ఈ బుడ్డోడు.. కుటుంబాన్ని లాగుతున్న బాహుబలి!

( మార్తి సుబ్రహ్మణ్యం)
యమా స్పీడుగా ఆటో నడుపుతున్న ఈ బుడ్డోడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పేరు గోపాలకృష్ణారెడ్డి. ఉండేది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, గంగుడుపల్లి పంచాయితీకి దూరంగా ఉన్న శివారు. అక్కడే ఈ బుడ్డోడి కటుంబం ఓ రేకుల షెడ్డులో, పాముల మధ్య బతుకీడుస్తోంది. ఈ కుటుంబానికి పెన్షనే ఆధారం. తల్లీతండ్రీ ఇద్దరూ అంధులే.  పలక-బలప పట్టాల్సిన చేతులు ఆటో స్టీరింగు పడుతున్న దయనీయం. కళ్లు కనపడని తండ్రి, నిస్సహాయురాలయిన తల్లిని ఇప్పుడు ఈ బుడ్డోడు పోషిస్తున్నాడు. అంటే ఇలా ఇలా ఈ-రిక్షాతో ప్పు దినుసులు, నిత్యావసరాలు అమ్ముతూ,  వయసుకు మించిన భారం మోస్తున్న ఈ ‘పేద బాహుబలి’ దుస్థితి ఇప్పటి దాకా ప్రభుత్వానికి, అధికారులకు తెలియదు.  ఈ పేద బాహుబలి  వివరాలు చూద్దాం రండి.
ఆటలాడుకుంటూ… పాటపాడుకుంటూ….హాయిగా సాగే జీవితమే బాల్యం. పెద్దలు చెప్పినట్లు స్కూళ్లకు వెళ్లడం, గురువులు చెప్పిన పాఠాలు నేర్చుకోవడం., బడి సమయం కాగానే బయట తోటి విద్యార్థులతో సరదాగా ఆటలు ఆడుకోవడం చిన్నారులు చేస్తుంటారు. అసలు సంపాదన కుటుంబ భారం అంటే ఏంటో తెలియని అమాయకత్వం వారిది. కానీ ఓ చిన్నారికి మాత్రం అడుకోవాల్సిన వయసులో అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులో కుటుంబ బాధ్యతలను ఆ బుడ్డోడు మోస్తున్నాడు.
అమ్మనాన్నలతో సహా ఇద్దరు తమ్ముళ్ల పోషణకు తన రెండు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తన కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. కింద మీద పడి బ్యాటరీ ఆటో తోలడం నేర్చుకున్న ఆ బాలుడు బడి నుంచి రాగానే తండ్రితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో  పప్పులు, బియ్యం అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.


చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, గంగుడుపల్లి పంచాయతీకి చెందిన బండి పాపిరెడ్డి,రేవతి దంపతులకు గోపాల కృష్ణారెడ్డి.  హిమవంతు రెడ్డి, గణపతి రెడ్డి ముగ్గురు సంతానం. పాపిరెడ్డి చిన్నతనంలో కంటి చూపు కోల్పోయాడు. రేవతి పుట్టుకతోనే అంధురాలు.. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఫించన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు గోపాలకృష్ణ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు.
తల్లిదండ్రులిద్దరికీ చూపులేకపోవడంతో కుటుంబ పోషణ భారం ఎనిమిదేళ్ల అంధ దంపతుల పెద్ద కుమారుడు గోపాల కృష్ణారెడ్డి పై పడింది. తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు,  ఈ-రిక్షాలో గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పుదినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్నాడు.

గ్రామ శివారుల్లో ఓ రేకులు షెడ్డులో పాపిరెడ్డి తన కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. అక్కడి చేరుకోవాలన్న అష్టకష్టాలు పడాల్సివస్తోంది. ఆ ప్రాంతంలో పాములు, విష సర్పాలు సంచరిస్తూ ఉంటాయి. కొడుకులు చూసి చెపితే తల్లిదండ్రులు జాగ్రత్తపడతారు. ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఇలాంటి కడు పేదలను ఆదుకుని, ఈ పేద కుటుంబానికి చేయూత నివ్వడం అధికారుల విధి.

Leave a Reply