల్పనవ్యవసాయ రంగoలోమాత్రమే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లను 1952 నుండి పరిశీలిస్తే నీటిపారుదల ప్రాజెక్టులకు అతి తక్కువ శాతం కేటాయింపులు 2019 నుండే జరుగుతున్నాయన్నారు .
ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధి జరగాలంటే మూలధనం వ్యయం పెరగాలని పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కేవలము 3500 కోట్లు కేటాయిస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని తద్వారా ప్రకాశం,నెల్లూరు, కడప జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు ఇవ్వగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్. రంగయ్య, వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, దీక్షిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎడ్లవల్లి కృష్ణ, మానవతా కార్యవర్గ సభ్యులు ప్రసంగించారు.