– మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గురువారం ఒక చీకటి రోజని మాజీమంత్రి మెరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున భారతదేశ భావితరాల దిక్సూచి, భారతరాజ్యంగా నిర్మాత, దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలన్న తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయునియొక్క శిలాఫలకాన్ని, విగ్రహాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వయంగా ప్రభుత్వమే దాడి ఘటనలో ఇన్వాల్స్ అయి చేయించడం దారుణమన్నారు.
బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికంటే ముందు అనేక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో అంబేద్కర్ విగ్రహం పెట్టండి అని అడిగినందుకు కేసులు పెట్టారని, ఎక్కడో ముళ్లపొదల్లో విగ్రహం పెడుతున్నారని చూడ్డానికి వెళ్తే కూడా కేసులు పెట్టారని నాగార్జున మండిపడ్డారు.
ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే స్ధలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా అమ్ముకుని వారి మనుషులకు అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపధ్యాన్ని గుర్తు చేశారు.
ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉందని…. ఇదొక గొప్ప స్మారకమని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసి తపించాలని, భావితరాలకు ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
విగ్రహ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిగా… అంబేద్కర్ భావజాలం మీద వైయస్.జగన్మోహన్రెడ్డికి ఉన్న తపన, అకుంఠితమైన దీక్ష, పట్టుదల చూస్తే ఎవరికైనా శెభాష్ అనిపిస్తుందని పేర్కొన్నారు. అలాంటి విగ్రహాన్ని లక్షలాది మంది సమక్షంలో ఆవిష్కరించుకున్నామన్నారు.
గవర్నర్ బంగ్లాతో పాటు విజయవాడ మన్సిపల్ కమిషనర్ గారి బంగ్లాకు కూతవేటు దూరంలో అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాంపై నిన్నరాత్రి దుండగులు, ప్రభుత్వ అనుమతి, అండదండలు, స్వయంగా ముఖ్యమంత్రి అండతో పలుగుతో దాడిచేయడం క్షమార్హం కాని నేరమని మండిపడ్డారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ భావజాలంపై ఉన్నటువంటి ఆలోనను ఈ చర్య తేటతెల్లం చేసిందన్నారు. మమ్నల్ని ఏం చేసినా, మేం ఏమైపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పై ఉందన్నారు.
ఇలా వదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోసే అవకాశం లేకపోలేదని దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వహించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే… విగ్రహం ఉండదని భయపెట్టాలని చూస్తూ.. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూదని.. ఆయన పేరు ఉండకూడదని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారిపై బాధ్యత కలిగిన ప్రభుత్వంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మరోవైపు ఈ ప్రభుత్వం, అధికారుల మీద మాకు నమ్మకం లేదని.. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
హామీల అమలు చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి: నందిగం సురేష్
ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, కిడ్నాప్ల వంటి అకృత్యాలకు పాల్పడుతుందన్నారు. హామీల అమలు చేయడానికి కమిటీ వేస్తామని లోకేష్ చెబుతున్నారని.. హామీ ఇచ్చినప్పుడే ఆ కమిటీ వేసుంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తుందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం బయటపడిందన్నారు. హామీల అమలు చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి దాడులు, అఘాయిత్యాలు చేస్తూనే ఇంకా కడుపు మంట చల్లారక ఏకంగా మహానుభావుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహంపైన దాడికి దిగడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు.