Suryaa.co.in

Andhra Pradesh

జగన్ విధ్వంసక పాలనతో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ

-తెలుగుజాతిని నెం.1గా నిలపడమే చంద్రబాబు విజన్!
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు
-బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా నిలపాలన్నదే చంద్రబాబు గారి ఆలోచన అని, ఇందుకోసం ఆయన అహర్నిశలు కృషిచేస్తూనే ఉంటారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పిఇపిఎల్ టవర్స్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…

చంద్రబాబు  రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేశారని తెలిపారు. ఆయనకు జగన్ లా డబ్బు సంపాదించాలన్న కోరిక ఉంటే ఆనాడే వెయ్యి ఎకరాలు కొనేసి ఉండేవారన్నారు. కుల,మతాలకు అతీతంగా పనిచేసేవారిని చంద్రబాబు ప్రోత్సహిస్తారని, నాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఆర్కే సోదరుడు అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థను ప్రోత్సహించింది చంద్రబాబేనని గుర్తుచేశారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయారు, ఈ విషయంలో ఆనాడే బాబుకు స్పష్టమైన విజన్ ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల విధ్వంసక పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన చెందారు.

2014లో రాష్ట్రవిభజన ఆంధ్రులు కోరుకున్నది కాదు. రాజకీయాల కోసం అడ్డగోలుగా విభజించారు. ఆరుదశాబ్ధాలు కలసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ ను వదలి కట్టుబట్టలతో ఆనాడు బయటకు వచ్చాం. క్లిష్టపరిస్థితుల్లో సిఎం అయిన చంద్రబాబు అన్నివిధాలా ఆలోచించి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ కూడా ఆనాడు అమరావతి రాజధానికి అంగీకరించి 30వేల ఎకరాలు ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పి మూడుముక్కలాట పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమరావతిలో ఎక్కడి పనులను అక్కడే నిలిపివేశారు. ఉద్యోగాల కోసం మన బిడ్డలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్ ప్రాంతాలకు వలసవెళ్లాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు.

కులం, మతం, ప్రాంతం పేరుతో గత ఎన్నికల్లో జగన్ లబ్ధిపొందారు, కుట్రపూరిత రాజకీయాలతో సమాజం నిట్టనిలువునా చీల్చిపోయింది. ప్రతిపక్షనేతలను బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపి టిక్కెట్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడు హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదు, కత్తిపట్టిన వాడు కత్తితోనే పోతాడనే నానుడిని ఆయన బలంగా విశ్వసిస్తారు.

చంద్రబాబును అరెస్టు చేస్తే 80దేశాల్లో తెలుగువారు ఆందోళనల్లో పాల్గొన్నారు, హైదరాబాద్ లో 45వేలమంది రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి పొత్తును విచ్ఛిన్నం చేయాలని కొందరు ప్రయత్నించారు, సాధ్యం కాకపోయే సరికి ముసుగుతీసేసి వైసిపిలో చేరారు. అటువంటి నేతలకు విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలంతా చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE