బంకించంద్ర చటర్జీ
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం – వందేమాతరం
నెలవంకలో ఆ వంపు ఎందుకు వచ్చింది? రామకృష్ణ పరమహంస ఒకసారి సినీవాలీ లేదా నెలవంక అనే అర్ధం వచ్చే పేరు ఉన్న కవిగారిని అడిగారట. అది బ్రిటిష్‌వాడు బూటుకాలితో తన్నడం వల్ల వచ్చిన వంపు అన్నాడట, నవ్వుతూ ఆ కవి. ఆ కవి బంకించంద్ర చటర్జీ. ‘ఆనందమఠం’ అనే మహోన్నత చారిత్రక నవలను అందించిన గొప్ప రచయిత. వందేమాతర గీతం జాతికి అందించినది ఆ నవలే.
ఈ నవల జాతిలో ‘స్వ’ స్పృహను రగిలించ డానికి ఉద్దేశించినది. ఆంగ్లేయుల కారణంగా మనం కోల్పోయినదేమిటో ఆనాడే గొప్పగా గుర్తించిన రచయిత బంకించంద్ర. ఆయన నవలాకారుడు, కవి, పత్రికా రచయిత. పరమహంస, బంకింబాబు గొప్ప మిత్రులు. సరదాగానే చెప్పినా, ఆ మాట బంకింబాబు గుండెలో తుపానులా వీస్తున్న స్వేచ్ఛా పవనాలు ఎంత బలమైనవో చెప్పేదే. భారత స్వాతంత్య్రోద్యమానికి వందేమాతరం గేయం కరదీపికగా ఉపకరించిం దంటే అతిశయోక్తి కాదు.
బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో వందేమాతరం నినాదం సమర శంఖంలా మోగింది. తరువాత బిపిన్‌చంద్రపాల్ ఒక పత్రిక నెలకొల్పాలని భావించినప్పుడు ఆ పత్రికకు వారు ఎంపిక చేసుకున్న పేరు- వందేమాతరం. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ సంస్కృతంలో రాశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో వచ్చిన బంకింబాబు జయంతి సందర్భంగా ఆ గేయం, ఆ నవల, ఆ మహావ్యక్తి గురించి కొంచెం గుర్తు చేసుకుందాం.
వందేమాతరం గేయానికి విశేష ప్రాచుర్యం తెచ్చిన ఘనత భారత జాతీయ కాంగ్రెస్‌కు దక్కుతుంది. 1896లో కలకత్తాలోని బేడెన్ మైదానంలో జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలు జరిగాయి. అందులోనే ఈ గేయాన్ని మొదట మరో మహా రచయిత, కవి రవీంద్రనాథ్ టాగూర్ గానం చేశారు.
1901లో మళ్లీ కలకత్తాలోనే కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు దఖినా చరణ్ సేన్ ఈ గేయాన్ని ఆలపించారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నేపథ్యంలో 1905లో కాశీలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో కవయిత్రి సరళాదేవి చౌధురాణి ఆలపించారు. అక్టోబర్, 1937న జాతీయ గీతంగా కాంగ్రెస్ స్వీకరించింది.
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు, ఇంకా చెప్పాలంటే ప్రథమ స్వాతంత్య్ర సమరం- 1857 కంటే ముందే భారతదేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, అంటే ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అలాంటిదే 1770-1820 మధ్యకాలంలో బెంగాల్ ప్రాంతంలో జరిగిన సన్యాసుల తిరుగుబాటు.
ఆ ఇతివృత్తంతో రాసినదే ‘ఆనందమఠం’ నవల. 1757 ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మీద ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత భారతీయ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునాదులు కదలిపోవడం మొదలయింది.
అంతగా చెలరేగి పోయింది కంపెనీ సిబ్బంది. కరవు కాటకాలు, దుర్భిక్షం నేపథ్యంలోను పన్నులు వసూలు చేయడం మానని కంపెనీ అధికారుల మీద సన్యాసుల ఆధ్వర్యంలో జరిగిన సాయుధ తిరుగుబాటును ఈ నవలలో చిత్రించారు.
