Home » చంద్రబాబు బ్రాండ్‌ ఏపీకి మాత్రమే సొంతం

చంద్రబాబు బ్రాండ్‌ ఏపీకి మాత్రమే సొంతం

-చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు
-ప్యూన్‌ నుంచి గ్రూప్‌ -1 వరకు సింగిల్‌ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీ
-కక్షసాధింపులు ఉండవు..చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను
-నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సిరీస్‌లో బ్యాండేజి బబ్లూ జగన్‌ యాక్టర్‌
-ఒంగోలులో బెట్టింగ్‌ స్టార్‌…ఒక్క ఇళ్లయినా కట్టారా?
-ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేస్తాం…ఏడాదిలో వెలిగొండ పూర్తిచేస్తాం
-ఒంగోలు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

ఒంగోలు: దేశంలో ఏపీకి మాత్రమే ఉన్న బ్రాండ్‌ పేరు చంద్రబాబు.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది, ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌, ఐఎస్‌బీ తెచ్చింది, అనంతపురంలో కియా, విజయవాడలో హెచ్‌సీఎల్‌ తెచ్చింది చంద్రబాబే. ఈసారి చంద్రబాబు సీఎం అయితే మొదటి వందరోజుల్లోనే ఏపీకి వచ్చేందుకు ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు క్యూలో ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమరభేరిలో భాగంగా ఒంగోలు ఎ1 ఫంక్షన్‌ హాలు ఎదుట ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన యువగళం సభలో యువనేత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు గోపి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక పక్క రాష్ట్రం నుంచి ఉద్యోగాల కోసం ఏపీకి వచ్చేలా అభివృద్ధి చేస్తాం.

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఇప్పుడు కంపెనీలన్నీ ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. 2014లో 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌లో చంద్రబాబు పాలన ప్రారంభించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నిర్ణయిం చారు. శాసనసభలో అమరావతి బిల్లు తెచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపారు. ఒక్క అవకాశం మాయలో పడి ముఖ్యంగా యువత తీవ్రంగా నష్టపోయారు. ఉద్యోగాల్లేవు, ఉన్న పరిశ్రమలను పక్కరాష్ట్రానికి తరిమేశారు. కొత్తవి తేలేదు. నాడు ప్రకాశం జిల్లాకు ఏపీపీ పేపర్‌ పరిశ్రమను తెచ్చాం. వైసీపీ వచ్చాక దానిని తరిమేశారు. లులూ, అమర రాజా, ఫ్యాక్ట్స్‌ కాన్‌ వంటివి తరిమేశారు. అవన్నీ పక్క రాష్ట్రానికి వెళుతుంటే బాధ, ఆవేదన కలిగింది. యువగళం పాదయాత్రతో యువతతో చైతన్యం తెచ్చా. యువత జగన్‌ ను తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాం. మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన.

గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి హామీ ఇవ్వలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన అమరావతి పనులు ప్రారంభిస్తాం. రాష్ట్రానికి చెందిన యువత ఇక్కడే పనిచేసేలా ఉద్యోగాలు కల్పిస్తాం. ఐటిని క్యాపిటల్‌గా విశాఖను అభివృద్ధి చేస్తాం. మాకు పరదాలు కట్టుకుని తిరగాలని లేదు. భయం మా బ్లడ్‌లో లేదు. మేం ఏనాడు తప్పు చేయలేదు. చెప్పింది చేసి చూపిస్తాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దుచేస్తాం. అది చాలా ప్రమాదం. ఒరిజినల్‌ పత్రాలు జగన్‌ వద్ద పెట్టుకుంటారు. మనకు కాపీలు ఇస్తారు. రేపు పొరపా టున వస్తే మన భూములు కూడా తాకట్టు పెడతారు. వందరోజుల్లో గంజాయికి ఫుల్‌ స్టాప్‌ పెడతాం. స్మగ్లర్లు, మాఫియాలను తరిమికొడతాం. చంద్రబాబును చూస్తే రౌడీలు, స్మగ్లర్లకు టెర్రర్‌. అసాంఘిక శక్తులకు బాబు పాలనలో చోటు ఉండదు.

ఒక్క అవకాశం మాయలో కోలుకోలేని నష్టం
తమిళనాడుతో పోరాడి కియా తెచ్చిన ఘనత చంద్రబాబుది. గత ప్రభుత్వంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 35 లక్షలమంది ఉపాధి కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నాం. నాడు స్కిల్‌ డెవల్‌మెంట్‌ సెంటర్ల ద్వారా స్కిల్‌ అప్‌ గ్రేడేషన్‌ వల్ల 1.20 లక్షలమందికి ఉద్యోగాలు లభించాయి. చంద్రబాబు పాలనలో 40 వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంది. 2019లో ఒక్క అవకాశం మాయలో అందరూ పడ్డారు. ఆ మాయమాటలే రాష్ట్రాన్ని నాశనం చేశాయి. నాడు ఏపీ జాబ్‌ క్యాపిటల్‌గా ఉంటే ఈరోజు గంజాయి క్యాపిటల్‌గా మారింది. ఐదేళ్లుగా ఒక్క పరిశ్రమ, ఒక్క పెట్టుబడి రాలేదు. మెగా డీఎస్సీ ఇస్తామన్నారు, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు ఏమయ్యాయి? ఈరోజు చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదలచేశారు. మొదటి హామీ 2 0లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు వచ్చే వరకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని చెప్పారు. ప్యూన్‌ నుంచి గ్రూప్‌-1,2 ఉద్యోగాలన్నింటికీ కలిపి సింగిల్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీచేస్తాం.

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సిరీస్‌ బ్యాండేజి బబ్లూ జగన్‌
విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌. నెట్‌ ఫ్లిక్స్‌ కొత్త సిరీస్‌ వచ్చింది… దానిపేరు బ్యాండేజి బబ్లూ, అందులో యాక్టర్‌ జగన్‌, ప్రొడ్యూసర్‌ భారతీరెడ్డి, డైరక్షన్‌ ఐ ప్యాక్‌, దానికి ఇప్పటికే భాస్కర్‌ అవార్డు వచ్చింది, ఆస్కార్‌ కూడా రావడం ఖాయడం. మాటమాటకి బటన్‌ నొక్కినా అంటున్నాడు. ఆ బటన్‌కు కరెంటు కట్‌ అయింది. ఒక్క నెల ఓపిక పట్టండి… విద్యార్థులకు పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేస్తాం. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు, మార్కుల లిస్టులు ఇప్పిస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రక్షాళన చేస్తాం. బలోపేతం చేస్తాం. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం అమలులోకి తెచ్చి విద్యార్థుల కష్టాలు తొలగిస్తాం.

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను
ప్రజాస్వామ్యంలో చట్టాలను కాపాడాల్సిన బాధ్యత జ్యుడీషియరి, మీడియా, అధికార యంత్రాంగంపై ఉంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. నాపై 23 కేసులు పెట్టారు. ప్రజలు, యువత తరపున పోరాడినందుకు అడుగడుగునా కేసు పెట్టారు. శాసనసభలో మా తల్లిని అవమానించారు. తాజాగా డీప్‌ ఫేక్‌ వీడియోలు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాం. ఈసారి చదువుకున్న వారు బరిలో ఉన్నారు. వారిని శాసనసభకు పంపాల్సిన బాధ్యత యువతపై ఉంది. రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు సీఎంగా ఉండగా శాసనసభలో ప్రజాసమస్యలపై చర్చలు జరిగాయి. 2019 ఎన్నికల్లో రౌడీలు, గూండాలు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు అసెంబ్లీకి వచ్చాయి. రాజధానిపై మాట్లాడితే శాసనమండలిలో నాపై దాడికి దిగారు. కొడాలి నాని కుర్చీ ఎక్కి నాటి మండలి చైర్మన్‌ షరీఫ్‌ను అవమానించారు. అటువంటి వారిని చట్టసభలకు రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే.

గతంలో ప్రతి జీవో వెబ్‌ సైట్‌ ద్వారా పెట్టాం. ఇప్పుడు డ్యాష్‌ బోర్డు లేదు. అర్థరాత్రి దొంగచాటుగా జీవోలు ఇస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరిగానే పారద ర్శకమైన పాలన అందిస్తాం. పాదయాత్రలో జీవో 1 తెచ్చి నా గొంతు నొక్కారు. ఏ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారో వారిపై జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి జైలుకు పంపుతాం. నాది కక్షసాధింపు కాదు. అదే సమయంలో తప్పుచేసిన వారిని ఉపేక్షించకూడదు. అటువంటి వారిని వదిలిపెట్టను. చట్టపరిధిలోనే అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. రాజకీయంగా శత్రువులు ఉండరు, రాజకీయ విభేదాలు ఉంటాయి. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు మా విధానం కాదు. చంద్రబాబు మాకు నేర్పింది అదే. అధికారంలోకి వచ్చాక అదే పద్ధతిని కొనసాగిస్తాం. ఏ అధికారులైతే చట్టాలు ఉల్లంఘించి ఇబ్బందిపెట్టారో, వారిని వదిలిపెట్టను. పేరుమర్చిపోకుండా రెడ్‌ బుక్‌ లోరాశా. అది కక్షసాధింపు కాదు.

ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా మారుస్తాం..
ప్రకాశం జిల్లానుంచే రాష్ట్రంలో మార్పు మొదలైంది. మహానాడులో మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతలే కూటమిని గెలిపించబోతుంది. పౌరుషానికి మారుపేరు ప్రకాశం జిల్లా, పౌరుషం అంటే గుర్తు వచ్చేది ఒంగోలు గిత్త. ప్రకాశం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. 2019లో ఎదురుగాలిలోనూ నలుగురు శాసనసభ్యులను గెలిపించారు. ప్రకాశం జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసే బాధ్యత తీసుకుంటా. వెలిగొండ ప్రాజెక్టు, కాల్వలు తొలి ఏడాది పూర్తిచేసి సాగు-తాగునీరు అందిస్తాం. నేషనల్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌కు గతంలో భూకేటాయింపులు చేశాం. ప్రజా ప్రభుత్వ, వచ్చాక అక్కడ పరిశ్రమలు తెస్తాం. ప్రకాశం జిల్లాను ఫార్మాహబ్‌ చేసే బాధ్యత నేను తీసుకుంటా. పాదయాత్రలో యువగళం పవర్‌ స్పష్టమైంది. మే 13న ఎన్నికల్లో యువత అంతా ఓటువేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ కంచుకోట అని నిరూపించండి. పాదయాత్రలో అనేక సమస్యలు నాకుచెప్పారు. అవన్నీ మేనిఫెస్టోలో పెట్టాం. నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత మంత్రికి పంపి అమలయ్యేలా చూస్తాం.

బెట్టింగ్‌ స్టార్‌..ఒక్క ఇళ్లయినా కట్టారా?
దామచర్ల జనార్దన్‌ 2500 కోట్లతో ఒంగోలును అభివృద్ధి చేశారు. రోడ్లు, డ్రైన్లు, నిరుపేదలకు ఇళ్లు కట్టించారు. గత ఎన్నికల్లో మీరు బెట్టింగ్‌ స్టార్‌ను గెలిపించారు. ఆయన ఒక్క ఇళ్లయినా కట్టారా? ఒంగోలులో ఎక్కడ చూసినా గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లే కన్పిస్తున్నాయి. ప్రత్యేక విమానంలో రష్యా వెళ్లి బెట్టింగులు వేశారు. అనిల్‌ యాదవ్‌తో పోటీపడుతున్నారు. డబ్బులు లేకపోతే కంపెనీల నుంచి, గ్రానైట్‌ ఫ్యాక్టరీల నుంచి వసూలు చేశారు. ఒంగోలు ప్రజలు ఆలోచించండి. ఒంగోలు ప్రజలు ఎవరు కావాలో ఆలోచించండి. మీకు ఎలాంటి నాయకత్వం కావాలో ఆలోచించండి. సమయం లేదు మిత్రమా… రెండువారాలే కీలకం. యువకులంతా ఆలోచించండి. ఫోన్‌లో తెలిసిన వారిని చైతన్యం తీసుకురండి. భారీ మెజారిటీతో డిజెని గెలిపించండి.

ఒంగోలును దత్తత తీసుకుని అభివృద్ధి చేయండి
దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ…రాబోయే 12రోజులు కసిగా పనిచేయాలి. ప్రతిఒక్కరూ మంచి మెజారిటీతో ఒంగోలులో టిడిపి జెండా ఎగురవేసేలా కష్టపడాలి. గత ప్రభుత్వ హయాంలో 2600 కోట్లతో అభివృద్ధి చేశాం. తాగునీటి స్కీమ్‌ 165 కోట్లు వెచ్చించాం. వాసు 2 కి.మీ. పైప్‌ లైన్‌ వేయలేకపోయారు. అధికారంలోకి వచ్చాక ఏడాదిలో నీటి సమస్య పరిష్కరించాలి. పోతురాజు కాల్వ సమస్య ఉంది. వర్షంపడితే ఇబ్బందులు పడుతున్నాం. గతంలో 85 కోట్లు మంజూరు చేయించాం. వైసీపీ వచ్చాక కాంట్రాక్టర్‌ వదిలేశారు. ఆ పనిని క్యాన్సిల్‌ చేశారు. టిడ్కో ఇళ్లు 80 శాతం కంప్లీట్‌ చేశాం. 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలి. వైసీపీ వారు దొంగపట్టాలు ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చాక పేదలకు 2 సెంట్లు ఇవ్వాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి పూర్తిచేయాలి. ప్రభుత్వం రాగానే పూర్తిచేయాలి. ఒంగోలును దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని దామచర్ల జనార్దన్‌ కోరారు.

