ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌1బీ వీసాహోల్డర్లకు తిరిగి జాబ్స్‌ ఇస్తున్న 89 శాతం అమెరికా కంపెనీలు, భారత నిపుణులకు ఊరట

ఎంపి విజయసాయిరెడ్డి

అమెరికాలో ఆర్థిక ఒడిదుడుకులు కారణంగా అనేక టెక్నాలజీ కంపెనీలు తొలగించిన హెచ్‌1బీ వీసాలున్న ఉద్యోగులకు 89 శాతం అమెరికా కంపెనీలు తిరిగి ఉపాధి కల్పిస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. ఈ వీసాదారుల్లో ఇండియా, ఇతర ఆసియా దేశాలవారే ఎక్కువ. అలాగే, ప్రపంచంలో అవకాశాల స్వర్గంగా పిలిచే అమెరికాలో టెక్‌ కంపెనీలు అమలు చేస్తున్న లేఆఫ్‌ ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌1బీ వీసాహోల్లర్లకు మరో ఉద్యోగం చూసుకోవడానికి ప్రస్తుత 60 రోజుల గడువును 180 రోజులకు పెంచాలని అమెరికా అధ్యక్షుడికి సలహాలిచ్చే వలస వ్యవహారాల ఉపసంఘం సిఫార్సు చేసింది.

ఈ మేరకు హోంలాండ్‌ సెక్యూరిటీ, అమెరికా పౌరసత్వం–దేశంలోకి వలసల సేవల విభాగానికి సబ్‌ కమిటీ సూచించింది. ఈ హెచ్‌1బీ వీసాదారుల్లో భారత టెక్‌ నిపుణులు అధికశాతం ఉంటారు. లేఆఫ్‌ వల్ల జాబ్‌ పోయిన ఈ వీసాహోల్డర్లు 60 రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించుకోలేక పోతే తమ స్వదేశాలకు వెళ్లిపోకతప్పదు. అరవై రోజుల్లో వీసా హోదా మార్చుకోవడం, ఇతర పేపర్‌ వర్క్‌ పూర్తిచేసుకోవడం సాధ్యంకాకపోవడంతో అనేక మంది నిపుణులు ఇబ్బందిపడుతున్నారు. అత్యంత నైపుణ్యం ఉన్న ఈ హెచ్‌1బీ వీసాహోల్డర్ల సేవలు అమెరికాకు అవసరమని అక్కడి అత్యధిక కంపెనీలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఈ వృత్తినిపుణులను తీవ్ర ఒత్తిడి నుంచి కాపాడడానికి గడువును 180 రోజుకు పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.

క్లిష్ట పరిస్థితుల్లోనూ విదేశీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌
అమెరికాలో క్లిష్ట ఆర్థిక పరిస్థితులున్నప్పటికీ అధిక ప్రతిభాపాటవాలు, టెక్‌ నైపుణ్యం ఉన్న విదేశీ వర్కర్లకు డిమాండ్‌ నేడు చాలా ఎక్కువ ఉంది. 2022తో పోల్చితే విదేశీ టెక్‌ ప్రొఫెషన్స్‌ కు నేడు గిరాకీ అధికంగా ఉందని అమెరికా కార్మికశాఖ తెలిపింది. ఇతర దేశాల నుంచి వచ్చి పనిచేయడానికి సిద్ధమైన ఉద్యోగులకు హెచ్‌1బీ వీసాల స్పాన్సర్‌ షిప్స్‌ రికార్డు స్థాయిలో పెరిగాయి. 2023 ప్రథమార్ధంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 71% కంపెనీలు ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులను నియమించాయని వార్తలొస్తున్నాయి.

అధిక నైపుణ్యం ఉన్న విదేశీ సిబ్బంది నియామకంలో పెరిగిన జోరు ఈ ఏడాది మొత్తం కొనసాగుతుందని ఓ అధ్యయనంలో తెలిసింది. ఈ వివరాలను ప్రపంచవ్యాప్త వలస సేవలకు సంబంధించిన సంస్థ ‘ఎన్వాయ్‌ గ్లోబల్‌’ వెల్లడించింది. గత ఆరు నెలల్లో ఇతర కంపెనీలు తొలగించిన హెచ్‌1బీ వీసాదారులైన నిపుణుల్లో ఒకరు లేదా ఇద్దరిని 89 శాతం కంపెనీలు పనిలోకి తీసుకుని ఉద్యోగాలిచ్చాయని ఈ సర్వే తెలిపింది.

మరో ఉద్యోగం చూసుకోవడానికి 60 రోజులే గడువు కావడంతో కొందరు టూరిస్టు వీసాకు మారి అమెరికాలో మకాం కొనసాగిస్తున్నారు. మరి కొందరైతే తమ కంపెనీలకు పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలోని యూనిట్లలోకి బదిలీ అవుతున్నారు. ఇంకా ఇంగ్లండ్, జర్మనీ వంటి దేశాల్లోని ఆమెరికా కంపెనీల విభాగాలకు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నారట. మొత్తంమీద మాతృదేశాలకు వెనక్కివస్తున్న వారి సంఖ్య చాలా తక్కువే గాని గడువు 180 రోజులకు పెరిగితే హెచ్‌1బీ వీసాహోల్డర్స్‌ అయిన భారతీయులపై ఒత్తిడి తగ్గుతుంది.

Leave a Reply