– పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ఫోను సైతం..
– చిరంజీవి కుటుంబసభ్యుల ఫోన్లు కూడా విన్నారా?
– హీరోయిన్ల ఫోనులు సైతం..
– జనసేనకు సహకరిస్తున్నదెవరు?
పవన్ సన్నిహితులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్
జగన్ కోసం సినిమా ఇండస్ట్రీ టార్గెట్
– జగన్ వ్యతిరేకుల ఫోన్లపై కేసీఆర్ దొంగచెవులు?
– సిట్‌కు పవన్, త్రివిక్రమ్ ఫిర్యాదు చేస్తారా?
( అర్షద్)
ఏపీలో నాటి సీఎం జగన్ విధానాలను వ్యతిరేకించిన జనసేన దళపతి పవన్ సహా, సినిమా పరిశ్రమలోని టీడీపీ సానుభూతిపరులందరి ఫోన్లపై నాటి కేసీఆర్ సర్కారు నిఘా వేసిందా? ముఖ్యంగా పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులందరి ఫోన్లను అప్పటి కేసీఆర్ సర్కారు దొంగచెవులు విని, వాటిని జగన్‌కు చేరవేసిందా? పవన్‌కు ఆప్తుడైన దర్శక రచయిత త్రివిక్రమ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అసలు సినీ ఇండస్ట్రీనే లక్ష్యంగా చేసుకుని, నాటి కేసీఆర్ సర్కారు దొంగచెవులతో వారి ఫోన్లు ట్యాపింగ్ చేసిందా? సిట్ విచారణలో అదే తేలిందా? మరిప్పుడు పవన్ కూడా సిట్‌కు ఫిర్యాదు చేస్తారా? ఇదే ఇప్పుడు సినిమా రంగంలో హాట్‌టాపిక్.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఏపీకి లింక్స్ ఉన్నట్టు బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ అయింది. తన ఫోన్ ట్యాప్ చేశారని ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ కావడం వెనుక జగనన్న హస్తం ఉన్నట్లు తెలిపారు. షర్మిలను మాత్రమే కాదు… సినిమా ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్ సన్నిహితులను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఎవరు? అని ప్రశ్నిస్తే… నలుగురైదుగురు కనిపిస్తారు. వాళ్ళ పేర్లు మాత్రమే వినపడతాయి. రెండు నుంచి ఐదో స్థానం వరకు పలువురు పేర్లు కిందకి పైకి మారొచ్చు. కానీ ఒక్కరి పేరు మాత్రం ఎవరిని అడిగినా మొదటి స్థానంలో ఉంటుంది. పవన్ ఆప్త మిత్రుడిగా అందరికీ తెలిసిన దర్శకుడు త్రివిక్రమ్ ఫోన్ ను ట్యాప్ చేశారని తెలుస్తోంది. రాజకీయాలలో ఆయన ఎప్పుడూ క్రియాశీలకంగా వ్యవహరించినది లేదు. రాజకీయ నాయకులతో ఆయన మాట్లాడినది కూడా లేదు. పవన్ సన్నిహితులు కావడం వల్ల… జనసేనానికి సలహాలు ఇస్తున్నారనే అనుమానంతో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని టాక్.
పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా ఇండస్ట్రీలో ఉంది. ఆయన పిల్లలు చిన్న వాళ్ళు. ఇంకా ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు. అయితే… మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు సహా వాళ్ల పిల్లలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ పొలిటికల్ ట్వీట్స్ కూడా చేశారు. వాళ్ల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని టాక్. పవన్ కుటుంబ సభ్యులను సైతం వదల్లేదట.
జనసేన పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ విజయ పథంలోకి వచ్చింది. అధికారంలో లేని సమయంలో నిర్వహించిన రాజకీయ సభలో పవన్ పదేపదే ప్రస్తావించిన అంశం ఒకటి… పార్టీని నడపడం కోసం డబ్బులు అవసరమని, అందుకోసం సినిమాలు చేయక తప్పదని తేలడంతో.. పవన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కోసం ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలను టార్గెట్ చేశారట.
ఆ సమయంలో పవన్ హీరోగా నటించిన సినిమాల మీద ఏపీలోని ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పవన్‌తో సినిమాలు నిర్మించిన, ఆయా సినిమాలు నిర్మించడం ద్వారా పవన్ పార్టీకి పరోక్షంగా ఆర్థిక సహకారం అందించిన నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా నిర్మాత తెలంగాణ వాసి అయినప్పటికీ… ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం… రెండిటిలోని పెద్దలు అతడిని టార్గెట్ చేశారట.
పవన్ సన్నిహిత మిత్రుడైన దర్శకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నిర్మాతలు మాత్రమే కాదు… సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సైతం ఫోన్ ట్యాపింగ్ బాధితులే. అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి స్నేహం కోసం, సినిమా ఇండస్ట్రీలో పవన్ సన్నిహితులను టార్గెట్ చేస్తూ అప్పటి తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌కి పాల్పడితే… వాళ్లతో పాటు కొంత మంది హీరోయిన్ల ఫోనులు సైతం ట్యాప్ చేశారు.
ఇప్పుడు వాళ్ళందరి పేర్లు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నప్పటికీ… ఎవరెవరి ఫోనులు ట్యాప్ అయ్యాయనేది ఫిలిం ఇండస్ట్రీలో కొందరికి తెలుసు. అప్పటి జగన్ ప్రభుత్వం తమను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడంలో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని గుర్తించడం వల్ల ఇదంతా జరిగిందని, తెలుగు దేశంతో పవన్ చేతులు కలిపితే, తమకు ఓటమి తప్పదని గుర్తించి ముందస్తుగా కొన్ని అడ్డదారులు తొక్కిందని రాజకీయ – సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.