Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాతి యుగానికి వెళ్తున్నామా?

-బాహాటంగానే పట్టభద్రుల ఓటర్లకు 1000, ఉపాధ్యాయ ఓటర్లకు 5000 పంపిణీ
-ఉపాధ్యాయ ఓటర్లు కూడా అమ్ముడు పోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు
-ప్రభువులకు కోపం వస్తే దండనలు దారుణంగా ఉంటాయట…
-పిలవకముందే విచారణకు వెళ్లడం… పిలిచినప్పుడు వెళ్లక పోవడానికేనా?
-తండ్రి కొడుకుల అరెస్టులతోనే ఆగుతారా?, లేకపోతే అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారా??
-రామోజీరావు హౌస్ మోషన్ పిటిషన్ కు శాంక్షన్ ఇవ్వకపోవడం విడ్డూరం
-దేశంలోనే రెండో అతిపెద్ద పౌర పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా??
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న తీరును పరిశీలిస్తే అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?, లేకపోతే రాతియుగానికి వెళ్తున్నామా? అనే అనుమానం కలుగుతోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే, ప్రస్తుతం ఉపాధ్యాయులకు ఆలస్యంగా ఇస్తున్న జీతాలను, ఇవ్వకపోయినా పర్వాలేదేమోనని పాలకులు భావించే అవకాశాలు లేకపోలేదు. పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం లో దొంగ ఓటర్లను చేర్చినట్లుగా, ఉపాధ్యాయ ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లను చేర్చే అవకాశం లేదు. అయినా అధికార పార్టీ ఇచ్చే ఐదు వేల రూపాయలకు అమ్ముడుపోయి పాలక పక్ష పార్టీ అభ్యర్థిని ఉపాధ్యాయులు ఒకవేళ గెలిపిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి.

శాసనమండలి ఎన్నికల్లో అన్ని స్థానాలలో తామే గెలుస్తామని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొంటున్న తీరు చూస్తే… ఓటర్లను ఎంతగా ప్రభావితం చేశారో స్పష్టమవుతుందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా తన నివాసంలో ఆయన
మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వాలంటీర్లను, పార్టీ నాయకులను, అధికారులను కూర్చోబెట్టుకొని పట్టభద్రుల ఓటర్లకు వెయ్యి రూపాయల తోనే సరిపెట్టాలని మంత్రి ఉష శ్రీ చరణ్ ఆదేశాలు జారీ చేసిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని అన్నారు. ఒక మంత్రి బాహాటంగా ఓట్లను కొనుగోలు చెప్పడం దారుణం. అధికార పార్టీ నేతలు నోట్ల కట్టలను పట్టుకొని పట్టభద్ర ఓటర్లకు వెయ్యి రూపాయలు, ఉపాధ్యాయ ఓటర్లకు ఐదువేల రూపాయల నగదును పంపిణీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్పష్టంగా కనిపించింది. ఇక పట్టభద్రుల ఓటర్లలో దొంగ ఓటర్లను విచ్చలవిడిగా నమోదు చేశారు. పదవ తరగతి చదివిన వ్యక్తి పేరు ను కూడా, పట్టభద్రుల ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని స్పష్టంగా మీడియా సమక్షంలో, ఓటరే స్వయంగా అంగీకరించిన వీడియో ను రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. దోచుకున్నదని దాచుకొని, దాచుకున్న దాంట్లో కొద్దిగా పంపిణీ చేసి భవిష్యత్తులో దోచుకోవడానికి తమ పార్టీ నేతలు ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కూడా అమ్ముడుపోవడం దారుణం. విద్య నేర్పే గురువులే అమ్ముడుపోతే, ఎంతోమంది పేదలున్న ఈ రాష్ట్రంలో, రానున్న సాధారణ ఎన్నికల పరిస్థితులను తలుచుకుంటే ఆందోళన కలుగుతుంది. ఒకే ఇంట్లో 26 మంది ఓటర్లు ఉన్నట్లు గా చూపించిన అధికార పార్టీ, అదేమని ప్రశ్నిస్తే డేటా ఎంట్రీ చేసేవారి తప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన దొంగ ఓట్లను చేర్పించడానికే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ పై ఎలక్షన్ కమిషన్ దృష్టిసారించకపోవడం మిస్మయాన్ని కలిగిస్తుంది.

విజయసాయిపై తీవ్రంగా ఆగ్రహించిన సీఎం
తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలిసిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రభువులకు కోపం వస్తే దండనలు తీవ్రంగా ఉంటాయట. కొంతమంది కళ్ళజోడు కూడా విరిగి కిందపడిపోయిందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల వారు కథలుగా చెప్పుకుంటున్నారు. నందమూరి తారకరత్న గుండెపోటు వచ్చిన రోజే చనిపోయారని మీడియాకు చెప్పాలని విజయసాయి రెడ్డిని పార్టీ నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను దగ్గరి నుంచి చూసిన విజయసాయిరెడ్డి, అలా చెప్పడానికి నిరాకరించినట్లు సమాచారం. దీనితో లక్ష్మీపార్వతి ద్వారా తారకరత్న బ్రతికుండగానే, చనిపోయినట్లుగా పార్టీ నాయకత్వం మీడియాకు చెప్పించింది. పార్టీ ఆదేశాలను తిరస్కరించిన విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో తప్పులు చేసినప్పటికీ, దుష్టులు చెప్పే మాటలు కాదని మంచి కోసం నిజంగానే విజయసాయిరెడ్డి నిలబడితే అభినందనీయం. తమ పార్టీ నిబంధనల ప్రకారం ఎవరు మంచిని చెబితే, వారిని శిక్షిస్తారు. మంచికి నిలబడిన, విజయ సాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నాయకత్వ పదవి నుంచి తప్పిస్తారేమోననే అనుమానాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

భాస్కర్ రెడ్డి కి 12 వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు సిబిఐ ఎక్కడ చెప్పలేదు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా, ఈనెల 12వ తేదీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ని హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు సిబిఐ అధికారులు పేర్కొన్న దాఖలాలే లేవని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇటీవల ఆరవ తేదీన కూడా తనకు తానే భాస్కర్ రెడ్డి, కడప జిల్లా జైలు గెస్ట్ హౌస్ వెళ్లి వెనుతిరిగి వచ్చారు. 12వ తేదీన కూడా అదేవిధంగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంది. సీబీఐ విచారణకు పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండడానికే, భాస్కర్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లుగా కడప జిల్లా పోలీసులకు కూడా సిబిఐ సమాచారం అందించలేదు. జిల్లా జైలు గెస్ట్ హౌస్ వద్ద రక్షణ కల్పించాలని ఎస్పి అన్బు రాజన్ ను సీబీఐ ఏమైనా కోరిందా?, ఈ విషయమై తాను బహిరంగంగా సవాల్ చేస్తున్నాను. భాస్కర్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చినట్లుగా జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చిందని చెప్పగలరా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పత్రికలు, మీడియా ఛానల్లు కూడా భాస్కర్ రెడ్డి చెప్పింది మాత్రమే రాయడం, ప్రసారం చేయడం దురదృష్టకరం. భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు కానీ, ఇవ్వలేదని కానీ పత్రికలలో, మీడియాలో వచ్చే కథనానలకు సిబిఐ స్పందించదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని చెప్పిన సిబిఐ
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని సిబిఐ ఇప్పటికే స్పష్టం చేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈనెల 10వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులలో 14వ తేదీన సిబిఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డి ని ఆదేశించింది. 14వ తేదీన అవినాష్ రెడ్డిని అరెస్టు జరుగుతుందా?, లేకపోతే సిబిఐ దాఖలు చేసిన రిపోర్టులను కూలంకశంగా చదివిన తర్వాతే అరెస్టు అంటారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్ లో తల దూర్చే హక్కు న్యాయస్థానానికి ఉందా? అన్నది ప్రశ్నార్థకమే. దీనికి సీబీఐ తరఫున న్యాయవాదులు, డాక్టర్ సునీత తరపు న్యాయవాది ఏమంటారన్నది ఆసక్తికరంగా మారనుంది. సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఎలా అడ్డుకట్ట వేస్తారు, న్యాయమూర్తి ఏమి చెబుతారన్నది తెలియాల్సి ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఆ ఇద్దరి అరెస్ట్ తోనే సరి పెడతారా?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా హత్యకు నిందితులతో కలిసి కుట్ర చేశారని అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టులతోనే సిబిఐ అధికారులు సరి పెడతారా?, లేకపోతే కీలక సూత్రధారుల కోసం విచారణను కొనసాగిస్తారా?? అన్నది కీలకంగా మారిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైయస్ అవినాష్ రెడ్డి ని నిందితునిగా కాకుండా, సాక్షిగా పిలవడం వెనుక సిబిఐ అధికారులు కీలక సూత్రధా రులను వెతికే పనిలో ఉన్నారని అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకులో ఆర్కే రాసిన విధంగా వైయస్ అవినాష్ రెడ్డి ని విట్ నెస్ గా పిలిచి వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ ల వాయిస్ వినిపించి ఇది ఎవరిది అని ప్రశ్నించే అవకాశం ఉంది. కొత్త పలుకులో ఆర్కే ఆలోచనల ప్రకారం, తన ఆలోచనలను జోడిస్తే ఈ విచారణ వెనుక ఏమైనా ఉందేమోనని అనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

