ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్పాలి

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు “ఎస్టీలకు జగన్ వెన్నుపోటు” అనే హెడ్డింగ్ పెట్టి చాలా నీచ నికృష్టమైన రాతలు రాసింది. అది రాసిన వాడు కడుపుకు అన్నం తింటున్నాడు లేదా ఇంకేదైనా తింటున్నాడో తెలియడం లేదు. ప్రభుత్వం మీద అక్కసుతో ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టీ ఒక వర్గం మీదకి ఇంకొక వర్గాన్ని ఊసిగొల్పెలా దుర్మార్గపు రాతలు రాయడం హేయమైన చర్య.

సచివాలయంలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన SO పోస్టులలో ఎస్టీ మరియు వికలాంగుల కోటాకు సంబంధించిన ఎనిమిది వేకెన్సీలను వారికి కేటాయించకుండా జనరల్ అభ్యర్థులకు ప్రమోషన్లు ఇస్తున్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఇది పూర్తిగా అవాస్తవం. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఎస్టీ మరియు వికలాంగుల కోటకు సంబంధించిన ఎనిమిది వేకెన్సీలను అలాగే ఉంచడం జరిగింది అందులో ఒక్క వేకెన్సీ ని కూడా జనరల్ అభ్యర్థులకు కేటాయించలేదు.

DPC నిర్వహించడం ఆలస్యం అవుతున్నందున 2023, ఆగస్టు 31 తర్వాత వచ్చిన వేకెన్సీలను 2022-23 ప్యానెల్ సంవత్సరంలో మిగిలిపోయిన అభ్యర్థులకు ప్రమోషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అనుమతించారు. ఇది రెగ్యులర్ గా జరుగుతున్న చర్య. పది రోజుల కిందట ఇదే రీతిన పైస్తాయిలో ముగ్గురికి ప్రమోషన్లు ఇచ్చారు అందులో ఒక ఎస్సీ అభ్యర్థి అడిషనల్ సెక్రటరీ ప్రమోషన్ పొందారు. ఇది చాలా సాధారణమైన విషయం.

ఇంత చిన్న విషయాన్ని చిలువలు పలువలు చేసి ఎస్టి కోట పోస్టులను జనరల్ అభ్యర్థులకు ఇస్తున్నారని, పాత డేట్లు వేసి ప్రమోషన్ ఇస్తున్నారని, ఎలిజిబులిటీ ఉన్న ఎస్టీలకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఇలా పచ్చి అబద్దాలతో పరమ నీచమైన వార్తలు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీనిని ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు తప్పుడు వార్త రాసినందుకు క్షమాపణలు చెప్పి దానికి సరైన వివరణ రేపు మొదటి పేజీలో ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నాము. అలా చేయని పక్షంలో రేపు సచివాలయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలకు నిరసన తెలియజేయడంతో పాటు ఆ పత్రికా ప్రతులను దహానం చేసి ఆ పత్రికను బహిష్కరించాలని పిలుపునివ్వడం జరుగుతుంది.

– కాకర్ల వెంకట రామిరెడ్డి
అధ్యక్షుడు
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం

Leave a Reply