– ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని, అంటరానితనంపై ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతుందన్నారు. భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ 131వ జయంతి సందర్భంగా విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా గౌరవ బిశ్వభూషణ్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అండగా అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవన్నారు. భారత రాజ్యాంగ పితామహునిగా పిలుపు అందుకునే అంబేద్కర్ ఒక పండితునిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా దేశానికి ఎనలేని సేవ చేసారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఫలితంగానే ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణించబడుతుందని కొనియాడారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించి అవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగంగా ఉండాలన్న లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ సామాజిక ప్రజాస్వామ్యాన్ని సమర్థించారని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.