ఉరికే ఉత్సాహం

అదే ఉరకలెత్తే ఉత్సాహం
అదే మరుగుతున్న రక్తం
ఉప్పెనలా సాగుతున్న జనం
ప్రభంజనం లా మారుతున్న నారీ లోకం
ఏడు వందల రోజుల ఆవేదనకు
ఏడుకొండల వాడి స్వాంతన కొరకు
భూములిచ్చి మోసపోయిన రైతన్నలకు
లక్షలాది భూమి పుత్రుల దీవెనల కొరకు
దారుణ అమానుషానికి గురైన ఆడపడుచులకు
తెలుగు మహిళామ తల్లుల ఆదరణ కొరకు
ఆవేదనతో అసువులు బాసిన అమరవీరుల
పవిత్రమైన ఆత్మలకు శాంతి కొరకు
గట్టు దాటని ఆవేశం
కట్టు దాటని ఉద్యమం
గుట్టుగా దిగమింగిన అవమానం
మెట్టు దిగని ఆత్మగౌరవం
బెట్టు సడలని పోరాటం
నట్టు పడని వాచకం
చెట్టు చేమల గుండా ప్రయాణం
ఎండకు ఎండినా
వానకు తడిసినా
చలికి వణికినా
ఆకలికి మండినా
గొంతు తడారినా
బట్ట నలిగినా
నడుము నొచ్చినా
పాదం వాచినా
కండలు అరిగినా
చెమట పారినా
కదం తొక్కుతూ బయలెల్లిన త్యాగధనుల
దృఢ సంకల్ప మహా పాదయాత్ర లో
ఆడామగా లేదు
చిన్నాపెద్దా లేదు
కులం లేదు మతం లేదు
రాజకీయం అసలే లేదు
ఉన్నది ఒక్కటే ధ్యేయం
ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే
కోట్ల సార్లు పలికిన నినాదం “జై అమరావతి”
కోట్ల మంది నినదించాల్సిన పదం “జయహో అమరావతి”

– గద్దె బుచ్చి తిరుపతి రావు