-ప్రజా రాజధానిని అపహాస్యం చేసి విధ్వంసం చేశారు
-ఒక వ్యక్తి మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం
-నాడు పుణ్యనదుల నుంచి తెచ్చిన నీరు, మట్టి వల్లనే నేడు మళ్లీ అమరావతి నిలబడింది
-29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు అమరావతి
-80 శాతం పూర్తి అయిన నిర్మాణాలను అలాగే వదిలేశారు
-రాజధాని పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం…అందరి సహకారంతో, ప్రణాళికతో ముందుకు పోతాం
-సీఎం నారా చంద్రబాబు నాయుడు
-నాలుగు గంటల పాటు అమరావతిలో సీఎం పర్యటన….రాజధాని భవనాల పరిశీలన
అమరావతి : రాష్ట్రానికి అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలని…గత పాలకుల మూర్ఖత్వం వల్ల రెండూ విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజధాని అమరావతిని అపహాస్యం చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి రాజధానిలో పర్యటించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన, విధ్వంసాలకు గురైన నిర్మాణాలు, శిథిలాలను పరిశీలించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాలను మొదట పరిశీలించారు. అక్కడి నుండి బయలుదేరి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నాడు రాజధానికి భూమిపూజ జరిగిన వేదిక వద్ద మోకాళ్లపై ప్రణమిళ్లారు.
అక్కడ నుంచి బయలుదేరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గృహాలను పరిశీలించారు. తరువాత ఆలిండియా సర్వీసెస్ న్యామూర్తుల కోసం నిర్మించిన భవన సముదాయాలు పరిశీలించారు. అనంతరం మంత్రుల నివాస గృహాలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల, నాలుగవ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్లను పరిశీలించారు. ప్రతి నిర్మాణం లోపలికి వెళ్లి ఆయా ఫ్లాట్స్ విస్తీర్ణం, ప్లాన్ లో ఉన్న సౌకర్యాలు, డిజైన్ల గురించి అధికారులతో మాట్లాడారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డులో ఉన్న సిఆర్ డిఎ భవనం వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఏ అంటే అమరావతి….పీ అంటే పోలవరం
‘రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. “అనేక సవాళ్లను, కేసులను అధిగమించి 1,631 రోజులు ఆందోళనలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారడంతో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో రైతులు ఆందోళనలు విరమించారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం…భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
ఏపీ అనే పదంలో ఏ అంటే అమరావతి…పీ అంటే పోలవరం. అమరావతి ప్రజారాజధాని…తెలుగువారికి చిరునామాగా ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలకు దశ, దిశను నిర్ధేశిస్తుంది. ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గర్వంగా పనులు చేసుకోవచ్చు. కానీ రాజధానిని జగన్ అతలాకుతలం చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువనీళ్లు ఉండే నది గోదావరి. పోలవరం నిర్మాణం జరిగి నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లివ్వచ్చు.
విభజన అనంతరం రాజధాని కట్టుకోవడానికి ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పోలవరం-అమరావతి వ్యక్తిగత అంశాలు కావు..
