-అరకులో అడ్డా
-భార్యను పంపించి బుక్కైపోయిన కోటేశ్వర రావ్
-కోటేశ్వర్ రావ్ ఎస్కేప్
-డీజేతో మ్యాటర్ లీక్
ఆంధ్రప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో గంజాయి పండించి గుట్టుచప్పుడు కాకుండా ఐటీ హబ్ లో విక్రయిస్తున్న నలుగురు మహిళలతో పాటు ఓ విదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించే ముఠా నాయకుడు మిస్ అయినా, అతని భార్య మాత్రం పోలీసులకు చిక్కిపోయింది. డ్రగ్స్ కింగ్ పిన్ వైజాగ్ కోటేశ్వర్ రావ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకుల గెటప్ తో వెళ్లిన పోలీసులు, సినిమా ఫక్కీలో డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళలను పట్టుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ. 7. 80 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు సిటీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే కింగ్ పిన్ వైజాగ్ కోటేశ్వర్ రావ్ భార్య, పాంగి పూర్ణమ్మ, కుడేరి పుష్పా, గుడి విజయా, దేవి, నైజీరియా దేశానికి చెందిన జాన్ అలియాస్ డేవిడ్ అనే ఐదు మందిని అరెస్టు చేసి, రూ. 7. 80 కోట్ల విలువైన 8 కేజీల హ్యాషిక్ ఆయిల్, 10 కేజీల గంగాయి, 1 కేజీ ఎండీఎంఏ క్రిస్టల్ సీజ్ చేశారు.
పోలీసులు దాడులు చేసే సమయంలో డ్రగ్స్ కింగ్ పిన్ కోటేశ్వర్ రావ్ తప్పించుకుని పారిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు. కోటేశ్వర్ రావ్ తప్పించుకున్నా అతని భార్య పూర్ణమ్మ అండ్ కో మాత్రం పోలీసుకు చిక్కిపోయారు. కోటేశ్వర్ రావ్ కోసం బెంగళూరు సిటీ పోలీసులు గాలిస్తున్నారు.
అరకు, చింతపల్లిలో అడ్డా
ఆంధ్రప్రదేశ్ లోని అరకు, చింతపల్లి అటవి ప్రాంతంలో కోటేశ్వర్ రావ్ అతని అనచరులు పెద్ద ఎత్తున గంజాయి పండిస్తున్నారని బెంగళూరు పోలీసులు అంటున్నారు. అరకు, చింతపల్లిలోనే గంజాయితో హ్యాశిష్ ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్ బెంగళూరు తీసుకు వచ్చి సీక్రేట్ గా డ్రగ్స్ డీలర్స్ కు విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు.
మమూలుగా డ్రగ్స్ కొనుగోలు చేసే వారికి తప్ప, కోటేశ్వర్ రావ్ బయటి వ్యక్తులకు డ్రగ్స్, గంజాయి విక్రయించడని బెంగళూరు పోలీసులు తెలుసుకున్నారు. ఇటీవల బెంగళూరులో వివేక్ నగర్ లో డీజేని అరెస్టు చేసిన పోలీసులు , అతని నుంచి సమాచారం సేకరించారు. డీజే ఇచ్చిన సమాచారంతో కోటేశ్వర్ రావ్ అండ్ కో విషయాలు బయటకు వచ్చాయి.
గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకుల గెటప్స్ తో వెళ్లిన బెంగళూరు పోలీసులు , మాకు డ్రగ్స్ కావాలని కోటేశ్వర్ రావ్ ను కలిశారు. పుట్టపర్తి బస్ స్టాప్ దగ్గరకు మీరు వస్తే మా వాళ్లు వచ్చి మీకు డ్రగ్స్ ఇస్తారని కోటేశ్వర్ రావ్ చెప్పాడు. బస్ స్టాండ్ లో డ్రగ్స్ తీసుకుని వచ్చిన నలుగురు మహిళలను సినిమా ఫక్కీలో పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో డీల్ కావడంతో , కోటేశ్వర్ రావ్ అతని భార్య పూర్ణమ్మను వెంట పంపించి బుక్కైపోయాడని పోలీసులు అంటున్నారు.