నీ తరం వందేమాతరం..నేటి తరం దుర్మార్గమే నిరంతరం!

వందేమాతరమన్నది
నీ నినాదం..
మమ్మాపఎవరి తరమన్నది
నేటి మా నేతల విధానం..
సుజలాం..
స్వజులుం..
సుఫలాం..
స్వలాభాం..
ద్రుమదళ శోభిని..
దుమ్ము దులపడమే
మా పని..
బంకించంద్రా..
అయ్యో రామచంద్రా
పాపాపంకిలం
ఈనాటి మా చరితం..
నువ్వు రాసిన గీతం..
ఇప్పుడు తిరిగిరాని
మన మహోన్నత గతం..
ఏడాదికోసారి చదువుకునే నలిగిపోయిన కాగితం..
మసకబారిపోయిన
భరత జాతి ఇంగితం..
అన్నట్టు..
మందేమాతరం అంటూ
వరస కట్టి ఒకే రోజున
కోట్ల రూపాయల
గుడుంబా తాగి నిషాగీతమాలపించిన జాతికి..జోహారా..
పారాహుషారా..
బంకించంద్రకు క్షమాపణలతో..

బంకించంద్ర రచనలు
సమాజంలోని కుళ్ళును
పేల్చిపారేసే తుపాకీగుళ్ళు..
దుర్మార్గపు పోకడలను
పటాపంచలు చేసే
ఇనపగుళ్లు…
మనసులోని మధురభావాలను
తట్టిలెేపే రసగుళ్లు..
నీలోని మరో నిన్ను
ఎత్తిచూపే పగుళ్లు..!

బంకించంద్ర నాయికలు
స్వేచ్చా విహంగాలు..
అన్యాయాలను ధైర్యంగా
ఎదిరించే వీరనారీమణులు..
నిజానికి వారు నాయికలు
కాదు..నాయకులు..!

ఆయన రచనల్లోని
సన్నివేశాలు వాస్తవికతకు
దర్పణాలు..
ఒక్కోసారి ఆయన
చేసే కల్పన సైతం
నిజానికి దగ్గరే..
అవి నిన్ను వేరే లోకాల్లో
విహరింపజేసే
మాటల విమానాలు..
నీ ఊహాప్రపంచనమూనాలు!

బంకించంద్ర..రవీంద్ర..
శరత్ చంద్ర..ఈ ముగ్గురూ
వంగ సాహిత్యంలో
అద్భుత విహంగాలు..
భారతీయ సృజనాత్మకతకు
పట్టం కట్టిన
భావతరంగాలు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply