Suryaa.co.in

Andhra Pradesh

15న జీడిపల్లికి ‘హంద్రీనీవా’ సాగునీరు

– ఫేజ్ 2 పనులు పూర్తి చేసి జులై 31 నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీరు
– లక్ష్యాల మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలి
– గాలేరు నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించండి
– పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి
– 2026 జూన్‌కు వెలుగొండను పూర్తిచేసి నీళ్లివ్వాలి
– ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
– ఈ ఏడాది నీటి ప్రవాహాలు ఆశాజనకం… అత్యుత్తమ నీటి నిర్వహణ ద్వారా ప్రతి చుక్కా సద్వినియోగం
– నీటి లభ్యత – అవసరాలను లెక్కించి వాటర్ ఆడిట్
– జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రం ప్రభుత్వం రాయలసీమకు సాగునీరు ఇచ్చేందుకు ఏడాది కాలంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం రూ.3,890 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టింది. ఈ పనులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పురోగతిని తెలుసుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1 పనులు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. దీని కోసం రెండు మూడు రోజుల ముందు పనులు పూర్తి చేసి జూలై 15వ తేదీన నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

జీడిపల్లి నుంచి గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లను ఈ నీటితో నింపాలని చెప్పారు. అలాగే ఫేజ్-2 కాలువ ద్వారా పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు జూలై 31న నీటిని విడుదల చేయాలని సూచించారు. కాలువల విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా తొలిసారి సీమలోని వివిధ ప్రాంతాలకు సాగునీరు అందనుంది. జూలై 15న జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటి విడుదల చేసి అక్కడ నుంచి 15 రోజుల పాటు పెన్నా ఆహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించనున్నారు.

హంద్రీనీవా కాలువల ద్వారా విడుదలయ్యే 3,850 క్యూసెక్కుల నీటిని వినియోగించి రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులను నింపాలని సీఎం అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జలవనరుల శాఖపై సమీక్ష చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు, నీటి నిర్వహణకు చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

అత్యుత్తమ నీటి నిర్వహణతో ప్రతి చుక్కా సద్వినియోగం

రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో నీటి నిర్వహణ చేసి ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీని కోసం పూర్తి స్థాయి ప్రణాళికతో ప్రభుత్వ శాఖలు, అధికారులు పని చేయాలని సూచించారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుపై మరింత శ్రద్ధ తీసుకోవాలని, ఈ అంశంలో ఇరిగేషన్ శాఖతో పాటు పంచాయతీ రాజ్ శాఖను కూడా భాగస్వామిని చేయాలని సీఎం అన్నారు.

ఆశాజనకంగా నీటి ప్రవాహాలు

జలవనరుల శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులు రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి లభ్యత, ప్రవాహాలపై సీఎంకు వివరించారు. ఒక్క కడప జిల్లా మినహా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతమే ఉందని.. రానున్న రోజుల్లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లలో ప్రస్తుతం 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని… గత ఏడాది ఇదే సమయంలో కేవలం 182 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు వివరించారు. గతంలో కంటే ఈ ఏడాది 236 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.

రానున్న రోజుల్లో కురిసే వర్షాల కారణంగా సమృద్ధిగా అన్ని ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతుందని… సమగ్ర నిర్వహణ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సీఎం అన్నారు. వచ్చే ప్రవాహాలను హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా సీమలో ప్రతి ప్రాంతానికీ తరలించి అన్ని రిజర్వాయర్లు నింపాలని సీఎం అన్నారు. పెన్నా బేసిన్‌లో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు ఎక్కువ అవకాశం ఉందని… ప్రస్తుతం ఆ ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీరు ఇచ్చి, అనంతరం ప్రాజెక్టులను నింపాలన్నారు.

అదే విధంగా కడపకు నీళ్లు ఇచ్చే గాలేరు నగరి కెనాల్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. హంద్రీనీవా ఫేజ్ 2 కాలువ ద్వారా చిత్తూరు జిల్లాలోని చివరి ప్రాంతాలకూ నీరు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిచాలని సీఎం ఆదేశించారు.

ఈ నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ… 2026 జూన్‌కు వెలిగొండ

ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దీనికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులు వేగంపెంచి జూలై 31కి పూర్తి చేయాలన్నారు. అనకాపల్లికి వరకు నీరు తీసుకువెళ్లేందుకు అవసరమైన 7 ప్యాకేజీలు పూర్తి చేయాలని… ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని సీఎం స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చర్చ

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించి నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని సీఎం సూచించారు. తారకరామ తీర్థ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయాలని, తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలన్నారు. వంశధార-నాగావళి అనుసంధానంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఉత్తారాంధ్ర సుజల స్రవంతిని వీటికి అనుసంధానించేలా ప్రణాళిక అమలు చేయాలన్నారు.

వాటర్ ఆడిటింగ్

రాష్ట్రంలో కురిసే వర్షపాతం, నదుల నుంచి వచ్చే ఇన్ ఫ్లోస్, భూగర్భ జలాలు, సాగు, మంచినీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని లెక్కించి పక్కాగా వాటర్ ఆడిటింగ్ చేయాలని సీఎం సూచించారు. వాసార్ ల్యాబ్స్ ద్వారా నీటి ఆడిటింగ్ చేపట్టి… సమర్ధ నీటి వినియోగం కోసం అవసరమైన ప్రణాళిక అమలు చేయాలన్నారు. పని చేయకుండా ఉన్న ఫిజియోమీటర్లు, వాటర్ లెవల్ తెలిపే సెన్సార్ సిస్టం, రెయిన్ గేజ్ స్టేషన్స్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. దీనికి అవసరమైన నిధులు మంజూరుకు సీఎం అంగీకారం తెలిపారు.

భూగర్భ జల మట్టాలను కనిష్టం 3 మీటర్లు, గరిష్టం 8 మీటర్లు లక్ష్యాన్ని సాధించేలా జలవనరుల శాఖ పని చేయాలని సీఎం అన్నారు. చీఫ్ ఇంజనీర్‌లు ప్రాజెక్టులు మాత్రమే తమ పరిధి అనుకోకుండా… ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపులో కూడా భాగస్వాములు కావాలని సీఎం అన్నారు.

పూడిక తీత, చెరువులు నింపడం, చెక్ డ్యాంల నిర్మాణం వంటి చర్యల ద్వారా భూగర్భ జలాలపెంపు లక్ష్యాన్ని సాధించాలని సీఎం సూచించారు. నీటి నిర్వహణను సక్రమంగా చేస్తే కరవు అనే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE