Suryaa.co.in

Andhra Pradesh

కాంట్రాక్టర్లు ఎక్కడైనా పనులు చేస్తున్నారా?

• పూర్తివివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయగలదా? బుల్లెట్లు దింపే, ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పగలడా?
• గోదావరి కృష్ణా నదులపై నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులపర్యవేక్షణను, కేంద్రానికి అప్పగిస్తారా?
• ఆల్మట్టి ఎత్తుపెంచుతామని కర్ణాటక ముఖ్యమంత్రి, కృష్ణా జలాల్లో తమకు 50శాతం వాటా ఉందని పొరుగు ముఖ్యమంత్రి అంటున్నమాటలు జగన్ చెవికెక్కడంలేదా?
• బెంగుళూరులోని తనప్యాలెస్ ను, ఆస్తులను కాపాడుకోవడానికి ఈ ముఖ్యమంత్రి, రాష్ట్ర రైతులను కర్ణాటకు తాకట్టు పెడతాడా?
* మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోందని, జరగని, చేయని పనులను తామే చేసినట్టుగా ఇప్పుడున్నపాలకులు చెప్పుకుంటున్నారని, 28 నెలల వైసీపీపాలనలో ఎన్నిక్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశారో, ఎన్ని గేట్లు అమర్చారో ప్రజలకు సమాధానంచెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమ వారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపనులను తమకు నచ్చినవారికి అప్పగించింది. 48 గేట్లు ప్రాజెక్ట్ కు అమర్చాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎన్నిగేట్లు అమర్చారంటే సమాధానం లేదు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో రూ.913కోట్లతో బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చారు. పట్టిసీమ దండగని, అధికారంలోకి వచ్చాక దాని పంపులు పీకేస్తానని జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీవారు అన్నారు. ఇప్పుడు అదే పట్టీసీమద్వారా 450 టీఎంసీలనీళ్లు కృష్ణాడెల్టాకు వెళుతున్నాయి. రూ.913కోట్లతో లిఫ్టు పెట్టి, పోలవరం ప్రాజెక్ట్ ని ఏ చేయాలనుకుంటు న్నాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఏలుబడిలో పోలవరం నిర్మాణంలో కేవలం రూ.5,135కోట్ల పనులు మాత్రమే జరిగాయి. టీడీపీ హాయాంలో చంద్ర బాబునాయుడిగారి జమానాలో రూ.11,574కోట్ల విలువైన పనులు జరి గాయి. జగన్మోహన్ రెడ్డి తన 28నెలల పాలనలో ఎన్నివేలకోట్ల పనులు చేశారో చెప్పాలి. సమాధానంచెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి ఉన్నాయా? ఊరికే సొంత పేపర్లో , సొంత ఛానల్లో డబ్బాలు కొట్టుకోవడం కాదని తెలుసుకోండి. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ పనులు ఎవరి హాయాంలో ఎంతవరకు జరిగాయో జనంలోకి వచ్చిచెప్పండి. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, – 26 శాతానికి పనులను అప్పగించారు. రూ.913కోట్ల లిఫ్ట్ పనులకు సంబంధించిన టెండర్లను ఎవరికి కట్టబెట్టారో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా అనే సందేహం ప్రతి ఒక్క రికీ కలుగుతోంది.
జూన్ 21కి పూర్తిచేస్తామన్నారు… చాలా పెద్దపెద్ద కబుర్లు చెప్పారు ఎమ్మెల్యేలు, మంత్రులు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఎవరికీ నోళ్లు రావడంలేదు. నిర్వాసితులు కన్నీళ్లతో పోలవరం ప్రాజెక్ట్ తడుస్తోంది. కాపర్ డ్యామ్ అనేది ఏ ఒక్కరో కట్టేది కాదు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయప్రాజెక్ట్. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంజనీర్లు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు సంయుక్తంగా పోలవరం నిర్మాణంలో భాగస్వాములయ్యారనే వాస్తవం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలుసునా అని ప్రశ్నిస్తున్నా.
టీడీపీప్రభుత్వంలోనే చంద్రబాబునాయుడి గారి నాయకత్వంలో దాదాపు 71శాతం వరకు పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. కేవలం 24 గంటలవ్యవధిలోనే 32,415 క్యూబిక్ మీటర్లవరకు కాంక్రీట్ పనులు జరిగాయి. ఆ సువర్ణాధ్యాయం దేశచరిత్రలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో లిఖించబడింది. ఆ విధంగా తమహయాంలో జరిగిన పనులకు జగన్మోహన్ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. తాను అధికారంలోకి వచ్చాక 4శాతం, లేదా 5శాతం పనులు పూర్తయ్యా యని ముఖ్యమంత్రి చెప్పగలడా? టీడీపీ హాయాంలో 71శాతం పనులు అయితే, తాను అధికారంలోకి వచ్చాక ఇంతశాతం పనులు జరిగాయని చెప్పగల దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా అని మీడియాముఖంగా నిలదీస్తున్నా.