ఆ తిరుగుబాటును చిత్రించడంలో బంకింబాబు ఉద్దేశం కేవలం కంపెనీ మీద వ్యతిరేకతను పెంచడమే కాదు, బెంగాలీలలో, భారతీయులలో సాంస్కృతిక పునరుజ్జీవనం తేవడానికి కూడా. సన్యాసుల తిరుగుబాటు మొదలైన తరువాత ఈస్టిండియా కంపెనీ సన్యాసులూ, ఫకీర్లూ ఆలయాలు, ప్రార్థనా స్థలాలకు యాత్ర చేయడం మీద నిషేధం విధించింది.
ఈ అంశాన్నే బంకింబాబు ప్రధానంగా చర్చించారు. బీర్‌భూం అనే ప్రాంతమే ఈ నవలకు నేపథ్యం. ఎక్కువ సన్నివేశాలు అడవిలో ఉండే ఆలయం, పాత భవంతులలో, రహస్యంగా నిర్వహించే ఆశ్రమాలలో జరిగినట్టుగా రాశారు.
బెంగాల్ మేధోవర్గాన్ని తట్టి లేపడానికి బంకించంద్ర సాహిత్యాన్ని ఆయుధం చేసుకున్నారు. తన ఆశయాన్ని వెల్లడించడానికి ‘బంగదర్శన్’ అనే పత్రికను (1872) స్థాపించారు. బెంగాలీలలో అస్థిత్వంతో పాటు, జాతీయవాదాన్ని కూడా ఈ పత్రిక తట్టి లేపింది. తన పత్రిక అక్షరాస్యులు, మేధావులకీ- నిరక్షరాస్యులకీ మధ్య వారధిలా ఉండాలని ఆశించారు. బంకింబాబుకు సంస్కృతమంటే అమితమైన ప్రీతి.
కానీ బెంగాలీ భాషను ప్రజల భాషగా మలచడానికి ఆయన ఆ భాషలోనే రచనలు ఆరంభించారు. కానీ ఆయన మొదటి నవలను మాత్రం ఆంగ్లంలోనే రాశారు. కపాలకుండలి (1866), దేవీ చౌధురాణి, బిషబృక్ష, చంద్రశేఖర్ (1877)తో పాటు రాజమోహనుని భార్య, కృష్ణకంటేర్ ఆకాంక్ష అనే రచనలు కూడా వెలువరించారు.
దుర్గేశనందిని ఆయన తొలి బెంగాలీ నవల. ఇది బెంగాలీ హృదయాన్ని ఒక తుపానులా చుట్టుముట్టిందని దేవేంద్రనాథ్ టాగూర్ అన్నారు. ఆయన రాసిన మృణాళిని నవల కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినది. బెంగాల్ మీద జరిగిన తొలి ముస్లిం దాడి (1869) దీనికి నేపథ్యం. మొత్తం 13 నవలలు రాశారాయన.
బంకించంద్ర చటర్జీ (జూన్ 27,1838- ఏప్రిల్ 8, 1894) ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో కాంతాపుర అనేచోట పుట్టారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. అప్పటికి ఆయన బీఏ చదువుతున్నారు. 1859లో డిగ్రీ తెచ్చుకున్న తరువాత కలకత్తా లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. 31 ఏళ్ల ప్రభుత్వ సేవల తరువాత 1891లో ఆయన పదవీ విరమణ చేశారు.
బంకింబాబు తన ఆలోచనకు అక్షరరూపం ఇవ్వడానికి చారిత్రకత అనే సూత్రాన్ని స్వీకరిస్తారు. గతాన్ని గుర్తు చేయడం ద్వారా, దానిని వర్తమాన తరం దృష్టిపథంలోకి తీసుకురావడం ద్వారా జాతీయతా స్పృహను మేల్కొల్పవచ్చునని ఆయన విశ్వసించారు.
