Suryaa.co.in

Editorial

జయంతికి విడిగా… వర్థంతికి కలి‘విడిగా’ జగన్-షర్మిల

( మార్తి సుబ్రహ్మణ్యం)
వైఎస్ కుటుంబంలో విబేధాలు వచ్చాయన్న సంకేతాలకు తెరదించుతూ ఆయన వర్థంతి రోజు అన్నాచెల్లెలు ఒకే వేదికకు మీదకు వచ్చారు. ఈఏడాది జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఇడుపులపాయకు వెళ్లిన ఏపీ సీఎం జగన్-ఆయన చెల్లెలు, వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒకరికొకరు తారసపడకుండానే, వైఎస్ సమాధికి విడివిడిగా నివాళులర్పించి వెళ్లిపోవడం చర్చనీయాంశ మయింది. ఆ ఘటన జగన్-షర్మిల మధ్య విబేధాలు వచ్చాయన్న సంకేతాలకు కారణమయింది. తెలంగాణలో షర్మిల కార్యక్రమాలకు జగన్ అధికార మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వకపోవడం, దానికితోడు ఇందిరాపార్కు వద్ద షర్మిల చేసిన దీక్షకు వచ్చిన జగన్ అధికార మీడియా ప్రచారం తనకు అవసరం లేదని, వేదికపైనే వ్యాఖ్యానించిన సందర్భంలో.. తల్లి విజయమ్మ కూడా పక్కనే ఉండటం సంచలనం సృష్టించింది.
కాగా, ఆగస్టు నెలాఖరులో సిమ్లాలో జరిగిన జగన్-భారతి వివాహ వార్షికోత్సవ వేడుకలకు తల్లి విజయమ్మ-చెల్లి షర్మిల వెళ్లకపోవడం… ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు అన్న జగన్‌కు రాఖీ కట్టే షర్మిల, ఈసారి జగన్‌కు బదులు, తన పార్టీ నేత చేతికి రాఖీ కట్టడం… కుటుంబవిబేధాలపై వస్తున్న వార్తలు నిజమేనన్న , మరో సంకేతాలకు కారణమయ్యాయి. నిజానికి గురువారం నాటి వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి సైతం.. జగన్-షర్మిల, విజయమ్మ మునుపటిమాదిరిగానే వేర్వేరుగా హాజరవుతారన్న ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో గురువారం ఇడుపులపాయలో జరిగిన వైఎస్ వర్ధంతికి సీఎం జగన్, ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల హాజరవడంతో.. తామంతా కలిసే ఉన్నామన్న సంకేతాలు వెళ్లాయి. అయితే బుధవారం రాత్రి జగన్-షర్మిల కలిసే భోజనం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, గురువారం నాటి వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో మాత్రం ఎక్కడా మాట్లాడుకున్న దాఖలాలు లేవు.

LEAVE A RESPONSE