స్పిల్ ఛానల్, స్పిల్ వే, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులు 85.5శాతం వరకు టీడీపీప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. ప్రభుత్వమిచ్చిన రివ్యూ మీటింగ్ సమాచారంలో 71 శాతం పనులుగతంలో జరిగాయని మీరే చెప్పారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, బేసిన్ కు సంబంధించిన కాంక్రీట్ పనులు 74.08 శాతం వరకు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగితే, ఆ పనులను మీరు అధికారంలోకి వచ్చాక 77శాతానికి తెచ్చారు. డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ పనులు టీడీపీప్రభుత్వంలోనే 100కు 100శాతం వరకుపూర్తయ్యాయి. 48 రేడియల్ గేట్లలో ఎన్నిబిగించారంటే ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు. ఎగువ కాపర్ డ్యామ్ పనులు 51.08 శాతం, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణపనులు 30 శాతంవరకు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయని , కేంద్రప్రభుత్వమే చెప్పింది.
2019మేలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్యామ్ చూడటానికి వెళ్లాడు. ఆ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 100శాతం పూర్తయిందని, నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే, తాము 2021 డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తిచేస్తామని, డ్యామ్ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, నిర్మాణసంస్థవారు ముఖ్య మంత్రికి చాలాస్పష్టంగా చెప్పారు. 2022 డిసెంబర్ నాటికి పవర్ ప్రొడక్షన్ పనులుకూడా కొంతవరకు పూర్తిచేస్తామని చెప్పారు. ఇవన్నీ విన్నాకకూడా ముఖ్యమంత్రి జరుగుతున్నపనులను రద్దుచేసి, రివర్స్ టెండరింగ్ డ్రామాలాడాడు. ఆనాటినుంచీ ఈనాటివరకు ఎక్కడా ఒక్క పనికూడా పూర్తిచేసిందిలేదు.
ఇంకాసిగ్గులేకుండా నిర్మాణపనుల్లో అవినీతి జరిగిందని, పవర్ ప్రాజెక్ట్ లకోసం కక్కుర్తిపడ్డారని నానారకాలు గా దుష్ప్రచారం చేస్తారా? కక్కుర్తి పడాల్సిన అవసరం, ఆ కర్మ మాకేం లేదు. అలా కక్కుర్తిపడితే, సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో, కర్ణాటకలో పవర్ ప్రాజెక్టులున్న వారు కక్కుర్తిపడాలి. ఆ ప్రాజెక్ట్ లన్నీ ఉన్నవి ముఖ్యమంత్రికి, కాబట్టి, పవర్ ప్రాజెక్ట్ కోసం ఆయనే కక్కుర్తి పడాలి. 2022లో పోలవరం పూర్తిచేస్తామని ఇంకా సిగ్గులేకుండా ఎన్నాళ్లు చెబుతారు? పనులపరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ఏంచెప్పింది రాష్ట్రప్రభుత్వాన్నిఏమని నిలదీసింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి, వివిధ కాంపోనెంట్లలో జరిగిన పనుల వివరాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉంటే, తక్షణమే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడు 7 గ్రామాల నిర్వాసితులను ఖాళీ చేయించి, వారికి అవసరమైన ఇళ్లను నిర్మించి, వారిని తరలించా కే నిర్మాణపనులు ప్రారంభించాము. అలాచేయబట్టే చంద్రబాబునాయుడి గారి హాయాంలో 71శాతం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తిచేయగలిగాము. కేంద్రప్రభుత్వమిచ్చిన డిజైన్ ప్రకారం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టకుండా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేపడతారా? ఎలా చేస్తారో చేయండి. సిగ్గులేకుండా సొంతపత్రికలో ఇష్టమొచ్చినట్లు రాసుకోవడం కాదు. కమీషన్ల కక్కుర్తి, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచ నలతోనే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ కి ఈ దుర్గతి పట్టించాడు.
నిర్వాసితులకు పాదయాత్ర సమయంలో ఎకరానికి రూ.19లక్షలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. తరువాత ఎన్నికల సమయానికి ఆయనే తిరిగి రూ.9లక్షలు ఇస్తానన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎంతమంది నిర్వాసితుల కుటుంబాలకు ఎన్నిలక్షలు ఇచ్చాడో సమాధానంచెప్పాలి. వరదసమయంలో ఒక్కో కుటుంబానికి రూ.2వేలు ఇస్తానన్నాడు. అదీ ఇవ్వలేదు. పోలవరంప్రాంతానికి నారాలోకేశ్ తో కలిసి తాను వెళ్లినప్పుడు అక్కడి దృశ్యాలు మమల్ని కలిచివేశాయి. నిర్వాసితులకు తాగడానికి మంచినీరు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వముంది. ఒకకొవ్వొత్తి, రెండు బంగాళదుంపలు చేతిలో పెడితే నిర్వాసితులు బతికేస్తారా? వైసీపీనుంచి గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పోలవరం నిర్వాసితుల వద్దకువెళితే, వారి వేదనేమిటో తెలుస్తుంది.
