ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11.42% వృద్ధి రేటుతో దేశంలోనే టాప్ లో నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రం సాధించిన ఘనత ఆర్బీఐ నివేదిక ద్వారా వెల్లడైనట్లు తెలిపారు.
ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యిందని ఈ సూచికలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థతకు అద్దం పడుతున్నాయని అన్నారు . గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1.20 లక్షల కోట్ల మేర పెరిగిందని, దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరువాత 11.04 శాతం వృద్ధితో రాజస్థాన్, 10.88 శాతంతో తెలంగాణ, 9.47శాతంతో కర్నాటక, 7.98శాతంతో తమిళనాడు, 6.94 శాతంలో పంజాబ్, 4.42 శాతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఆ ప్రాంత స్వరూపాన్నే మార్చేసారని విజయసాయి రెడ్డి అన్నారు. ఫిషింగ్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ, వాటర్ గ్రిడ్ నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్ మెదలు సదుపాయాలు కల్పించి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ నరసాపురాన్ని నిలబెట్టారని అన్నారు.