– బ్యాంకు ఖాతాల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించింది
– కలెక్టరేట్ లో సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం
– అర్హులైన వారికి తప్పనిసరిగా ప్రభుత్వ సహాయం అందుతుంది
– ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
– ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ లో ఉన్న 18 వేల కుటుంబాలకు గాను 4 వేల కుటుంబాలు ఇప్పటికే ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారం అందిందని.. మిగిలిన 14 వేల కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వమే పరిష్కరించిందని.. వీరికి రెండు రోజుల్లో పరిహారం అందుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఖాతా మనుగడలో లేకపోవడం, మరణించిన వారి పేరిట ఉండడం, మైనర్ పేరిట ఉండడం తదితర కారణాలవల్ల 14 వేల కుటుంబాల కు పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించి వాటిని 179 సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, అర్హత ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.