రాష్ట్రంలో అధికరణ 356 ద్వారా రాష్ట్రపతి పాలన పెట్టాలి

Spread the love

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్

నాలుగున్నరేళ్ళుగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి 11 లక్షల కోట్ల అప్పులకు ఎగబాకిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం 356 అధికరణం కింద అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకోవచ్చు అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ధృతరాష్ట్రుడిలా కళ్ళకు కట్టుకున్న గంతులు విప్పదీసి, రాష్ట్రం వంక చూడాలన్నారు. కచ్చితమైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 73 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టారని చెప్పారు. ఆయన జైలులో నుంచి బయటకు రాకుండా కొత్త కొత్త కేసులకు కుట్ర జరుగుతోందని తెలిపారు. జైల్లోనే చంద్రబాబు ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయని తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ని హత్య చేసిన ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు ను హత్య చేయటం పెద్ద పనేమీ కాదని ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి తన కాళ్ళ కింద తొక్కి పట్టిందని, రాజకీయ కక్ష , పగలతో పరిపాలన చేస్తుందని ఆరోపించారు . న్యాయస్థానాలపై కూడా ప్రజలకు పూర్తిగా నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. తాడును తెగేదాకా లాగొద్దని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రజలు శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకునే ప్రమాదం పొంచి ఉందని, కేంద్ర ప్రభుత్వం ధృతరాష్ట్రుడిలా కళ్ళకు కట్టుకున్న కళ్ళ గంతలు విప్పు కొని ఏపీ వంక చూడాలన్నారు.

తక్షణం రాష్ట్ర పతి పాలన విధించటం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం నుంచి ఏపీలో రాష్ట్ర పతి పాలన‌ పెట్టాలని కోరుతూ రాష్ట్ర పతికి ఉత్తరాలు రాస్తున్నామని, పెద్ద ఎత్తున రాజకీయ పక్షాలు, మేధావులు, పౌర సమాజం రాష్ట్ర పతికి లేఖలు రాయాలని బాలకోటయ్య పిలుపు నిచ్చారు.

Leave a Reply