– అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా… పక్క రాష్ట్రాలతో పోటీ
– ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… హామీల అమలులో మిన్న
– వైసీపీకి ఇచ్చిన ఒక్క అవకాశంతో పాతికేళ్లు వెనక్కి
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అద్దంకి: సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బల్లికురవలో బుధవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ నిధులతో 16 తోపుడు బళ్లు చిరు వ్యాపారులకు, 8 ట్రై స్కూటీలను దివ్యాంగులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ తరువాత ఎస్సీ, బీసీ కాలనీలతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వేల కోట్ల రూపాయిలను సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్రంలోని 67 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున తల్లికి వందనం అందించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి పథకం అందేదని చెప్పారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోనే ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్లతో రోడ్లు నిర్మించినట్లు వెల్లడించిన మంత్రి గొట్టిపాటి… గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీ రోడ్లుతో పాటు తారు రోడ్లు కూడా నిర్మించామన్నారు.
వేధింపులతో పెట్టుబడిదారుల పరార్
ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వ చర్యలతో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఆమడ దూరంలో ఆగిపోయిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. గత ప్రభుత్వ వేధింపులతో ఎందరో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపి తిరిగి పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారుల్లో మరలా నమ్మకం కలిగించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా యువనేత లోకేష్ అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు రాయలసీమ, అనంతపురం వంటి జిల్లాలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి 16,300 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నామని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా….
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. పథకాల అమలు, ప్రజల సంతృప్త స్థాయిలకు సంబంధించి అధికారులు కీలకంగా వ్యవహరించాలన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా… ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ తో పాటు మిగిలిన పథకాలనూ త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.