Suryaa.co.in

Andhra Pradesh

నా భర్త మరణంపై అనుమానాలున్నాయి

– అంబులెన్సులో ఏదో జరిగినట్లనిపిస్తోంది
– సింగయ్య భార్య లూర్దు మేరీ సంచలన ప్రకటన

తాడేపల్లి: వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం చీలి సింగయ్య భార్య లూర్దు మేరీ, కుమారులు, కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. నా భర్త మరణంపై అనుమానాలున్నాయి… అంబులెన్సులో ఏదో జరిగినట్లనిపిస్తోందని సింగయ్య భార్య లూర్దు మేరీ సంచలన ప్రకటన చేశారు. జగనన్న మా ప్రాంతానికి వస్తున్నారని తెలియగానే ఆయనను చూడడానికి మేమంతా వెళ్ళాం. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో, మేము కాస్త దూరంలోనే ఉండిపోయాం. కాసేపటి తర్వాత నా భర్తకు యాక్సిడెంట్‌ జరిగిందని, ఎవరో ఫోన్‌ చేస్తే తెలిసింది.

ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నారు. నా భర్త స్వయంగా తన పేరు, ఊరుతో పాటు, మా కుటుంబ సభ్యులందరి వివరాలు చెప్పారు. ఆ తర్వాత ఆయనను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలుసుకుని, మేం ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆయన చనిపోయారు. అంత వరకు బాగా ఉన్న మా ఆయనను, అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఎలా చనిపోయారు? అందుకే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళే సమయంలో అంబులెన్స్‌లో ఏమైనా చేశారా అని అనుమానం వస్తోంది. దీనిపై నిజాలు తేలాలి.

టీడీపీ వారు మా ఇంటికొచ్చారు

మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్‌ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్‌ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్పీలమే అని చెప్పారు. ఇంకా ఏవేవో మాట్లాడి ప్రలోభపెట్టాలని చూశారు. అందుకే మా ఆయన మరణంపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం తర్వాత మా ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వైయస్సార్‌సీపీ నాయకులు సిద్ధమైతే, పోలీసులు బలవంతంగా అంబులెన్సు వచ్చే వరకు ఆపారు.

ఆటో లేదా మరే వాహనంలో సింగయ్యను ఆస్పత్రికి తీసుకుపోవద్దని, కచ్చితంగా అంబులెన్సులోనే తీసుకెళ్లాలని పోలీసులు బలవంతం చేశారు. అందుకే ఆ అంబులెన్సులోనే ఏదో జరిగిందని మాకు బలమైన అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు తమకు జగన్‌గారు ఎంతో భరోసా ఇచ్చారని, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారని లూర్దు మేరీ వివరించారు.

 

LEAVE A RESPONSE