Suryaa.co.in

Andhra Pradesh

సర్వేపల్లిలో మరో జాతీయ విద్యాసంస్థ వస్తుంది

– రూ.300 కోట్లతో చవటపాళెం పరిధిలో ఎన్.సీ.ఈ, ఆర్.టీ నిర్మాణం
– నా శక్తి మేరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నా
– రోడ్ల నిర్మాణానికి కొత్తగా రూ.13 కోట్లు మంజూరు చేయించా
– వైసీపీ పాలనలో అభి వృద్ధిని విస్మరించి అక్రమార్జనలో మునిగితేలారు
– నేడు లోకేష్ కు సర్వేపల్లి నియోజకవర్గంలో ఘన స్వాగతం పలుకుదాం
– శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సర్వేపల్లి: మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ పరిధిలో శనివారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.. ఓ వైపు నేను, మరోవైపు నా కుమారుడు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నాం.. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ రూ.4 వేల నుంచి రూ.15 వేలు వరకు లబ్ధిదారులకు అందుతోంది… బీహార్ లో ఇప్పటి వరకు పింఛన్‌ రూ.400 మాత్రమే ఇచ్చే వారు..ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రూ.700 పెంచి రూ.1100 చేశారు. మొదటి నుంచి సామాజిక పింఛన్ విషయంలో చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తల్లికి వందనం పథకం విషయంలోనూ చంద్రబాబు నాయుడు కొత్త చరిత్ర సృష్టించారు..ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ పథకం వర్తింపజేసి రూ.13 వేలు చొప్పున అందించారని తెలిపారు.

ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి వస్తుండగా, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ప్రతి రైతుకు రూ.20 వేలు అందిచబోతోంది. అర్హత కలిగిన ప్రతి రైతు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించారు. కొత్తగా ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి రూ.6.50 కోట్లు నిధులు మంజూరు చేయించాం..పంచాయతీ రాజ్ రోడ్లకు కూడా మరో రూ.6.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్.సీ.ఈ.ఆర్.టి) మంజూరైంది. రూ.300 కోట్లతో వెంకటాచలం మండలం చవటపాళెం పరిధిలో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు జాతీయ స్థాయి సంస్థలున్నాయి. ఏ అవకాశాన్ని వదులుకోకుండా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాలు సమకూరుస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం నా శక్తి మేరకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

వైసీపీ పాలనలో అభివృద్ధిని విస్మరించి ఇతర కార్యకలాపాల్లో మునిగితేలారు. రైతులను సైతం వదిలిపెట్టకుండా కక్షసాధించి పొలాలను బీడు పెట్టించారు. సబ్ స్టేషన్ లో పనిచేసే గిరిజన యువకుడిని తీసేసి ఆ ఉద్యోగాన్ని మరొకరికి రూ.5 లక్షలకు అమ్మేసుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే గిరిజన యువకుడికి న్యాయం చేశాం. ఇళ్ల నిర్మాణాల పేరుతోనూ అక్రమాలకు పాల్పడి దోచుకున్నారు. భగవంతుడు అన్నీ గమనిస్తుంటాడు..ఎవరు తప్పులు చేసినా ఫలితం అనుభవించక తప్పదు అని అన్నారు.

LEAVE A RESPONSE