శ్మశానాంధ్రప్రదేశ్‌గా మారుస్తారా?

-తెలంగాణకు వలస వెళ్తున్న ఆంధ్ర ప్రజలు
-రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న ప్రజలు
-గతంలో పాలమూరు, కరీంనగర్ ప్రజలు వలసలు వెళ్లేవారు
-తెలంగాణలో ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

” రాష్ట్రం నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మహబూబ్ నగర్, కరీంనగర్ వాసులు ఇలాగే బొంబాయి , సూరత్ లకు వలసలు వెళ్లేవారు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్ర ప్రజలిప్పుడు తెలంగాణకు వలసలు వెళ్తున్నారు. ఆంధ్రాను స్మశానంగా మార్చేదిశగా అడుగులు వేస్తున్నామేమోనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు .

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు సక్రమంగా అందితే, ఇంజనీరింగ్ , డిగ్రీ కాలేజీలలో పూర్తిస్థాయిలో సీట్లు విద్యార్థులతో ఎందుకు భర్తీ కావడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశమంతా కాలేజీలలో అడ్మిషన్లు తగ్గాయని సాక్షి దినపత్రికలో కథనం రాసినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలలో, మరి ఎందుకని విద్యార్థులకు అడ్మిషన్లు లభించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలలో సీట్లు లభించక పోతుండగా, ఆంధ్ర రాష్ట్రంలోని కాలేజీలలో అడ్మిషన్ల గురించి అడిగే వారే లేరని ఎద్దేవా చేశారు. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసే వారి సంఖ్య కూడా రాష్ట్రంలో తగ్గిపోయిందన్న ఆయన, గత మూడేళ్లలో ఏడాది, ఏడాదికి కాలేజీలలో అడ్మిషన్లు తగ్గుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో 1,40,000 సీట్లు ఉండగా కేవలం 76 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అంటే ఇంకా 50 శాతం స్థానాలు ఖాళీగానే ఉన్నాయన్నారు. ఇక డిగ్రీ కాలేజీలలో 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని చెప్పారు.

సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రగతి ఒక్క సాక్షి దినపత్రికలో మాత్రమే కనిపిస్తుందని, కానీ రాష్ట్ర ప్రజలంతా నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు లేవని, ప్రజలకు ఏమి లేదని… పరిస్థితులు అద్వానంగా ఉన్నాయన్న ఆయన, సాక్షి దినపత్రికలో మాత్రం వాడు అది చూసి అబ్బా అన్నాడు… ఇది అబ్బా అన్నాడని డబ్బా కొట్టుకునే వార్తలు మినహా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చివరకు ధార్మిక పరిషత్ విషయంలోనూ కోర్టుకు వెళ్లి న్యాయాన్ని పొందవలసి పరిస్థితి వచ్చిందని చెప్పారు.

రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెడితే వినాయక విగ్రహం, అదే టిడిపి నాయకులు పెడితే ఆగ్రహం అన్నట్లుగా గణేష్ మండపాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. దేవుడు అన్ని పార్టీలకు సమానమేనని ఎవరు విగ్రహం పెట్టినా స్వాగతించాల్సిందేనని పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధించడం గురించి తాను మాట్లాడిన తర్వాత, బిజెపి నాయకులు కూడా గట్టిగా మాట్లాడడం జరిగిందన్నారు. దానితో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్న ఆయన, ఇంకా కొన్నిచోట్ల విగ్రహాలను ఎత్తుకుపోయారని ప్రముఖ దినపత్రికలలో ఫోటోలతో సహా అచ్చైందని, ఈ పద్ధతి మారాలని చెప్పారు.

ఉద్యోగులపై దాష్టికాలు పెరిగాయి
రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉక్కు పాదం మోపాలని చూడడం దారుణమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఉద్యోగులపై ఉక్కు పాదం మోపుతున్న తమ ప్రభుత్వం, ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని దురాగతాలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రం నలుమూలల రైళ్లలో బస్సులలో పోలీసులను పెట్టి తనిఖీలు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠాలను బోధిస్తుండగానే వెళ్లి పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. ఈ తరహా చర్యల వల్ల, ఉపాధ్యాయులపై, విద్యార్థులకు ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుందని ప్రశ్నించిన ఆయన, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే… ఉపాధ్యాయుల పై దొంగల మాదిరిగా బైండోవర్ కేసులు పెట్టడం ఏమిటని నిలదీశారు.

ఇప్పటికే లక్ష మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలిసిందన్నారు. ఇక ఒక ఉపాధ్యాయుడు కర్నూలుకు చావుకు వెళితే , అక్కడకు కూడా వెళ్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎమర్జెన్సీ నాటి రోజులను తలపిస్తున్నాయన్నారు. ఎమర్జెన్సీ కాలం తర్వాత జరిగిన ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓటమి పాలయ్యిందని, మన రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు, ఇప్పుడు 11వ తేదీకి వాయిదా వేసుకున్నాయని, ఆ కార్యక్రమం జరుగుతుందా? జరగదా? అన్నది ప్రశ్న కాదన్నారు.