అక్బర్ గా పేరెందుకు పెట్టుకోలేదు?
వైఎస్ వివేకానంద రెడ్డి 2011లోనే తన పేరును అక్బర్ గా మార్చుకుని ఉంటే 2014లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అదే పేరుతో ఎందుకని పోటీ చేయలేదని, వైయస్ వివేకానంద రెడ్డి పేరుతో ఎందుకు పోటీ చేశారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వైఎస్ వివేకా తన పేరును అక్బర్ గా మార్చుకున్నట్లుగా ఎక్కడైనా రికార్డులలో ఉందా?, అధికారికంగా ఆయన ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారా??, అర్థంపర్థం లేని అల్లికలతో ప్రజలను గందరగోళానికి గురి చేయడానికే ఈ రకమైన కథనాలను తమ పార్టీ నాయకులు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. సొంత చిన్నాన్న కుమార్తె, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వైయస్ వెంకట్ రెడ్డి రెండవ కుటుంబీకుల సంతానం దగ్గరయింది. దీని వెనక బహుశా గజకర్ణ గోకర్ణ విద్యలతో ఏదైనా చేయవచ్చుననే ఆలోచన ఉండి ఉండవచ్చునని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.

కక్ష కడితే జగన్ ఏ స్థాయి కైనా వెళ్తాడు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనైనా కక్ష కడితే, ఏ స్థాయికైనా వెళ్తాడని, ఆ విషయం తనకంటే బహుశా మరెవరికి ఎక్కువగా తెలియదని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఈనాడు దినపత్రిక యాజమాన్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులను ప్రభుత్వం పెట్టింది. యావజీవకారాగార శిక్ష విధించే సెక్షన్ 477, పదేళ్ల జైలు శిక్ష విధించే 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడందారుణం. గుంటూరులో అరెస్టు చేసిన వారిని న్యాయమూర్తి, రిమాండ్ కు పంపేందుకు నిరాకరించగా, విజయవాడ విశాఖపట్నంలో మాత్రం రిమాండ్ విధించడం విడ్డూరంగా ఉంది. ఒకే సెక్షన్ కింద అరెస్ట్ అయిన వారిని ఒకచోట రిమాండ్ కు తిరస్కరించగా, మరొక చోట రిమాండ్ విధించడం పరిశీలిస్తే న్యాయస్థానంలోనే న్యాయం లేదని చెప్పుకోవాలి. ఈ కేసు పై పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు హౌస్ మోషన్ మూవ్ చేశారు. అయితే హౌస్ మోషన్ మంజూరీ చేయకపోవడం ఆశ్చర్యకరం. సాధారణంగా హౌస్ మోషన్ అనేది మంజూరీ చేయకపోవడం అనేది ఉండదు. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు పై ఎవరు ఫిర్యాదు చేయకుండానే సుమోటోగా కేసులు నమోదు చేయడం దారుణం. గతంలో ఇదే తరహాలో తనపై కూడా రాజ ద్రోహం కేసును నమోదు చేశారు. తనని తన ఊరుకు రాకుండా అడ్డుకోవడం పట్ల తాను హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా మంజూరి లభించింది. రామోజీరావును కూడా అన్యాయంగా అరెస్టు చేసే ప్రమాదం ఉంది. గతంలో , సి ఆర్ పి ఎఫ్ రక్షణ ఉన్నప్పటికీ, పాతికమంది పోలీసులు వచ్చి తనని అరెస్టు చేశారు.