ఇంకా చెప్పాలంటే, ఆ కవి కాలం నాటికి నెలకొన్న దుర్భర పరిస్థితులను గతంలోని స్వర్ణయుగంతో పోల్చి చూపడానికీ, తద్వారా ప్రజలలో ఆత్మగౌరవాన్ని పెంచడానికీ• ఆయన ప్రయత్నించారు. గత స్మృతులు జాతీయతా భావాలను రగుల్కొల్పడంలో దోహదపడతాయని భావించారు.
మరీ పెద్దదీ, మరీ చిన్నదీ కాని ఆనందమఠం నవల ఇతివృత్తం ఏమిటి? మహేంద్ర, కల్యాణి అనే దంపతులను పరిచయం చేయడంతో ఈ నవల ఆరంభమవుతుంది. పదచిన్హ అనే వారి గ్రామం అప్పటికే కరవు కాటకాలతో అలమటిస్తున్నది. వారికి కూడా ఆహారం, నీరు లేవు. అందుకే ఆ గ్రామం వీడి సమీపంలోని నగరానికి తరలిపోయి, ఏదో పని చేసుకుని బతకాలని అనుకుంటారు.
నిజానికి వీరు జమిందారులు. నగరానికి వెళుతున్నప్పుడే ఆ ఇద్దరు వేరైపోతారు. కల్యాణి అడవిలో తప్పిపోతుంది. పైగా దారి దోపిడీ దొంగల పాలపడుతుంది. వారిని తప్పించుకోవడానికి చాలా దూరం పరుగు తీసి ఒక నదీతీరంలో స్పృహ కోల్పోతుంది. ఆమెను జీవన్ అనే ఒక ‘సనాతన్’ తన ఆశ్రమంలో చేరుస్తాడు. జీవన్ సన్యాసి రూపంలో ఉంటాడు. కానీ ఇతడు ఈస్టిండియా కంపెనీ మీద తిరుగుబాటు చేస్తున్న బృందంలో ఒకడు.
అదే సమయంలో కల్యాణి భర్త మహేంద్ర ఉద్యమంలో చేరిపోవాలని, మాతృ భూమిని సేవించుకోవాలని అనుకుంటాడు. తాను కూడా భర్తకు ఈ విషయంలో సాయపడాలని కల్యాణి నిశ్చయించుకుంటుంది. ఆ సమయంలోనే మహాత్మా సత్య అనే సన్యాసి వారితో కలుస్తాడు. తరువాత ఇతడిని కంపెనీ పోలీసులు అరెస్టు చేస్తారు. మహేంద్రకు ఉద్యమ నాయకుడు బంగోమాత మూడు అవతారాల గురించి వివరిస్తాడు.
నిన్న మన అమ్మ జగద్ధాత్రి. ఇవాళ్టి అమ్మ కాళి, రేపు అమ్మగా మనం కొలిచేది దుర్గ అని వివరిస్తాడు. చివరికి కంపెనీ సేనలు సన్యాసుల ఆశ్రమం మీద దాడికి దిగుతాయి. సన్యాసుల సైన్యం ఓడిపోతుంది. ఒక వెన్నెల రాత్రి ఉద్యమకారులు అడవిలో గుర్రాల మీద వెళుతూ వందేమాతర గీతం ఆలపించే సన్నివేశం గమనిస్తే సౌందర్యారాధకుడైన భావునిగా బంకింబాబు దర్శనమిస్తారు.
ఆత్మగౌరవం కలిగిన జాతిగా తిరిగి ఆవిర్భ వించడానికి భారతదేశం కన్న కలను ఆనందమఠం నవలలో బీజప్రాయంగా దర్శిస్తాం. ఆ నవలను బంకిం బాబు ఐదు పర్యాయాలు తిరగరాశారు. ఐదో ప్రతి ప్రమాణికమైనదిగా ప్రసిద్ధి గాంచింది. దీనిని తన సంపాదకత్వంలో వెలువడిన బంగదర్శన్‌లోనే 1881 నుంచి 1882 మధ్య ధారావాహిక నవలగా వెలువరించారు.