అమలు చేయలేని హామీలను ఎవరు ఇమ్మన్నారు?
ప్రతిపక్ష నేతగా ఇష్టారీతిలో అమలు చేయలేని హామీలను ఎవరు ఇవ్వమన్నారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమని చెప్పింది ఎవరని ఆయన నిలదీశారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి, నెగ్గిన తర్వాత చూసుకుందాంలే అన్నట్లుగా నోటికొచ్చింది మాట్లాడి…మనకు మనమే హరిశ్చంద్రుల మని కితాబు నిచ్చుకొని ఇప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చమంటే ఈ రకమైన వేధింపులు ఎందుకని రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.

ఇల్లు ముట్టడి అంటే… వినతి పత్రం ఇచ్చి వెళ్తారు
ఇల్లు ముట్టడి కార్యక్రమం అనేది ఒక సింబలిక్ గా మాత్రమే వాడుతారని, అంతేకానీ ఆ పదాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నానా దురాగతాలు చేయడం సరికాదన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని మార్లు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టలేదని ప్రశ్నించారు. ఇల్లు ముట్టడి అన్న, అసెంబ్లీ ముట్టడి అన్న తమ నిరసనను తెలియజేసి, ఒకప్రతినిధి బృందం వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి వెళ్తారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను దారుణంగా అణిచివేయాలనుకోవడం కరెక్ట్ కాదని రఘురామకృష్ణం రాజు చెప్పారు.

నిరసనను తెలియజేసే హక్కు రాజ్యాంగమే కల్పించిందని, నిరసన తెలియజేసి హక్కును కాల రాసేందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు తమ బాధను తెలియజేయడానికి నిరసనను తెలియజేస్తూ ఉంటారని చెప్పారు. నిరసనను తెలియజేసే హక్కును కాదనడానికి ఇదేమి రాచరిపు వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ అని గుర్తు చేశారు. యుద్ధాలు చేసి ఎదుటి రాజుని చంపి రాజ్యాన్ని కైవసం చేసుకోలేదని, ప్రజలేమి గులాములు కాదని… ఐదేళ్ల తర్వాత వారు ఓటు తో విసిరి కొడితే ఎక్కడకో వెళ్లి పడతామని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇస్తే ఇస్తామని, లేకపోతే లేదని స్పష్టంగా చెప్పాలన్న ఆయన, ఎవరి పనితీరు బాగాలేదని తన ఒక్కడి పనితీరే బాగా ఉందని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి… మీ పని తీరు బాగుంటే అందరూ గెలుస్తారని, మీ పనితీరే బాగా లేకపోతే అందరూ పోతారని అన్నారు.

మన హృదయం కల్మషం… కలుషితం అని తెలిశాక ఓట్లు రాలవు
మన హృదయం కల్మషం, కలుషితమని తేలిపోయిన తర్వాత ఓట్లు రాలవని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని మాటల్లో చెప్పడం కాదని… చేతల్లో చేసి చూపించాలన్నారు. సిపిఎస్ రద్దు, సంపూర్ణ మధ్య నిషేధం వంటి హామీలైన అమలు చేయాలని సూచించారు. సిపిఎస్ రద్దు చేసి, కొద్దిలో కొద్దిగా నైనా నష్టాన్ని నివారించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులను మరింత కెలికితే పార్టీకే నష్టమని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను దూరం చేసుకోవద్దని హితవు పలికారు.

లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు జరిగిన అన్యా యాన్ని తమ బంధువులకు, వారు వారి బంధువులకు చెప్పే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఉద్యోగ ఉపాధ్యాయులను దూరం చేసుకోవద్దని చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించి మాట్లాడాలన్న ఆయన, తటస్తులను మాత్రమే చర్చలకు పిలువాలని సూచించారు.

ఇప్పటివరకు మనం చెప్పిందేది ఒక్కటి కూడా చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే మనం హైపిక్సెల్ లో ఎంతటి రాక్షసులమో మన ముఖచిత్రాన్ని ప్రజలకు చూపించామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో టిడిపి సానుభూతిపరులు వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతుల ఇంటిలో జరిగిన దొంగతనాన్ని పరిశీలిస్తే, దొంగలు వారి ఆస్తిని దోచుకోవడానికి వచ్చినట్లు కనిపించడం లేదని అన్నారు. నగలు వదిలేసి చిల్లర పట్టుకొని వెళ్లారని, దీనితో వచ్చినవారు ఆ దంపతులను హత్య చేయడానికి వచ్చినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. కేసులు పెడితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తున్నాయని భావించి, వైసిపి సోషల్ మీడియా ఉన్మాదులే ఈ పని చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

అప్పులపై వడ్డీకే ఆదాయం సరిపోతుంది
రాష్ట్ర ప్రభుత్వాదాయం చేసిన అప్పులపై వడ్డీకే సరిపోతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు అనుకుంటే, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు, దానిపై వడ్డీలకే 40000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సూట్ కేస్ కంపెనీల తరహాలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేరిట తీసుకున్న దొంగ అప్పులకు మరో 20 వేల కోట్ల రూపాయలు వడ్డీలు, అసలు చెల్లింపు రూపంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము, ఖర్చు ఒకే విధంగా ఉండడంతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.

