Suryaa.co.in

Political News

ప్రభుత్వాలు – రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారా?

గోదావరి నది ఉదృతంగా ప్రవహించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు చెందిన ప్రజలు వర్ణనాతీతమైన బాధలు అనుభవించారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. పోలవరానికి 1,55,000 ఎకరాల భూసేకరణ చేయాలి. ఇప్పటికీ 1,00,000 ఎకరాలు చేశారు. ఇంకా 55,000 ఎకరాలు చేయాలి. నిర్వాసిత కుటుంబాలు 1,06,000. ఇప్పటికీ కేవలం 6,300 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. 371 గ్రామాలు ముంపుకు గురవుతాయి. కేవలం 25 గ్రామాలనే తరలించారు. 213 పునరావాస కేంద్రాలు నిర్మించాలి. 26 మాత్రమే నిర్మించారు.

డీ.పీ.ఆర్. -2 లో పునరావాసానికి రు.33,500 కోట్లు వ్యయ అంచనాగా పేర్కొన్నారు. భూసేకరణ చట్టం -2013 ప్రకారం భూసేకరణకు నష్ట పరిహారం ఇవ్వకుండా, పునరావాస పథకాన్ని అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పర్యవసానంగానే పోలవరం నిర్వాసితులు సమస్యల వలయంలో చిక్కుకొని బాధలను అనుభవిస్తున్నారు.

మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస పథకానికి వెయ్యి, రెండు వేల కోట్లు అయితే నేను ఇచ్చేవాడిని (అది సొంత డబ్బు కాదు సుమా!), ఇరవై వేల కోట్లు కావాలన్నారు. మొదటి దశ 41.15 మీ. కాంటూర్ వరకు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి రు.10,900 కోట్లు, రెండవ దశ 45.72 మీ. కాంటూర్ వరకు నిర్మాణ పనులనుcm-jgn పూర్తి చేయడానికి మరో రు.20,000 కోట్లు, మొత్తం రు.30,900 కోట్లు కావాలని ఇటీవలే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు వ్రాసిన పెద్దమనిషి ఇప్పుడు రు.20,000 కోట్లు కావాలంటున్నారు! మరి, ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో! ఆయనే చెప్పాలి. ఆయన మరో ఆణిముత్యం లాంటి మాట కూడా సెలవిచ్చారు. నోట్లు ప్రింట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నదని (అంటే మోడీ గారికే ఉన్నది, తనకు లేదని), డబ్బు ఇమ్మని మోడీ గారిని బ్రతిమాలుతానని తన దీనావస్థను నిర్వాసితులకు విన్నవించుకున్నారు.

ముంపు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి పర్యటించారు. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కారించమని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై వత్తిడి తీసుకురావడానికి ఆయన పర్యటన తప్పనిసరిగాbabu1 అంతో, ఇంతో దోహదపడవచ్చు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ముంపు మండలాలకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేయడం ఏమిటి? మెరుగైన పునరావాస పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని వాగ్దానం చేస్తే సమర్థనీయం కానీ, ముంపుకు గురయ్యే ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా ఎందుకో! ఈ ప్రభుత్వాలేంటో! ఈ రాజకీయ నాయకులేంటో!

-టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE