మిర్చి రైతుల్ని ఆదుకుంటాం

Spread the love

– హోంమంత్రి సుచరిత
జిల్లాలో తామర, నల్లి తెగులు వలన తీవ్రంగా మిర్చిపంటకు వాటిల్లిన నష్టంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పంట నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని మినీ శంకరన్ హాలులో జిల్లాలో మిర్చిపంటకు జరిగిన నష్టం పై తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టరు (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, ప్రజా ప్రతినిధులతో కలసి ఉద్యానశాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో జిల్లాలో సాగు చేసిన మిర్చి పంటకు తామర, నల్లి పురుగు వలన కలిగిన నష్టం, ఉద్యాన శాఖ ద్వారా సశ్యరక్షణ చర్యలపై రైతులకు కలిగించిన అవగాహన కార్యక్రమాలు, నల్లి పురుగు ఉధృతిని అరికట్టేందుకు శాస్త్రవేత్తల పరిశోదన వివరాలు, నష్ట పోయిన పంట వివరాల నమోదును ఉద్యానశాఖ ఉప సంచాలకులు పద్మావతి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లాలో మిర్చి పంట నల్లి తెగులతో పూర్తిగా నష్టం వాటిల్లటంతో మిర్చి పంట సాగు చేసిన రైతులు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయినందున రైతులకు నష్ట పరిహారం అందించేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పరిస్థితిని తెలియజేస్తామన్నారు.
ఉద్యాన శాఖ అధికారులు మిర్చి పంట నష్ట పోయిన రైతులకు ప్రత్యమ్నాయ పంటల సాగుపై సలహాలు అందించాలన్నారు. నల్లి తెగులు ఇతర పంటలకు సోకే అవకాశం ఉన్నందున నల్లి తెగులు సోకని ఇతర పంటలనే రైతులు సాగు చేసుకునేలా సూచనలు చేయాలన్నారు. పంట నష్టం పై ఎన్యూమరేషన్ త్వరితగతిన పూర్తి చేసి వెంటనే నివేదిక అందించాలన్నారు. రానున్న కాలంలో నల్లి తెగులు మిర్చి పంటకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, నిర్మూలించేందుకు అవసరమైన పురుగు మందులను శాస్త్రవేత్తలు త్వరితగతిన పరిశోధన చేసి వివరాలు అందించాలన్నారు.
జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో నల్లి పురుగు వలన ఇప్పటికే 90 శాతం మిర్చి పంట నాశనం అయ్యిందని, మిగతా పది శాతం సైతం పూర్తిగా దిగుబడి తగ్గిపోయినందున నూరు శాతం పంట నష్టం జరిగినందున పెస్ట్ ఎపడమిక్ క్రింద మిర్చి రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సోమవారం నాటికి ఎమ్యూనరేషన్ నివేదిక అందితే వాటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. అలాగే అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుందన్నారు.
శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, కిలారి వెంకట రోశయ్య, బొల్లా బ్రహ్మనాయుడు, డా. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ మిర్చి పంట సాగు చేసిన రైతులు నల్లి తెగులుతో పూర్తిగా పంట నష్ట పోవటంతో ఆర్ధికంగా నష్టపోయినందున వారిని ఆదుకునేందుకు మెరుగైన పరిహారం అందించేలా రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రతిపాదనలు అందించాలన్నారు.
సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మిర్చి సాగులో గుంటూరు జిల్లా ప్రతిష్టాత్మక మైనదన్నారు. గత సంవత్సరం 76,936 హెక్టార్ల విస్తీర్ణంలో మిర్చి పంట సాగు చేయగా అధిక ధర ఉండటంతో ఈ సంవత్సరం 1,06,656 హెక్టార్లలో మిర్చిని సాగు చేశారన్నారు. మిర్చి పంటకు తామర, నల్లి తెగులు ఆశించటంతో పూత దశలోనే పురుగులు రసం పీల్చటంతో కాయలు రాకుండా మొక్క పూర్తిగా ఎండిపోయిందన్నారు.
మిర్చి పంట సాగుకు ఎకరాకు రూ.70,000 నుంచి రూ. 1,00,000 వరకు ఖర్చు పెట్టిన రైతులు పంట ఎండిపోవటంతో నష్ట పోవటం జరిగిందన్నారు. నల్లి తెగులు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో మిర్చి పంటలను నష్టం చేసిందన్నారు. బెంగుళూరు లోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ నుంచి , లామ్ లోని ఉద్యాన పరిశోధన సంస్థ నుంచి శాస్త్రవేత్తలు వచ్చి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి , శాంపిల్స్ సేకరించి పరిశోధనలు చేస్తున్నారన్నారు.
నల్లి తెగులుతో జిల్లాలో మిర్చి పంట మొత్తం పూర్తిగా పాడైపోవటంతో రైతులకు న్యాయం చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులతో, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం మిర్చి పంట పూర్తిగా నష్ట పోవటంతో రైతులతో పాటు వినియోగదారులపై కూడా ప్రభావం పడుతుందన్నారు. దిగుబడి తగ్గిపోవటం వలన ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. దిగుబడి లేకపోవటం వలన మిరప సాగుకు రైతులు ఖర్చు చేసిన మొత్తాలు పూర్తిగా నష్టపోయారని, ముఖ్యంగా కౌలు రైతులు రూ.25,000 నుంచి రూ.40,000 వరకు కౌలు క్రింద చెల్లించటం జరిగిందన్నారు.
ఎన్యూమరేషన్ నివేదిక అందిన వెంటనే రైతులకు న్యాయం జరిగేలా పరిహారం అందించేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కోరటం జరుగుతుందన్నారు. రైతు పక్షపాతి, మనసున్న మహరాజు అయిన మన ముఖ్యమంత్రి జిల్లాలో తీవ్రంగా నష్ట పోయిన మిర్చి రైతులను ఆదుకుంటారన్నారు. మిర్చి సాగుకు రైతులు పెట్టిన పెట్టుబడికి న్యాయమైన పరిహారంతో పాటు, పూర్తి ఉచితంగా విత్తనాలు అందించాలని ముఖ్యమంత్రిని కోరనున్నామన్నారు.
మిర్చి పంట పాడైపోయిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు నీటి లభ్యత, భూ స్వభావం బట్టీ సలహాలు అందిస్తున్నారని, నల్లి తెగులు నివారణకు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన ఫలితాలు అందనున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీఏ విజయ భారతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరామకృష్ణ, లాం ఉద్యానశాఖ పరిశోదన సంస్థ శాస్త్రవేత్తలు శిరీష, విజయ లక్ష్మీ, ఉద్యాన శాఖ జిల్లా ఏడీలు కృష్ణారెడ్డి, బెన్నీ, పాల్గొన్నారు.
 

Leave a Reply