ఆధునిక పద్దతులలో రొయ్యల సాగు చేయడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ( ఎంపెడ ) నిర్మలా నగర్ ను దత్తత తీసుకోవడం దేశంలోనే అరుదైన సంఘటన అని, ఇక్కడ రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతులు చాలా అదృష్టవంతులని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు పేర్కొన్నారు.
రేపల్లె మండలం తుమ్మల గ్రామ పంచాయితీలోని నిర్మలా నగర్ గ్రామంలో రొయ్యల పెంపకంను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ, జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో రూ. 219.46 లక్షలతో మౌళిక సౌకర్యాల కల్పన పనుల శంఖుస్థాపన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు, ఎంపెడ ఛైర్మన్ ఏ.ఎస్. శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. శంఖుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు మాట్లాడుతూ ఆక్వా ఎగుమతులలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో వుందని, ఆక్వా విదేశాలకు ఎగుమతి ద్వారా రూ. 40 వేల కోట్ల ఆదాయం సమకూరితే అందులో 18 వేల నుండి 20 వేల కోట్ల రూపాయలు రాష్ట్రం నుండే ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల ద్వారానే వస్తున్నదన్నారు. నిర్మలా నగర్ గ్రామంలో నివాసముంటున్న వందకు పైగా షెడ్యూల్డ్ తెగలకు చెందిన రైతులు ఆక్వా సాగు చేస్తున్నారని, ఆక్వా సాగుకు అవసరమైన విద్యుత్, ఇతర మౌళిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదన్నారు.
ఎంపెడ ఛైర్మన్ ఏ.ఎస్. శ్రీనివాస్ మార్చి నెలలో ఈ గ్రామాన్ని సందర్శించి, ఆధునిక పద్దతులలో ఆక్వాసాగు చేసేందుకు అవసరమైన నిధులు ఎంపెడ ద్వారా అందిస్తామని తెలిపారన్నారు. దీనికి సంబంధించి విద్యుత్ సౌకర్యంకు, బయో సెక్యూరిటీ, నీటి పరీక్షా పరికరాలు మరియు నిరంతర సాంకేతిక సహాయం కు రూ. 219.46 లక్షలతో ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందన్నారు. దీనిలో ఎంపెడ రూ.164.60 లక్షలు (75 శాతం) నిధులు మంజూరు చేయగా, జిల్లా యంత్రాంగం 54.86 లక్షలు (25 శాతం) నిధులు అందిస్తుందన్నారు. నిర్మలా నగర్ గ్రామంలో ఆక్వా కల్చర్ ను మరింతగా అభివృద్ది చేసేందుకు దశల వారీగా ఎంపెడ అందించే సహకారాన్ని ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకుని, వారి ఆర్ధిక స్థితులను బలోపేతం చేసుకుని, నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందించాలన్నారు.
కరోనా విపత్కర సమయంలో ఆక్వా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి కోరిన వెంటనే ఎంపెడ ఛైర్మన్ ఏ.ఎస్. శ్రీనివాస్ స్పందించి ట్రేడర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఆక్వా సాగుకు ఇబ్బంది లేకుండా సీజనల్ గా అవసరమైన సీడ్ అందించేందుకు ఎంపెడ చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా సీడ్ ఉత్పత్తికి సంబంధించి సహజమైన వనరులు జిల్లాలో సమృద్ధిగా వున్నాయని, సీడ్ ఉత్పత్తి ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. నిజాంపట్నం గ్రామం సమీపంలోని దిండి గ్రామంలో త్వరలోనే సీ బాత్ , మెడి క్యాప్, క్రిప్ సీడ్ ఉత్పత్తికి హెచరి ఏర్పాటు చేయనున్నామన్నారు. నిర్మలా నగర్ గ్రామంలోని ఆక్వా రైతులతో పాటు, రాష్ట్రంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులందరికీ ప్రోత్సాహం అందించేలా ఎంపెడ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు.
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఏ.ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మలా నగర్ గ్రామంలోని వంద కుటుంబాలు దాదాపు 150 ఎకరాలలో ఆక్వా సాగు చేస్తున్నారన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆధునిక పద్దతులలో ఆక్వా సాగుకు సహకారం అందిస్తే నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు అందించడానికి ఉపయోగపడుతుందని గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి అంగీకరించామన్నారు. తొలుత విద్యుత్, బయో సెక్యూరిటీ, వాటర్ టెస్టింగ్ పరికరాలకు కోటి రూపాయలతో అంచనాలు రూపొందించగా, విద్యుత్ కు సంబంధించి ట్రాన్స్ ఫార్మార్స్ ఏర్పాటు చేయవలసి రావడంతో అంచనాలు రూ. రెండు కోట్లకు పెరిగినా, నిధులు ఇచ్చేందుకు ఎంపెడ ఒప్పుకుందన్నారు. దీనిలో 25 శాతం జిల్లా యంత్రాంగం అందించాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఒప్పుకోవడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో ఆక్వా కల్చర్ సాగుకు ఎంతో పేరు వుందని, ప్రస్తుతం 1.50 లక్షల హెక్టార్లలోని ఆక్వా సాగు జరుగుతున్నదని, 2.50 లక్షల హెక్టార్లకు ఆక్వా సాగును అభివృద్ది చేయాల్సిన అవసరం వుందన్నారు. హెక్టారుకు 5 టన్నులు మాత్రమే ఆక్వా ఉత్పత్తి వస్తుందని, శాస్త్రీయ, అత్యాధునిక పద్దతులలో ఆక్వా సాగు చేస్తే పది టన్నుల వరకు ఉత్పత్తిని పెంచే అవకాశం వుందన్నారు. నిర్మలా నగర్ గ్రామంలో ఆక్వా సాగు అభివృద్దికి కల్పిస్తున్న మౌళిక సదుపాయాల ప్రాజెక్టును సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి చేసి ప్రాజెక్టు విజయవంతం చేస్తే, మరింత అభివృద్దికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎంపెడ చేపట్టిన ప్రాజెక్టుకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందించిన సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ నిర్మలా నగర్ గ్రామంలో ఆక్వా సాగు చేస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన రైతులకు ఆధునిక పద్దతులలో ఆక్వా సాగు చేసేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఎంపెడ ముందుకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఎంపెడ అందించ్ 75 శాతం నిధులతో పాటు, జిల్లా యంత్రాంగం మినరల్ ఫండ్స్ నుండి 25 శాతం నిధులను ఈ ప్రాజెక్టుకు అందించనున్నదన్నారు. జిల్లాలో 43 కిలో మీటర్ల మేర సముద్ర తీరప్రాంతం వుందని, సముద్ర తీరప్రాంతంలో వ్యవసాయం కంటే ఆక్వా సాగు ద్వారానే రైతులు మరింత ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఎంపెడ కల్పిస్తున్న మౌళిక సదుపాయాలను వినియోగించుకుని యూరప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతులు చేసేలా ఆక్వా ఉత్పత్తులను శాస్త్రీయ పద్దతిలో సాగు చేయాలన్నారు. ఆక్వా సాగు అభివృద్దికి ఎంపెడ మౌళిక సదుపాయాల ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ డా. నిధి మీనా, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఏ.వి. రాఘవ రెడ్డి, ఎంపెడ జాయింట్ డైరెక్టర్ ఏ. జయబాల్, తుమ్మల గ్రామ పంచాయితీ సర్పంచ్ తుపాకుల దీపికా, ఎంపీపీ మరియ కుమారి, విద్యుత్ శాఖ, పంచాయితీ రాజ్, రెవెన్యూ, మత్స్య శాఖ, ఎంపెడ అధికారులు, స్థానిక పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.