Suryaa.co.in

National

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు

– పాక్‌ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవు
– విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి

ఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాక్‌ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని పేర్కొంది. సోమవారం పార్లమెంటరీ కమిటీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సమాధానం ఇచ్చారు.

భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని తెలిపారు. సైనిక చర్యలు నిలిపివేయాలన్న నిర్ణయం రెండు దేశాల ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నట్లు చెప్పారు.

భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణకు తాను సహకరించినట్లు అమెరికా అధ్యక్షుడు సుమారు ఏడుసార్లు అన్నారు. దీనిపై భారత్‌ ఎందుకు మౌనంగా ఉన్నదని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. అయితే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ వాదనను ఖండించారు.

‘కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదు. మూడవ పక్షం ప్రమేయం లేని ద్వైపాక్షిక నిర్ణయం’ అని ఆయన అన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఇండియా టుడే పేర్కొంది.

మరోవైపు భారత్‌, పాకిస్థాన్ మధ్య ఘర్షణ సాంప్రదాయ యుద్ధ పరిధిలోనే ఉన్నదని తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని చెప్పారు. మే 10న రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు అన్ని సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనకు వచ్చారని పలువురి సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని పార్లమెంట్‌ కమిటీ సభ్యులను విక్రమ్ మిస్రి కోరారు. ఆపరేషన్ సిందూర్ మొదటి దశ తర్వాత పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్‌కు జైశంకర్ తెలియజేశారని ఆయన స్పష్టం చేశారు.

చైనా సైనిక ఆయుధాలు, హార్డ్‌వేర్‌ను పాకిస్థాన్‌ వినియోగించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ‘వారు (పాక్‌) ఏమి ఉపయోగించినా పర్వాలేదు. వారి వైమానిక స్థావరాలను మనం తీవ్రంగా ఢీకొట్టామన్నదే ముఖ్యం’ అని విక్రమ్ మిస్రి తెలిపారు. కోల్పోయిన భారతీయ యుద్ధ విమానాల సంఖ్య గురించి కొందరు సభ్యులు ప్రశ్నించారు. అయితే జాతీయ భద్రతా సమస్యగా పేర్కొంటూ సమాధానం చెప్పేందుకు మిస్రి నిరాకరించారు.

LEAVE A RESPONSE