Suryaa.co.in

Telangana

బండి చొరవతో ఏపీ-తెలంగాణ బందీలకు విముక్తి

– విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఎర
– సైబర్ నేరగాళ్ల వలలో థాయ్ లాండ్ లో బందీగా మారిన యువత
– కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం
– 540 మంది బందీలకు విముక్తి
– ప్రత్యేక విమానంలో భారత్ కు రాక
– ఏపీ, తెలంగాణకు చెందిన పలువురికి సైతం విముక్తి

హైదరాబాద్: ఉద్యోగాల కోసమని వెళ్లి థాయ్‌లాండ్‌ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మందిని గుర్తించారు.

వీరందరినీ 270 మంది చొప్పున రెండు విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత వీరిని థాయ్‌లాండ్‌లోని మై సోట్‌ పట్టణానికి తరలించిన అక్కడి అధికారులు అక్కడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. సోమవారం 270 మందితో కూడిన తొలి విమానం థాయ్‌లాండ్‌లోని మై సోట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరింది.

మంగళవారం మరో 270 మందితో రెండో విమానం ఇండియాకు రానుంది. ప్రస్తుతం వీరంతా మయన్మార్‌లోని మేవాడీ జిల్లాలో ఆర్మీ పరిరక్షణలో ఉన్నారు. వీరందరినీ మంగళవారం ఉదయం మయన్మార్‌ ఆర్మీ ట్రక్కుల్లో తొలుత థాయ్‌లాండ్‌లోని మైసోట్‌కు, అక్కడ ప్రత్యేక ఆర్మీ విమానంలో ఇండియాకు తీసుకురానున్నారు.

వాస్తవానికి వీరంతా విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. థాయ్‌లాండ్‌ కేంద్రంగా వీరందరికీ ఉద్యోగాలిప్పిస్తామని స్థానిక ఏజెంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆయా యువతకు ఆశ చూపారు. వారికి ఉద్యోగాలు ఖరారయ్యాయని నమ్మబలికిన ఏజెంట్లు థాయ్‌లాండ్‌తోపాటు పొరుగున్న కంబోడియా, లావోస్, మయన్మార్‌లలో పలు సైబర్‌ ఫ్రాడ్‌ కేఫ్‌లో వీరిని విక్రయించారు. అక్కడికి వెళ్లాక వారితో బలవంతంగా ఆన్‌లైన్‌ నేరాలు చేయిస్తన్నారు.

ఒకవేళ సైబర్ నేరాలు చేయకపోతే యువతీ, యువకులకు కరెంటు షాకులిచ్చి హింసిస్తారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడు ఇలాగే కొలువు కోసం వెళ్లి బందీగా మారిన విషయం మీడియాలో వచ్చింది. వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్ వారిని రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

భారత విదేశాంగశాఖకు స్వయంగా లేఖ రాశారు. మయన్మార్, థాయ్‌లాండ్‌ దౌత్యకార్యాలయాలను అప్రమత్తం చేశారు. ఈ నేఫథ్యంలో మయన్మార్‌ ప్రభుత్వం తన ఆర్మీని పంపి సైబర్‌ ఫ్రాడ్‌ కేఫ్‌లలో బంధీలుగా ఉన్న భారతీయులను రక్షించింది. అనంతరం బండి సంజయ్ చొరవతో కేంద్రం వారందరినీ స్వదేశానికి రప్పిస్తుండటం గమనార్హం.

LEAVE A RESPONSE