Suryaa.co.in

Editorial

పోలీసులు పనిచేస్తున్నారా?

– బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన వ్యాఖ్యలపై చర్యలేవీ?
– షర్మిల కాబట్టి బాపట్ల దాటిందన్న కోన
– మరొకరైతే బాపట్ల నుంచి వెళ్లనిచ్చేవాళ్లం కాదంటూ ఘూటు హెచ్చరిక
– దమ్ముంటే రమ్మని షర్మిల ప్రతి సవాల్
– ఎంతమంది వస్తారో చూద్దామని షర్మిల ఫైర్
– మీ దమ్మేంటో చూపాలని సవాల్
– ఇప్పటిదాకా కోనపై చర్యలు తీసుకోని పోలీసులు
– కొందరిపైనేనా పోలీసుల ప్రతాపం
– ఏపీ పోలీసుల పనితీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– ఇదంతా టికెట్ కోసం ఉత్తుత్తి హెచ్చరికలేనంటున్న వైసీపీ వర్గాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సమరసింహారెడ్డీ.. ఢిల్లీలో కాదురా.. సీమ సందుల్లోకి రారా.. చూసుకుందాం నీ పెతాపమూ నా పెతాపమూ…
నీ ఊరొచ్చా.. నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా.. నీకు మూతిమీద ఉన్నది మొలిచిన మీసం అయితే నన్ను చంపరా.. రా.
నాన్నా.. సింహం సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి.

రాయలసీమ ప్యాక్షన్ సినిమాల్లోని ఈ భారీ డైలాగులు… సినిమా హాల్లో వినిపిస్తే ఈలలు, కేకలు, చప్పట్లు. బాక్సాఫీసు బద్దలయిపోతుంది. కానీ అంతే అడ్డగోలుగా బయట మాట్లాడితే, పోలీసులు కేసులు పెట్టి బొక్కలే వేస్తారు. ఎందుకంటే అలా మాట్లాడటం చట్టవిరుద్ధం కాబట్టి!

సహజంగా ఎవరినైనా ఫోన్ చేసి బెదిరిస్తేనే కేసులు పెడతారు. కానీ.. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే ఒక మహిళనుద్దేశించి.. ‘‘ఆమె వైఎస్ బిడ్డ కాబట్టి బాపట్ల దాటనిచ్చాం. అదే వేరేవాళ్లయితే వేరేలా ఉండేది’’ అని ప్రెస్‌మీట్‌లో హెచ్చరించినా, ఇప్పటిదాకా చర్యలు తీసుకునే దిక్కులేదు. ఎందుకంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి. అదే స్థానంలో ఏ విపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉంటే.. ఈపాటికి సుమోటో కింద కేసులు నమోదు చేసి, స్వామిభక్తి ప్రదర్శించేవారన్న విమర్శలు ఆంధ్రా పోలీసులపై వెల్లువెత్తుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి బాపట్లలో పర్యటించారు. ఆ సందర్భంలో బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి దందాలపై విరుచుకుపడ్డారు. పదునైన పదజాలంతో తూర్పారపట్టారు. దానితో కోనకు కోపమొచ్చింది. ప్రెస్‌మీట్ పెట్టి షర్మిలకు వార్నింగు జారీ చేశారు. ‘ఆమె కాబట్టి బాపట్ల దాటగలిగింది. ఇంకొకరైతే వేరేలా ఉండేది’ అని హెచ్చరించారు. అయితే మిగిలిన వాళ్లైతే ఏం చేస్తామో కోన చెప్పకపోయినా.. బాపట్లయితే దాటనిచ్చేవాడిని కాదని చెప్పకనే చెప్పారు.

దీనిపై స్పందించిన షర్మిల.. తనను హెచ్చరించిన కోనకు, సీమ సినిమా స్టైల్లో ఒక సవాల్ విసిరారు. ‘ఒకడు బాపట్లలో నాపై పిచ్చి కూతలు కూశాడు. వైఎస్సార్ బిడ్డ కాబట్టి బాపట్ల దాటగలిగిందిఅంటున్నాడు. ఒక్క నిమిషానికి నేను వైఎస్ బిడ్డను కాదనుకుందాం. రండి ఎవరడొస్తారో చూద్దాం. ఎంతమంది వస్తారో చూద్దాం. మీ దమ్మేంటో చూపించండి. ఎవరేంటో చూసుకుందాం. చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేదు’’ అని రాములమ్మ రేంజ్‌లో, రఘుపతిపై విరుచుకుపడిన వైనం చర్చనీయాంశమయింది.

అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే, పోలీసులు మౌనంగా ఉండటం. సాధారణంగా అయితే ఈ అంశానికి సంబంధించి, ఎవరైనా కోనపై ఫిర్యాదు చేసి ఉంటే కేసు నమోదు చేయాలి. లేకపోతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే హెచ్చరికల్లో హింస ధ్వనిస్తోంది కనుక! గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇదేవిధంగా ప్రెస్‌మీట్లలో చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో పోస్టింగులు, లైకులు, ఫార్వార్డు మెసేజీలు పంపిస్తేనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయాన్ని విస్మరించలేం.

‘‘మరి షర్మిలను హెచ్చరించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోనపై కూడా, అదే సూత్రం ప్రకారం పోలీసులు ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయరు? బాపట్లలో ఆయనకు భయపడి ఎవరూ ఫిర్యాదు చేసి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి అంశాలపై సుమోటోగా కేసు నమోదు చేసిన చరిత్ర పోలీసులకు ఉంది. కాబట్టి తక్షణంపై కోనపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యే కోన హెచ్చరికలు పరిశీలిస్తే, మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రాణహాని ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకే మేం పోలీసు భద్రత పెంచమని డిమాండ్ చేస్తున్నాం’’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు.

అయితే.. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని తెలిసే కోన, పీసీసీ చీఫ్ షర్మిలను హెచ్చరించి జగన్ దృష్టిలో పడేందుకు పడ్డ తాపత్రయమేనని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. కోనను తప్పించి రెడ్లకు సీటివ్వాలంటూ, ఇప్పటికే రెడ్డి వర్గం నాయకత్వంపై ఒత్తిడి చేస్తోంది.

కొంతమంది రెడ్డి వర్గనేతలు ఈపాటికే వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కోనకు సీటు ఇస్తే ఓట్లు వేసేదిలేదని బాపట్ల రెడ్లు ఖరాఖండీగా పార్టీ సమన్వయకర్తలకు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా మళ్లీ టికెట్ కోసం తపనే తప్ప, ఆయనకు షర్మిలను బెదిరించేంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఏపీలో పోలీసులు సొంత మెదడుతో పనిచేస్తున్నారా లేదా అని అర్ధమయిపోవడం లేదూ?!

LEAVE A RESPONSE