– కోవర్టులని తెలిసి పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు?
– ఇంకా వారిని పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారు?
– ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కల్తీ లిక్కర్ దందా
– ఏరియాకో మంత్రిని నియమించి వారితో కల్తీ దందాలు
– వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్
తాడేపల్లి: కుటీర పరిశ్రమలా కల్తీ లిక్కర్ తయారు చేసి ఒక్కో ఏరియాకి ఒక్కో నేతను ఎంపిక చేసి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తంబళ్లపల్లె వద్ద మొలకలచెరువులో వెలుగుచూసిన కల్తీ లిక్కర్ దందా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తోందని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన అనుచరులకు అప్పజెప్పి లిక్కర్ దందాని అధికారికంగా నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కల్తీ మద్యం కొత్తగా నిన్న నలుగురి ఉసురు తీసింది. తంబళ్లపల్లెలో కల్తీ మద్యం గుట్టురట్టయి టీడీపీ నాయకుల పాత్ర బయటపడినా పద్ధతి మార్చుకోకుండా ఈ టీడీపీ నాయకులు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
తంబళ్లపల్లె కల్తీ మద్యం రాకెట్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టి కొద్దిసేపట్లోనే దాన్ని తొలగించింది. టీడీపీ పెట్టిన పోస్ట్‌లో ‘ఈ కేసులో ఏ1 గా ఉన్న జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడని, గతంలో వైయస్సార్సీపీ హయాంలో ఈ నకిలీ మద్యం దందా నడిపించాడని, కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ అయిన జయచంద్రారెడ్డి, 15 రోజుల క్రితం వైసీపీ పెద్దల ఆదేశాలతో నకిలీ మద్యం దందా మొదలుపెట్టాడంటూ’ అర్థం లేని ఆరోపణలు చేశారు.
ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎవరి అనుచరుడిగా అయితే చెబుతున్నారో అదే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. పైగా ఇప్పుడు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జిగా కూడా ఆయనే కొనసాగుతున్నాడు.
జయచంద్రారెడ్డి వైయస్సార్సీపీ కోవర్టు అయినట్టయితే గతంలో వైయస్సార్సీపీలో పనిచేసిన ఎంతోమంది ఇప్పుడు టీడీపీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారు. వారు కూడా మా పార్టీ కోవర్టులేనా? కోవర్టులని తెలిసి పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? ఇంకా వారిని పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు కనువిప్పు కలిగేలా కేంద్రం ఎన్సీఆర్బీ రిపోర్టు విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2019-24 మధ్య వైయస్ జగన్ పాలనలో ఏ ఒక్కరూ కల్తీ మద్యం తాగి చనిపోలేదని స్పష్టం చేసింది.