ప్రస్తుతం అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని, ఒక దశలో అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదన్నారు. ఉద్యోగులకు, జీతాలు, పెన్షన్ల చెల్లింపుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా సెటిల్ చేయలేకపోయిందన్నారు. దీనితో ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని ముంచేస్తారని భావించిన ఉద్యోగులు, అడ్వాన్సుల రూపంలో తమ బెనిఫిట్స్ చెల్లించాలని అర్జీలు పెట్టుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి జీతాలు వస్తాయో, రావో నన్న మానసిక ఆందోళనలో ఉద్యోగులు తమ జీవితాలను గడుపుతున్నారన్నారు.

ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించకుండా , వారు తప్పు చేసే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు.. భవిష్యత్తుపై భరోసా ఉంటేనే ఎవరైనా నిజాయితీగా పని చేయగలరని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణ రత్న బిరుదు ఇవ్వాలని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రుణ భూషణ్ బిరుదు ఇవ్వాలని అపహాస్యం చేశారు .

మనుషులా? … పశువులా??
సొంత ఖర్చుతో పేదలకు అన్నం పెట్టాలని తపించి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వంశం చేయడం దుర్మార్గమని రఘురామకృష్ణం రాజు అన్నారు. కుప్పంలో అన్న క్యాంటీన్ పూర్తిగా ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మనుషులా?, పశువులా??, అన్నం తింటున్నారా?… పిండం తింటున్నారా?? అంటూ ప్రశ్నించారు. నువ్వేమో పెట్టవు… ఎవరో నలుగురు మహానుభావులు కలిసి పేదలకు అన్నం పెట్టాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తావా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి అన్నం పెట్టే మనసే లేదని విరుచుకుపడ్డారు. పేదవాడికి అది చేశాం.. ఇది చేశామని చెప్పడం అంత ట్రాష్ యే నని అన్న క్యాంటీన్లను బద్దలు కొట్టడం ద్వారా తెలియజేసినట్లు అయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

సూట్ కేసుల దాడులను కాదని న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను

ప్రతి వ్యవహారంలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులతో దాడులు చేస్తున్నారని, ఆ దాడులను తట్టుకొని తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గత 17 నెలలుగా ఎదురు చూస్తున్న పిటిషన్, కోర్టులో లిస్ట్ అయిందని చెప్పారు. సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్, మరో అధికారి విజయ్ పాల్, తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేయడం పట్ల తమకు న్యాయం చేయాలని కోరుతూ మా అబ్బాయి తాను జైల్లో ఉండగా దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో లిస్ట్ అయిందన్నారు.

కోర్టులో వాదనలు జరిగితే జరగవచ్చునని, లేకపోతే వాయిదా పడితే పడొచ్చనని తెలిపారు. కానీ తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. పోలీస్ కస్టడీలో తనని చిత్రహింసలకు గురిచేసిన దాని పై నిజ, నిజాలను తెలుసుకునేందుకు సిట్, సిబిఐ విచారణ చేయాలన్నారు. అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ ప్రస్తుత జడ్జి సమక్షంలోనే తనకు తగిలిన దెబ్బల వివరాలు తెలుసుకునేందుకు ఎక్స్ రే లు, స్కాన్లు తీయడం జరిగిందని తెలిపారు. ఎక్స్ రే లు , స్కాన్ ల ఆధారంగా తనని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న నిర్ధారణకు వచ్చారన్నారు. తనని చిత్రహింసల గురిచేయడాన్ని ఒకరు కెమెరా ద్వారా చిత్రీకరించగా, ఎవ డో లఫూట్ గాడు చూసి ఆనందించాడన్నారు.

కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారికి శిక్ష తప్పదని, రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని చూసిన, చట్టం, కేంద్ర ప్రభుత్వం శిక్షించి తీరుతుందన్నారు. పాపులు శిక్షింపబడుతారని అన్ని మత గ్రంధాలు చెబుతున్నాయని , దాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తానని తెలిపారు. ఎంతోమంది అధికారులు ప్రస్తుతం వీఆర్ లో ఉన్నప్పటికీ పదవీ విరమణ చేసిన విజయ్ పాల్ కు పదే, పదే పదవిని పొడగిస్తూ, పదోన్నతి కల్పించడం వెనుక ఆంతర్యం ఏమిటనీ జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ హక్కుల గురించి మాట్లాడాలి
రాష్ట్రంలో ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు తమ హక్కుల గురించి మాట్లాడాలని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని సాటి రెడ్డికి తాత్కాలిక డీజీపీ హోదాను జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారన్నారు. ఆరు నెలలు, ఆరు నెలలు అంటూ పదవిని పొడిగిస్తూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జీవచ్ఛవాల మాదిరిగా వ్యవహరిస్తున్నారే తప్పితే తమ హక్కుల గురించి మాట్లాడడం లేదని అన్నారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోలేని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు… ఇక ప్రజల సమస్యలను ఏమి పరిష్కరిస్తారన్నారని ప్రశ్నించారు.. మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పాలని, మీ ప్రతినిధిగా తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Leave a Reply