Suryaa.co.in

National

భూటాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు

  • భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్ తో కలిసి దరంగా వద్ద ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
  • పొరుగుదేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవాల్నదే భారత్ అభిమతమన్న కేంద్ర మంత్రి
  • చెక్ పోస్ట్ తో పొరుగుదేశాలతో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్న బండి సంజయ్
  • లాజిస్టిక్ ఖర్చులు కూడా ఆదా అవుతాయని పేర్కొన్న కేంద్ర మంత్రి

భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోంలోని దరంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది. భూటాన్ ప్రధానమంత్రి శెరింగె తోబ్గే, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’’ ప్రారంభమైంది. ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. చెక్ పోస్టు ఏర్పాటుతో భారత్ కు లాజిస్టిక్ ఖర్చుల భారం చాలా మేరకు తగ్గనుంది.
ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింతగా పెరగనున్నాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను సులభతరం కానుంది.

ఈ చారిత్రాక పరిణామం నేపథ్యంలో అసోంలోని దరంగా వద్ద ఏర్పాటు చేసిన ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు’ ప్రారంభ కార్యక్రమంలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ… ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభంతో భారత్, భూటాన్ దేశాల బహుళ సంబంధాన్నిమరింత సన్నిహితం చేయడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలలో ప్రామాణికత ఏర్పడిందన్నారు. భారత-భూటాన్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక సౌభ్రాతృత్వం, గొప్ప విశ్వాసం పైన నిర్మించబడ్డాయన్నారు.

ఇరుదేశాల మధ్య స్నేహం, సహకారం, సామాజికత మన భాగస్వామ్యానికి ప్రబల సాక్ష్యమని పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం సహకార భద్రతా పునాదులు. నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తి, సమాచార, ఆరోగ్యం, సాంస్కృతిక మార్పిడి, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన మరియు విద్య వంటి కీలక రంగాలకు విస్తరించిందన్నారు. ఇమ్రిగ్రేషన్ చెక్ పోస్టు ఏర్పాటువల్ల రవాణా, వాణిజ్య తోడ్పాటు అందించడం మాత్రమే కాకుండా పొరుగున ఉన్న దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న భారత్ దృష్టికోణానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

హోంశాఖ పరిధిలోని ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(LPAI) సరిహద్దుల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులు కూడా అందిస్తుందన్నారు. అట్లాగే ప్రయాణికులకు, వ్యాపారులకు సౌకర్యవంతమైన, భద్రత, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోందన్నారు. దరంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ద్వారా పొరుగు దేశాలతో ఆర్థిక సహకార, సామాజిక సంబంధాల్లో నూతన అవకాశాలను సృష్టించేందుకు అవసరమైన డిజిటల్ మార్గాలను అన్వేషిస్తోందన్నారు.

సరిహద్దుల వ్యాపారంలో విప్లవాత్మక మార్పులకు, భద్రతను పెంచడానికి అత్యాధునిక వనరులను ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమకూర్చిందన్నారు. అట్లాగే ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (LPMS ) ద్వారా ఆన్‌లైన్ పార్కింగ్ రిజర్వేషన్, ఆటోమేటెడ్ స్టోరేజ్, సులభతర నియంత్రణ అనుమతులు వంటి సౌకర్యాలతో ల్యాండ్ పోర్ట్ కార్యకలాపాలను డిజిటైజ్ చేస్తుందన్నారు. ఇది కేవలం ఆపరేషనల్ సమర్థతను పెంచేదే కాకుండా, సరకు మరియు ప్రయాణికుల భద్రతను కూడా మెరుగుపరుస్తోందన్నారు.

ల్యాండ్ పోర్ట్ల విస్తరణ కేవలం రోడ్డు మార్గం వరకు పరిమితం కాదన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీకి మార్గం సుగమమైందన్నారు. రైల్వే, అంతర్రాష్ట్ర జలమార్గాలను రోడ్డుకు కనెక్ట్ చేసి పొరుగుదేశాలతో మరింత వాణిజ్య సామర్ద్యాన్ని పెంపొందించడమే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యమన్నారు. భవిష్యత్తులో భూమి, రైల్వే, జలమార్గాలను కలిపి సరిహద్దుల మధ్య సరకు, సేవలు నిరంతరం కొనసాగేలా మద్దతు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గుతాయన్నారు. 2030 నాటికి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో ప్రస్తుత టాప్ 25 దేశాల జాబితాలో చేరాలన్న ప్రభుత్వ విజన్ కు కూడా నేటి కార్యక్రమం బలాన్ని ఇస్తుందన్నారు.

LEAVE A RESPONSE