ఐఎస్ బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు

-ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి: హైదరాబాద్ ఐఎస్ బీలో ప్రధాని మోదీ
-2001లో వాజ్ పేయి ప్రారంభించారని వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేల మంది నిష్ణాతులుగా పట్టాలు పొందారని తెలిపారు. ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి అని పేర్కొన్నారు.

ఇక, దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా, రాబోయే 25 ఏళ్లకు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నామని మోదీ వివరించారు. నవభారత నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తోందని తెలిపారు. జీ20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ వినియోగంలోనూ, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లోనూ భారత్ రెండో స్థానంలో ఉందని వివరించారు.

భారత్ అంటే వ్యాపారం, విపణి అని ప్రపంచానికి తెలుసని, దేశ అభివృద్ధిలో యువత గణనీయమైన సహకారం అందించడం వల్లే ఇది సాధ్యమైందని, మన యువత గ్లోబల్ లీడర్లు కాగలరని నిరూపించారని కొనియాడారు.

Leave a Reply