సామాజిక న్యాయభేరి ఎన్నికల భేరీనా!

Spread the love

అప్పుడే వైసిపికి శ్రీరస్తు..శుభమస్తు అట!

సామాజిక న్యాయభేరి..
నిజానికి ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భేరి..
జగన్ పార్టీ 2024 మార్చి ..ఏప్రిల్ నెలల వరకు ఆగేట్టు లేదు.ఈలోగానే ఎన్నికలకు వెళ్ళడం ఇప్పుడు తథ్యంగా అనిపిస్తోంది.
ముందస్తు ఎన్నికలంటే సాధారణంగా వాస్తవ షెడ్యూల్ కంటే అయిదారు నెలల ముందు అని భావిస్తారు.కానీ వైసిపి అధినేత అంతకంటే చాలా ముందుగా..అంటే వచ్చే ఏడాది మార్చి నెలలోనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.దానికి నాందే నేటి నుంచి మొదలు కాబోతున్న సామాజిక భేరి..!
ఇప్పుడు సాధ్యాసాధ్యాలు..
ఈ ఆలోచన వెనక ఉన్న అంశాలను..ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరపున సన్నద్ధత..తదితర అంశాలను లోతుగా విశ్లేషిద్దాం…!

ఎవరు కాదన్నా ఔనన్నా గత మూడేళ్లలో వైసిపి సర్కార్ గ్రాఫ్ పడిపోతోందన్నది నిస్సందేహం..క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు..పెరిగిపోతున్న అప్పులు.. కుంటుపడిన అభివృద్ధి..రాజధాని వివాదం..గాడి తప్పుతున్న పాలన.. మొన్న మంత్రివర్గ పునర్నిర్మాణం జరిగిన తర్వాత.. అంతకు ముందు నుంచే పార్టీలో..ముఖ్యంగా ఎమ్మెల్యేలలో పెరుగుతున్న అశాంతి..ప్రజాప్రతినిధులు మొదలుకుని దిగువస్థాయి నాయకుల వరకు చాలా మందిపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి..అందుకు కారణమైన వారి వ్యవహార శైలి.. అధినాయకుడికే క్యాడర్ పై తగ్గుతున్న అదుపు..తాజాగా కోనసీమ జిల్లా పేరు గొడవ..ఇట్లాంటి ఇంకెన్నో అంతర్గత వ్యవహారాలు ఒకవైపు..ఎన్ని పంచుతున్నా ప్రజల్లో ప్రభుత్వంపై..పార్టీపై తగ్గుతున్న ఆదరణ..
మునిసిపల్ ఎన్నికల నాటికి..ఇప్పటికి మారిన సన్నివేశం..పార్టీ అన్ని చోట్లా అధికారంలో ఉన్నా అనూహ్యంగా మొదలవుతున్న వలసలు.. ఇవన్నీ మరోవైపు..

ఇక కీలకంగా పార్టీకి వ్యతిరేకంగా కలుస్తున్న విపక్షాల చేతులు..!
వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ ఏకాకి గానే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.సింహం ఒక్కటిగానే వస్తుంది.. పులి పులే..వంటి డప్పాలు ఎన్ని కొట్టుకుంటున్నా వైసిపితో చేతులు కలిపేందుకు ఇతర పార్టీలు ఏవీ సిద్ధంగా లేవన్నది నికరం.ఉంటే గింటే బిజెపి కలవాలి..కానీ ఇప్పటికైతే ఆ సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే జనసేనతో చెయ్యి కలిపి ఉన్న కమలం పార్టీ ఆ మైత్రిని కొనసాగిస్తూనే అవసరమైన పరిస్థితుల్లో తెలుగుదేశంతో విబేధాలు మరచి ఆ పార్టీతో కూడా కలిసి ముందుకు వెళ్తుందేమో గాని జగన్ ఫ్యాన్ గాలిని ఆస్వాదించే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇప్పుడిక జగన్ ముందున్న దారులు రెండు..తనకి వ్యతిరేకంగా చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్న పార్టీలను కలవకుండా చెయ్యడం..అది తన చేతుల్లో లేని పని గనక తన వ్యతిరేక శక్తులు ఒకటై ఎన్నికలకు సిద్ధపడే అవకాశం..సమయం ఇవ్వకుండా ముందుగా ఎన్నికలకు వెళ్ళడం.. అదిగో… జగన్మోహన రెడ్డి అలా ముందుగానే ఎన్నికలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదిగో..ఇలా సామాజికభేరితో తన ఆలోచన అమల్లో పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు భోగట్టా..

జగన్ కు కీలక సలహాలు ఇచ్చే…గత ఎన్నికల్లో సుడి తిప్పినట్టు భావిస్తున్న గేమ్ చేంజర్ కూడా ముందస్తు ఎన్నికలే బెటర్ బ్రో..అని సలహా ఇచ్చారట.
మంత్రివర్గ పునరవ్యవస్థీకరణ..
కొత్త జిల్లాల ఏర్పాటు..
వీటిని మించి విపక్షాలు ఊపిరి తీసుకోవడానికి సైతం అవకాశం ఇవ్వనంత జోరుగా ఆచరణ సాధ్యమైనవైనా.. కాకపోయినా హామీలు గుప్పించడం..ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి రాకుండా వరాలు..
పంపిణీలు..!
ఇప్పుడు మొదలు కాబోతున్న సామాజిక భేరితో పాటు వరసగా ఇంకెన్నో కార్యక్రమాల క్యాలెండర్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు..ఎంపిలకు సూచనప్రాయంగా చేరినట్టు సమాచారం.

ఈ తరహా అట్టహాస వ్యవహారాలు ఈ యేడాది డిసెంబర్ వరకు ఉంటాయని తెలుస్తోంది. ఆటు తర్వాత కొత్త సంవత్సరం..పండగ వచ్చేపాటికి వరాల వెల్లువ..ఉచితాల జాతర..
అంతే గాక గత ఎన్నికల్లో వైసిపి బ్రహ్మాస్త్రం పెన్షన్ పథకాన్ని కూడా మరో లెవెల్ కి చేర్చి 2500 గా ఉండి మూడువేలకు చేరాలని జనాలు ఎదురు చూస్తున్న పించన్ను మూడు వేలకు పెంచి తాము మళ్లీ అధికారంలోకి వస్తే అయిదు వేల రూపాయలకు పెంచుతామనే భారీ ప్రకటనతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ప్రణాళికగా కొన్ని వర్గాలు ఉటంకిస్తున్నాయి..!

మరో మాట..ఎన్నికలకు ఎటూ ముందుగా వెళ్లాలనే ఆలోచన ఉంది గనక లోకసభ ఎన్నికలతో కాకుండా విడిగా శాసనసభ ఎన్నికలకు వెళ్తే అప్పుడు బిజెపి ప్రభావం పెద్దగా ఉండబోదన్నది మరో ప్రధాన వ్యూహం.అలాంటి పరిస్థితుల్లో మరోసారి శాసనసభ ఎన్నికలను గెలుచుకుని లోకసభ ఎన్నికలకు వెళ్తే అధికార పార్టీ హోదాలో ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకుని తనేంటో కమలనాథులకు చూపించాలని వైసిపి అధినేత ఉబలాటపడుతున్నట్టు మరో వర్తమానం.అదీ సంగతి..
ఈ కోణాలన్నీ ఊహిస్తున్న దాని కంటే ముందుగా శాసనసభ ఎన్నికలు జరుగుతాయనే అంచనాను బలపరుస్తున్నవే.!

-ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్

Leave a Reply