గుంటూరు: వైసీపీ హయాంలో బోరుగడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తనను బెదిరించడంతోపాటు డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డపై కుంచనపల్లికి చెందిన పాస్టర్ నల్లపు మరియదాసు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట ఈ ఎల్ సి చర్చ్ పాస్టర్ గా ఉన్న మరియదాసుని చర్చికి ఫారెన్ ఫండ్స్ ఇప్పిస్తానని పాస్టర్ ని బోరుగడ్డ మభ్యపెట్టాడు.
పది లక్షలు ఇస్తే విదేశీ నిధులను మంజూరు చేయిస్తానని నమ్మ పలికాడు. దీనితో ఐదు లక్షల రూపాయలతో బోరుగడ్డ ఇంటికి ఆయన బంధువు రాజేందర్ తో కలిసి మరియదాసు వెళ్ళాడు. ఫారెన్ ఫండ్స్ ఎలా ఇప్పిస్తారు అని అడగడంతో తనను బెదిరించి ఐదు లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
విదేశీ నిధులు వచ్చాక దానిలో భాగం కూడా ఇవ్వాలని, లేకపోతే ఊరుకోనంటూ భయపెట్టినట్టు చెప్పాడు. అయితే, విదేశీ నిధులు తెప్పించకుండా కాలయాపన చేశారని పలుమార్లు అడగడంతో తనపై దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది చేతనైంది చేసుకో అని బోరుగడ్డ బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వం మారాక కూడా పలుమార్లు బోరుగడ్డ వద్దకు వెళ్లి తీసుకున్న ఐదు లక్షలు ఇవ్వాలని ప్రాధేయపడిన పట్టించుకోలేదన్నారు. బోరుగడ్డపై కేసులు నమోదు అవ్వడంతో ధైర్యం తెచ్చుకొని తాను ఫిర్యాదు చేసినట్టు మరియదాసు చెప్పాడు. బోరుగడ్డకు బాధితుడికి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్ లు , చాటింగ్లను పరిగణలోకి తీసుకొని పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.