‘ప్రజలు కూటమికి ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేశారు…రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం ఎప్పుడూ రాలేదు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు వ్యక్తిగత అంశానికి సంబంధించినది కాదు…వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతాయి. ప్రజల్ని సాధికారితవైపు నిలబెట్టవచ్చు. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం పూర్తైతే రాయలసీమ రతనాలు సీమ అవుతంది. గత ప్రభుత్వం పోలవరంను గోదావరిలో కలిపింది. పోలవరానికి శాపంగా మారిన వ్యక్తి వల్ల, మూర్ఖత్వం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ మహిమే రాజధానిని కాపాడింది
‘‘ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ ప్రజావేదిక కూల్చి జగన్ పాలన ప్రారంభించారు. రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుండి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ప్రధాని నరేంద్రమోదీ కూడా పార్లమెంట్ మట్టి, యమునా నది నుండి నీళ్లు తెచ్చి నాడు మనకు సంఘీభావం తెలిపారు. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. తాత్కాలికంగా కొంతమంది అతాలకుతలం చేయాలనుకున్నా ఈ మహత్యం వల్ల మళ్లీ నిలబెట్టుకోగలిగాం’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో శ్వేతపత్రం విడుదల
‘‘రాజధానిలో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి…పైగా ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వకుపోయారు. ఒక్క బిల్డింగును కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. కొన్ని బిల్డింగ్ లు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఐఎఎస్, ఐపిఎస్, జడ్జీల భవనాలు, మంత్రులు భవనాలు, గెజిటెడ్ అధికారుల, నాన్ గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణం ప్రారంభించాం….ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిపేశారు. శ్వేతపత్రం విడుదల చేసి రాజధాని ప్రస్తుత పరిస్థితపై ప్రజలకు వివరాలన్నీ తెలుపుతాం. ప్రజల్లో కూడా గత ప్రభుత్వం విధ్వంసంపై చర్చ జరగాలి. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది.’’ అని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరేగే రాజధాని అమరావతి
‘తెలుగుజాతి గర్వంగా, గౌరవంగా తలెత్తుకు తిరిగే రాజధాని అమరావతి. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. కేంద్రం 12 విద్యా సంస్థలను ఇచ్చింది. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, మంగళగిరిలో ఎయిమ్స్, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిలో ఎన్ఐటీ, ఒంగోలులో ఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీని…ఇలా ప్రాంతాల వారీగా నెలకొల్పాం. కానీ గత ప్రభుత్వం ఏదీ జగనివ్వలేదు..ముందుకు సాగనివ్వలేదు.
రాజధానిపై ఇష్టారీతిన బురదజల్లారు. నిత్యం విష ప్రచారం చేశారు…బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు…స్విస్ ఛాలెంజ్ లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధాని పెట్టండని శివరామకృష్ణకమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే 12 పార్లమెంట్ స్థానాలు ఒకవైపు…మరో 12 పార్లమెంట్ స్థానాలు ఇంకోవైపు ఉండేలా చూసి…గుంటూరు సెంట్రల్ గా అమరావతిని రాజధానిగా గుర్తించాం.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట
‘మూడు రాజధానుల అని మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఎక్కడివి అని మాట్లాడారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకుని 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఇష్టపడని ఈ రోజుల్లో రాజధాని కోసం ముందుకు వచ్చి రైతుల భూమలు ఇచ్చారు.
రైతులు ఇచ్చిన భూములు, ప్రభుత్వ భూముల్లో రోడ్లు, బిల్డింగులు, ఇతర నిర్మాణాలు పోను మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజధాని నుండి సంపద తోనే అమలు చేయవచ్చు…కానీ గత పాలకులు నిర్వీర్యం చేశారు.
రాజధాని విధ్వంసంపై ప్రజలకు వివరిస్తాం…
‘‘ఐదేళ్లు పట్టించుకోకపోవడంతో బిల్డింగులన్నీ బూజు పట్టాయి. కొన్నింటిని పగలగొట్టారు. రాజధానికి వ్యతిరేకంగా ఏమేం చేయాలో అన్నింటినీ చేశారు. కాపాడుకోవాలనుకున్న రైతులపైనా పోలీసులు ఏకపక్షంగా కేసులు పెట్టారు. నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు తెచ్చిపెట్టిన మెటీరియల్ దోచుకెళ్లారు. రాజధానిలో గత ప్రభుత్వం ఎంతటి నష్టం కలిగించిందో ప్రజలకు వివరిస్తాం. బ్రహ్మాండంగా ఉండాల్సిన రాజధానిలో..ఇప్పుడు తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలతో కమ్మేసుకుంది. ఇవన్నీ బాగుచేస్తాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజధాని నిర్మాణాలను ఉన్మాది నుండి దేవుడే కాపాడారు
‘‘వైసీపీకి ఓట్లు వేసిన వారు కూడా ఎలాంటి వారికి ఓటు వేశారో ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటేయడానికి క్యూలో అర్థరాత్రి వరకు ఓటర్లు నిలబడ్డారు.
ఇతర ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకునే వారు కూడా సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకనే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్ని అణచివేస్తాం. రాజధానిలో జరిగిన నిర్మాణాలను ఉన్మాదిబారి నుండి దేవుడే కాపాడారు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు.
జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత ఉందా అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలీదు.. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలీదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాష్ట్రానికి పూర్వవైభం తీసుకొస్తాం..పునర్నిర్మిస్తాం. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారలు ప్రవర్తన మార్చుకోవాలి. అందరి సహకారం, భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరుగుతుంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.