అదేవిధంగా రామోజీరావును అరెస్టు చేస్తారేమోనని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు. రామోజీరావు అనే వ్యక్తి తెలుగు ప్రజల ఆస్తి. ఫిలిం సిటీ ఒక అద్భుతసృష్టి. ఈనాడు దినపత్రిక రాసే నిజాలకు తమ ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందోనని, వ్యక్తిగత కక్షతోనే, కాబోలు ఆయనపై ఉద్దేశ పూర్వకంగా కేసులు నమోదు చేశారు. లేకపోతే, సాక్షి దినపత్రికకు ఈనాడు పోటీగా ఉందనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఈనాడు దినపత్రికలో మూడవ వంతు సర్కులేషన్ కూడా సాధించలేకపోతున్నామనే అక్కసుతోనైనా కేసును నమోదు చేసి ఉంటారు. సాక్షి దినపత్రిక ఐదు లక్షల పేపర్లను అన్యాయంగా విక్రయించుకుంటుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినందుకు కక్షతోనే రామోజీరావు పై కేసు నమోదు చేసి ఉంటారనే అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గతంలో తాను జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వేసినప్పుడు, తనని అన్యాయంగా అరెస్టు చేశారు. తమ పార్టీ వాళ్ళు చేయరానిది ఏమైనా చేస్తే, దాన్ని మీడియా పై దాడిగానే చూడాలి. మార్గదర్శిపై కేసుగా కానే కాదు. ప్రజలంతా ముందుకు వచ్చి రామోజీరావుకు సంఘీభావాన్ని ప్రకటించాలి. గతంలో తనని అరెస్టు చేస్తే, ఒక ఎంపీ కే దిక్కులేదు తమ పరిస్థితి ఏమిటని సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇప్పుడు రామోజీరావు పై ఒక చెత్త కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తే దాన్ని ఒక కులం పై దాడిగా, అలాగే సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే ఘటనగానే ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి. న్యాయస్థానానికి వరుసగా సెలవులు చూసుకొని రామోజీరావుకు నోటీసులు ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు, న్యాయ వ్యవస్థ ఏమిటన్న నిరాశ నిస్పృహలు కలగడం సహజం . కానీ వీటన్నింటిని అధిగమిద్దామని రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు.

తెలుగు భాషకు అంతర్జాతీయంగా దక్కిన అరుదైన గౌరవం
తెలుగు భాషకు అంతర్జాతీయంగా దక్కిన అరుదైన గౌరవం RRR చిత్రం పాటకు ఆస్కార్ అవార్డు లభించడం అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు . ఆస్కార్ ఎన్నాళ్ళ నుంచో తెలుగు వారి కల. తెలుగు వారి కల నేటితో నిజమైంది. హాలీవుడ్ లో తెలుగు పాటకు పట్టాభిషేకం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఈ పాట పై అద్భుతంగా డాన్స్ చేసిన నందమూరి తారక రామారావు, రామ్ చరణ్, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాత దానయ్యలను ఆయన అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు భాషకు పాటకు పట్టం కడితే, మన రాష్ట్రంలో మాత్రం తెలుగు భాష పరిస్థితి అయోమయంగా ఉంది. స్వచ్ఛంగా తెలుగు పలకలేని పాలకులు ఉండడమే కాకుండా, ఎవరు కూడా తెలుగు భాషను నేర్చుకోవద్దనే విధంగా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాష విషయంలోనే తనకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్లుగానే తనకు కూడా ఇంగ్లీష్ భాష వచ్చు. తాను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. ఇంగ్లీష్ భాష ద్వారా కమ్యూనికేషన్ చేయవచ్చు. అంతమాత్రాన తెలుగు భాషకు అన్యాయం చేయాలనుకోవడం సరికాదు.

మాతృభాషను, తల్లి వంటి భాషను చదువుకోవాలనుకునే వారికి దూరం చేయడం దారుణం. రాష్ట్రంలో పాలకులు తెలుగు భాషను పాతర వేయాలని చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తెలుగు భాష ప్రాచీన హోదా కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో పాటు మండలి బుద్ధ ప్రసాద్ ఎంతగానో కృషి చేశారు. తెలుగు భాషకు తండ్రి ప్రాచీన హోదా తీసుకువస్తే, కొడుకు పాతర వేయాలని చూస్తున్నాడు. తెలుగుతనానికి రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు నిదర్శనం. తాను కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే పార్లమెంటుకు పంచె కట్టుకొని వెళితే, కొంతమంది ముష్కరులు దాన్ని గోచి అని ఎగతాళి చేస్తున్నారు. తెలుగు భాషను, తెలుగు ఆహార్యాన్ని పాలక పక్షంలో ఉన్నవారు వెకిలితనంతో వెటకారం చేసిన అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పాటకు ఇంత గౌరవం దక్కిందంటే అది తెలుగు భాషలోని మాధుర్యమని రఘురామ కృష్ణంరాజు అభివర్ణించారు. రఘురామకృష్ణంరాజు అనే పేరులోని అక్షరాలు ఆంగ్లంలో RRR పదాలే కావడం వల్ల, మొదటినుంచి ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకున్నానని, అలాగే ఈ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించాలని ఆకాంక్షించానని రఘురామకృష్ణం రాజు తన మనసులోని మాటను వెల్లడించారు.

LEAVE A RESPONSE