Suryaa.co.in

Padayatra News

సంకల్పం సడల లేదు.. జోరు తగ్గలేదు.. సమరోత్సాహంతో రైతు పాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉద్ధృతంగా సాగుతోంది. మండుటెండలను సైతం వారి సంకల్పాన్ని సడలనివ్వటం లేదు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో లేని శక్తిని కూడగట్టుకుంటూ అడుగులో అడుగేస్తూ పట్టుదలగా రాజధాని రైతులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు మళ్లీ సభ ముందుకు తెస్తే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సైతం సిద్ధమవుతామని తేల్చి చెప్పారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లాలో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ వర్గాలు తమ సంఘీభావం తెలిపారు.
ఏకైక రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేస్తున్న రైతులకు నెల్లూరు జిల్లాలో అపూర్వ మద్దతు లభిస్తోంది. 23 రోజున కొండ బిట్రగుంటలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ చేసి రైతులు పాదయాత్రను ప్రారంభించారు. కడనూతల, కప్పరాలతిప్ప, కోవూరుపల్లి, ఉలవపాళ్ల వరకూ యాత్ర సాగించారు. మధ్యాహ్నం ఉలవపాళ్లలో భోజన విరామానికి ఆగిన రైతులు తిరిగి అక్కడ నుంచి అల్లూరు రోడ్డు మీదుగా సున్నంబట్టి వరకు యాత్ర కొనసాగించారు. అడుగడుగునా ప్రజలు రైతులకు పూలతో స్వాగతం పలికి హారతులు పట్టారు.ఇదే ఉత్సాహంతో ఇతర జిల్లాల ప్రజల మద్దతు కూడగడతామని ఐకాస ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు ఆలోచన చేస్తామని అమరావతి ఐకాస ప్రకటించింది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవటం వైకాపా నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని రైతులు దుయ్యబట్టారు. అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
 కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన కొందరు వైకాపా నేతలు రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపి వారికి స్వెటర్లు, ఇతర సామాగ్రి అందజేశారు. స్థానికంగా ఉన్న రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా పేర్లు చెప్పుకునేందుకు వారు ఇష్టపడలేదని రాజధాని రైతులు వెల్లడించారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని రాజధాని మహిళలు స్పష్టం చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్‌ తన భార్యతో కలిసి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. భాజపా, సీపీఎం, జనసేన పార్టీ నాయకులు రైతుల పాదయాత్రలో అడుగు కలిపారు.నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుల సంఘం, కాపు సంఘం, వివిధ కుల సంఘాలు, వృత్తి సంఘాల ప్రతినిధులు రైతుల పాదయాత్రకు తమ మద్దతు ప్రకటించారు. 15 కిలోమీటర్ల మేర నడక సాగించి సున్నంబట్టి చేరుకున్న రైతులు.. ఏకైక రాజధాని అమరావతి సాధించే వరకూ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE