– క్యాంప్ కార్యాలయంలో ఏపీ సేవ 2.0 (టూ పాయింట్ ఓ) పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే…:
మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్(సీఎస్‌పీ) ప్రారంభిస్తున్నాం. పలకడానికి అనువుగా దీనికి ఏపీ సేవ అని పేరు పెట్టి ఈ పోర్టల్‌ను ఇవాళ ప్రారంభిస్తున్నాం. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగుపరచే గొప్ప కార్యక్రమం ఇది.
గ్రామ స్వరాజ్యం అంటే గడచిన ఈ రెండేళ్లకాలంలో మన కళ్లముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది.గ్రామ స్వరాజ్యం అంటే మన గ్రామంలోనే మన కళ్లెదుటనే ఒక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ.. అక్కడే పదిమంది కూర్చోవడం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్ధ. దాన్ని కూడా గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేశాం.
ఇదే గ్రామ స్వరాజ్యం
540కిపైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే అర్థం బహుశా ఉండదు. ప్రతి 2వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 1.34 లక్షలమంది రెగ్యులర్ ఉద్యోగులు దాదాపుగా పనిచేస్తున్నారు.
2.60వేలమంది ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున గ్రామ స్థాయిలో, ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటర్ చొప్పున మున్సిపల్ స్థాయిలో ఉన్నారు. మొత్తంగా దాదాపు 4 లక్షలమంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారు. ఇంతకన్నా గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు.
4 లక్షల మందికి అభినందనలు
వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో ఇంటింటికి వెళ్లి నిరంతరం పనిచేస్తున్నారు. ఈ 4 లక్షలమంది సిబ్బందికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనం అందిస్తున్న ఈ సేవలను మరింత మెరుగు పరుస్తూ ముందడుగు వేస్తూ ఏపీ సేవ పోర్టల్(సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0)ను ప్రారంభిస్తున్నాం.
మారుమూల గ్రామాల్లో వీటివల్ల వేగంగా, పాదర్శకంగా, జవాబుదారీతనం పెరిగేలా ఈకార్యక్రమం ఉపయోగపుతుంది.
ఇలాంటి సేవలందించే కార్యక్రమాన్ని జనవరి 26,2020న ప్రారంభించాం. ఈ రెండేళ్ల పయనంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించేలా, పారదర్శకంగా ఉండేలా మార్పులు తీసుకొచ్చి ఈ ఏపీ సేవా పోర్ట్‌లను ఈరోజు ప్రారంభిస్తున్నాం.
540కు పైగా సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కు పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన పరిస్థితిలోకి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3.46 కోట్ల మందికి మేలు జరిగిస్తూ.. గ్రామ, వార్డు స్ధాయిలోనే సేవలు అందించాం.
రెండేళ్లకాలంలో ఇంతమందికి సేవలు అందించారంటే… ఏస్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఆ సేవల్లో మరో ముందడుగు వేస్తూ కొత్తగా… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఇవాల్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ సేవపోర్టల్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి.ఇది మరింత బాధ్యతను, పారదర్శకతను పెంచుతుంది. దీనివల్ల మరింత వేగంగా పనులు జరుగుతాయి. వేగంగా కూడా సేవలు అందుతాయి.
ఎక్కడ, ఏ స్ధాయిలో ఉందో….
ప్రజలకు సులభతరంగా మరింత పారదర్శకంగా.. తాము ఇచ్చిన అర్జీ ఎక్కడ ఉందీ? ఏ స్థాయిలో ఉంది? ఎవరిదగ్గర ఎన్నిరోజులనుంచి పెండింగ్‌లో ఉందీ అన్న విషయాన్ని కూడా ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చు. మరింత వేగంగా పనులు జరుగుతాయి. ప్రజలకు మరింత సులభతరంగా, మరింత పారదర్శకంగా వాళ్లకు సంబంధించిన సమస్య ఎక్కడ ఉంది, దరఖాస్తు పెట్టిన తర్వాత ఎక్కడ ఉంది ?, ఎవరిదగ్గర ఎన్నిరోజులు ఉంది ? అని తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తుదారుడుతో పాటు సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలను తెలుసుకోవచ్చు. దీనివల్ల వేగం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది.
పూర్తి డిజిటలైజ్ సేవలు
ఈ సేవలన్నింటినీ కూడా పూర్తిగా డిజటలైజ్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుంచి మండల స్థాయి, మున్సిపాల్టీలు ఆ తర్వాత జిల్లా స్థాయి, చివరకు రాష్ట్ర స్థాయి సచివాలయంలో ఉన్న ఉన్నతస్ధాయి ఉద్యోగులు అందరూ కూడా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పనిచేయడం మొదలుపెడతారు.
డాక్యుమెంట్లపై డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఉద్యోగుల జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి కూడా తన డిజిటల్ సిగ్నేచర్ చేస్తే… క్లియర్‌గా అది అందరికీ కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు అని ఆ జాప్యాన్ని పై అధికారులు, దరఖాస్తు దారులు ప్రశ్నించగలుగుతారు. తద్వారా సర్టిఫికేట్లు, డాక్యుమెంట్ల జారీలో ఏ మాత్రం జాప్యం లేకుండా లోతుంది. అంతే కాకుండా.. వ్యవస్ధలో సేవలు పొందడంలో అవినీతి దూరం అవుతుంది. పారదర్శకత వస్తుంది. జవాబుదారీతనం వస్తుంది.
లంచాలు, అవినీతికి తావులేకుండా..
కొత్త సాఫ్ట్‌వేర్‌ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కోసం ఎవరి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గరికీ వెళ్లి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందనేది వాళ్లంతటవాళ్లే చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్లైన్‌లోనే దరఖాస్తులను ఆమోదించే పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లు జారీలో ఆలస్యానికి తావుండదు. ప్రజలకు తమ దరఖాస్తుల పరిష్కారం.. ఎక్కడ ఏ దశలో ఉందనే విషయం తెలుస్తుంది. ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఆయాశాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది.
ముఖ్యమైన హబ్‌గా..
అటు ప్రభుత్వ శాఖలు ఇటు ప్రజల మధ్య వారధిగా అంటే ముఖ్యమైన హబ్‌గా.. గ్రామ, వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసే విధంగా..ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా సాధ్యపడుతుంది.
పక్కా రశీదు..
ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే పక్కాగా రశీదు వస్తుంది. భౌతికంగా, డిజిటల్ పద్ధతుల్లో రశీదులు వస్తాయి.
పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్తారు. ఆయా దరఖాస్తులు ప్రాసెస్‌ను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఫీజులు చెల్లించాల్సి ఉంటే.. ఏపీ సేవాపోర్ట్‌ల్ సహాయంతో రుసుములు చెల్లించే అవకాశం ఉంటుంది. యూపీఐ, క్యూఆర్‌కోడ్ స్కానింగ్, క్యాష్ పేమెంట్ ద్వారా కానీ ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది.
ఏపీ సేవా పోర్టల్‌ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం.
మున్సిపాల్టీలకు సంబంధించిన 25 సేవలు, పౌరసరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్‌రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలనుకూడా పోర్టల్ కిందకు తీసుకు వచ్చాం.
ఎక్కడనుంచైనా దరఖాస్తు…
అంతే కాకుండా దరఖాస్తు దారుడికి ఎప్పటికప్పుడు మెసేజ్‌లు పంపించడమే కాకుండా.. తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా… ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. దానికి కారణాలు ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది. అవి కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఏపీ సేవ పోర్టల్‌ద్వారా అందుబాటులోకి వస్తాయి. గ్రామ, వార్డు
సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులను ప్రజలకు క్షేత్రస్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని మరింత మెరుగుపరుస్తూ… ఈరోజు అడుగులు వేస్తున్నాం. దేవుడి దయతో అందరికీ మంచి జరగాలని, ప్రజలందరికీ మరింత మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.అనంతరం ఏపీ సేవా 2.0(టూ పాయింట్ ఓ) పోర్టల్‌ను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు.