రాష్ట్రంలో 7 నెలల్లో రూ.240 వేల కోట్లు పెట్టుబడులు
ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, సెప్టెంబర్ 14:పెట్టుబడులు సాధించడంలో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు,వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యిందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలు వెల్లడించారు. దేశంలో అతి తక్కువ సమయంలో ఏ రాష్ట్రమూ సాధించనన్ని పెట్టుబడులు ఏపీ సాధించిందని, కేవలం 7 నెలల్లో రూ.240 వేల కోట్ల పెట్టుబడులు సాధించి దేశంలో పెట్టుబడులను అత్యంత అనువైన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానాలకు, చేపట్టిన సంస్కరణలకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఫిదా అవుతున్నారని అన్నారు.
మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్
తరగతి గదుల డిజిటలైజేషన్ లో భాగంగా స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ టీవీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమకూర్చనుందని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 72,481 స్మార్ట్ టీవీ యూనిట్లు అవసరం కాగా ఇందుకు రూ.512 కోట్లకు పైగా వ్యయం కానుందని అన్నారు. నాడు-నేడు తొలిదశ పనులు పూర్తయిన స్కూళ్లలో వచ్చే ఏడాది మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలు కొనుగోలుకు నవంబర్ లో టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
అత్యవసర మందుల జాబితా నుండి కేన్సర్ కారక డ్రగ్స్ తొలగింపు
అత్యవసర మందుల జాబితా నుండి కేన్సర్ కారక డ్రగ్స్ ను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అవసరం లేకున్నా మందుల వాడకం, వాటి వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తేవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ని కోరారు.