భారతదేశంలో వెలువడిన తొలి రాజకీయ నవల ఆనంద మఠమని చాలామంది విమర్శకుల అభిప్రాయం. హిందూ విశ్వాసాలను భావవాదంతో ఆదర్శనీయంగా చిత్రించి వాటిని పునరుత్తేజింప చేయడమే ఆయన ఆశయం. ఇంకా చెప్పాలంటే బెంగాలీలు కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తేవడానికి రచనల ద్వారా ఆయన ప్రయత్నం చేయ దలిచాడని కూడా కొందరు విమర్శకులు చెబుతారు.
కానీ భావాత్మకమైన తన ఆశయానికి తగ్గట్టు బలీయమైన పాత్రలను, సన్నివేశాలను ఆయన కల్పించారు. వర్తమాన తరాన్ని తట్టి లేపి, ఒక గొప్ప ఆశావహమైన భవిష్యత్తు వైపు అడుగులు వేసేటట్టు చేయడానికి గతాన్నీ, అందులోని వైభవాన్నీ బంకింబాబు ఆశ్రయించారు. వర్తమాన తరాలను జాతీయవాదం వైపు మళ్లించడంలో ఆయన ఆశయం ఒకటే. జాతీయవాదంలోనే ఆశావాదమూ అంతర్లీనంగా ఉంటుంది. ఆయన తొలితరం ఆధునిక జాతీయవాది.
జాతీయవాదం అనే ఆంశాన్ని నిర్వచించిన వారిలో ప్రథముడు కూడా. అందుకే దేశం ఆయన కల్పనలో మాతృమూర్తి కాగలిగింది. ఆయన ఆనందమఠంలో ఆవిష్కరించిన భావన ఇదే కావచ్చు. జాతీయతావాదం, హిందూ ఆధ్యాత్మిక తలను మేళవిస్తూ ఆయన ఆనందమఠంలో శిల్పించిన భావనే తల్లి భారతిగా రూపుదిద్దుకుంది.
ఆమె ఒకప్పుడు రత్నరాసులతో తులతూగింది. ఇప్పుడు గర్భదారిద్య్రం అనుభవిస్తున్నది. అందుకే తాను కోల్పోయిన గత వైభవాన్ని సాధించిపెట్టమని ఈ తల్లి తన సంతానాన్ని అర్ధిస్తున్నది కూడా. అదే సమయంలో ఆ మాతృమూర్తిని శక్తి స్వరూపిణిగా చిత్రించారు బంకించంద్ర. వందేమాతర గీతంలో కనిపించే తల్లి ఆమెయే.
కొన్ని శతాబ్దాల తరువాత జాతీయ భావానికి ప్రాణప్రతిష్ట చేసే సందర్భం 18వ శతాబ్దంలో వచ్చింది. అందుకు దోహదం చేసినవారిలో బంకించంద్ర పప్రథములు. ప్రపంచ చరిత్రలోనే కీర్తిగాంచిన మన స్వాతంత్య్ర పోరాటానికి తాత్త్విక నేపథ్యాన్ని కూర్చిన జాతీయ భావనను బంకించంద్ర తన పాటలో ఎలా పొందుపరిచారు?
దేశమాతను దుర్గగా ఆయన దర్శించారు. రాక్షస సంహారానికి పురాణాలలో ప్రసిద్ధిగాంచిన దుర్గామాత తన శక్తిని మళ్లీ తనలో ఆవాహన చేయవలసిందని తన పుత్రులను అడుగుతుంది. ఈ పాట తొలితరం స్వరాజ్య సమరయోధులను ఎంతగా ప్రభావితం చేసిందంటే, వారి ఒక చేతిలో భగవద్గీత, మరొక చేతిలో రివాల్వర్….నాలుక మీద ‘వందేమాతరం’ నినాదం.
జాగృతి సౌజన్యం తో…
(vsktelangana.org)