పోలీసులు నిర్వాసితులను లాఠీలతో తరిమితరిమి కొండల పైకి వెళ్లేలా చేస్తున్నారు. ఇవేవీ బుల్లెట్ ఇరిగేషన్ మంత్రికి కనిపించడం లేదా? నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదా? ప్రధానిని ఒప్పించి ఎందుకు నిధులు తెచ్చుకోలే క పోతున్నారు? 28 మంది ఎంపీలుండి ఏం పీకుతున్నారు?
చంద్రబాబునాయుడి గారి హయాంలో రూ.59వేలకోట్లతో 64 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. వాటిలో 23ప్రాజెక్టుల నిర్మాణం చివరిదశకు చేరింది. 4ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వాటి దగ్గరకు వెళ్లే దమ్మ , ధైర్యం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వంశధార – నాగావళి అనుసంధానం, పోలవరం ఎడమకాలువ నిర్మాణపనులు, వంశధార – బహుదా నదీ అనుసం ధానం పనులు, ఐడీసీ లిఫ్టులు, ఇతరత్రా పనులు ఏమయ్యాయో చెప్పండి. పోలవరం కుడిప్రధాన కాలువనిర్మాణ పనులు టీడీపీప్రభు త్వంలోనే 91.08శాతంవరకు పూర్తయ్యాయి.
హంద్రీనీవా వెడల్పు పనులు, గాలేరునగరి పనులు, మచ్చుమర్రి పనులు ఏమయ్యాయో , ఎంతవరకు జరిగాయో సమాధానంచెప్పండి. గండికోట నుంచి రూ.6వే లకోట్లతో చిత్తూరుజిల్లాకు నీళ్లు తెస్తున్నామని సిగ్గులేకుండా ఒక మంత్రి చెబుతున్నాడు. కృష్ణాజలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించిన ఘనత చంద్రబాబునాయుడిది. ఆ నీటిని కుప్పానికి వెళ్లకుండా కాళ్లు అడ్డుపెట్టింది ఈ ప్రభుత్వంకాదా? వెలిగొండలో టీబీఎం దేనికి పెట్టారో చెప్పండి, టీబీఎంలను పక్కనపెట్టి, బ్లాస్టింగ్ చేస్తారా? బుద్ధి, జ్ఞానం ఉన్న వాడు ఎవడైనా అలాంటిపనులు చేస్తాడా? వెలిగొండ ప్రాజెక్ట్ ను గెజిట్ లో కూడా పెట్టించలేకపోయారు. మీరెంత మొద్దు నిద్ర పోతున్నారో ఇక్కడే అర్థమవుతోంది. గోదావరి కృష్ణా నదులపై నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులపర్యవేక్షణను, కేంద్రానికి అప్పగిస్తారా? కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి అవగాహన ఉందా?
519 మీటర్లనుంచి 524 మీటర్లకు ఆల్మట్టి ఎత్తు పెంచుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెగేసి చెబుతుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంచేస్తు న్నాడు? బెంగుళూరులోని ప్యాలెస్ లు కాపాడుకోవడం కోసం రైతులను బికార్లను చేస్తాడా ఈ ముఖ్యమంత్రి? రాష్ట్ర రైతాంగం హక్కులను, కర్ణాటక కు తాకట్టు పెట్టే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? అంతరాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కారానికి, ట్రైబ్యునళ్ల ముందు వాదించడానికి ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటోంది? ఎంతసొమ్ము ఖర్చుపెట్టి, రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూర్చారో చెప్పండి. కృష్ణా జలాల్లో మాకు 50శాతం వాటా ఉందని పక్కరాష్ట్ర ముఖ్య మంత్రి ప్రధానినికలిసి, ఢిల్లీలో మంతనాలుజరుపుతుంటే, ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడు? పోలవరం నిర్వాసితుల రోదన, ఆవేదన తాము విన్నాము.
ఈ ముఖ్యమంత్రి వారి ముందుకు ఎందుకు వెళ్లడంలేదు? కిండపడేస్తే పగిలిపోయే నాసిరకం ఇటుకలతో నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తారా. వారు నివాసముండాలనే అనుకుంటున్నారా? లేక వరదలో కొట్టుకుపోవాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? చంటి పిల్లలతో తల్లులు అల్లాడిపోతే, వారికి మంచినీళ్లు ఇచ్చిన దిక్కులేరు. చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు తమకు పులిహోర, మంచినీరు, నిత్యావసరాలు అందాయని, సకాలంలో పరిహారం అందిందని నిర్వాసితులే తమతో చెప్పుకొని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాసి తులకు ఇస్తానన్న రూ.500కోట్లుఎవరి అకౌంట్లలో పడ్డాయో ఆయనే సమాధానంచెప్పాలి. నిర్వాసితులకు ఈ ప్రభుత్వంలో ఎంతన్యాయం జరిగిందో ఇరిగేషన్ మంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

LEAVE A RESPONSE