అంబటి రాంబాబుగారు…కృష్ణా నదీ జలాల హక్కులపై శాసనసభలో “గాడ్రించండి”!

Spread the love

అంబటి రాంబాబుగారు శాసనసభలో ఎగిరెగిరి పడుతున్నారు కదా! కృష్ణా నదీ జలాల పంపిణీలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ కు లభించిన 512 టియంసి నికర జలాలకు మరియు మిగులు జలాలకు గడ్డికొట్టే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు కదా!

అలాగే, మీరేమో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సంక్షోభంలోకి నెట్టారు. పోలవరం నిర్మాణం కాకుండానే పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీకి అంటే గోదావరి నది నుండి కృష్ణా నదికి మళ్ళించే 80 టియంసిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 45 టియంసిలు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించుకొంటూ కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా జీ.ఓ.నే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు అక్రమ ప్రాజెక్టు అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ట్రిబ్యునల్/కేంద్ర జల సంఘం నుండి అనుమతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై గొడ్డలి పెట్టువేయాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులుగా ఉన్న మీరేమో ప్రతిపక్షాలపై శాసనసభలోను, బయట చిందులు వేయడంలో బిజీగా ఉన్నారు. జీవన్మరణ సమస్యగా తయారైన ఆ సమస్య మీకు ఏ మాత్రం పట్టలేదు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు స్పందించరు, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న మీరూ స్పందించరు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులు ఎలా పరిరక్షించబడతాయో! కాస్త దృష్టి సారించి, ఆలోచించి శాసనసభ వేదికగా అధికారిక ప్రకటన చేయమని విజ్ఞప్తి.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Leave a Reply