యువత ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానాలు

ప్రశ్న: జగన్‌ రెడ్డి ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ, ప్రతి ఏడాది జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని జ్ఞానభేరీ కార్యక్రమాలు నిర్వహించి జగన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో 99శాతం అమలు చేశామంటున్నారు. వాటిల్లో ఇవి ఉన్నట్టా, లేనట్టా? యువత ఉన్నట్టా, లేనట్టా? మీరు ఎలా చూస్తారు?
నారా లోకేష్‌: ఆనాడు జగన్‌ రెడ్డి ఒక్క అవకాశం అడిగారు. ఆ మాయలో ప్రజలు పడ్డారు. ఈ రోజు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా యువత ఎక్కువగా నష్టపోయింది. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్టాలకు తరిమికొట్టారు. ఆనాడు ఒంగోలు జిల్లాకు ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమ తీసుకువచ్చాం. సుబాబు రైతులను ఆదుకోవడంతో పాటు 12 వేల ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమ తీసుకువచ్చాం. ఆ ఒప్పందం రద్దు చేశారు. లూలు, అమర్‌ రాజా, ఫాక్స్‌ కాన్‌ లాంటి అద్భుత పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. ఒక యువకిడిగా బాదపడ్డా. పరిశ్రమలు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డా. పైల్స్‌ పట్టుకుని తిరిగాం. యువగళం పాదయాత్ర ద్వారా జగన్‌ రెడ్డి విధ్వంసంపై చైతన్యం తీసుకువచ్చా. ఇదే యువత మే 13న జగన్‌ రెడ్డిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రశ్న: ఆ భరోసా పాదయాత్రలో మీరు కల్పించగలిగారని అనుకుంటున్నారా?
నారా లోకేష్‌: అది ప్రజలే నిర్ణయిస్తారు. పాదయాత్రలో అన్ని వర్గాలను కలిశా. ప్రజల మస్యలు నేరుగా తెలుసుకున్నా. ఆయా సమస్యలకు పరిష్కారంగా ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వలేదు. మేం చెప్పాం. అదీ మాకున్న చిత్తశుద్ధి.

ప్రశ్న: నేను హిందూపూర్‌ నుంచి పెనుకొండ వస్తున్నప్పుడు కియా పరిశ్రమ చూసి చాలా ఆనందపడ్డా. నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. కియా కోసం మీరు పడిన కష్టం చూసి ఇది చెబుతున్నా. పరిశ్రమల పంట ద్వారా యువతలో విశ్వాసం నింపుతారని భరోసా ఇస్తారా?
నారా లోకేష్‌: అనంతపురం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా. అలాంటి జిల్లాకు కార్లు తయారు చేసే పరిశ్రమ తీసుకువచ్చాం. చిత్తురూ జిల్లాకు టీవీ, సెల్‌ ఫోన్లు తయారుచేసే పరిశ్రమలు తీసుకుచ్చాం. అందుకే ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌ గా తయారు చేస్తాం. ఒక్కో జిల్లాకు ఒక్క ప్రాధాన్యత ఇస్తాం. అప్పుడే ఎకో సిస్టమ్‌ వస్తుంది. ఆ దిశగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.

ప్రశ్న: ప్రణయ్‌కుమార్‌ కొల్లం, ఒంగోలు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో చదువుకుని రాజధాని లేక ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై ఇప్పటికే అభివృద్ధి చెందాయి. జగన్‌ దయవల్ల రాజధాని లేని రాష్ట్రంలో బతకాల్సిన కర్మపట్టిందని బాధ పడు తున్నాం. అమరావతిని అభివృద్ధి చేసి, పరిశ్రమల ద్వారా ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని మాలాంటి యువత కోరుకుంటున్నాం.
లోకేష్‌: ఒక్క నెల ఓపికపట్టండి. ఆగిపోయిన అమరావతి పనులు ప్రారంభిస్తాం. మీ లాంటి యువకులు ఒంగోలు నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడే ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. విశాఖకు ఐటీ పరిశ్రమలు తీసుకువస్తాం. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని- జై అమరావతి మా నినాదం.

యువతి: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి మీ ప్లాన్‌ ఏంటి? ఇదేమైనా ఎలక్షన్‌ జిమ్మిక్కా?
నారా లోకేష్‌: మనకొక బ్రాండ్‌ ఉంది. ఆ బాండ్‌ పేరు చంద్రబాబునాయుడు. ఆనాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఎవరు, ఆనాడు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటు చేసింది ఎవరు.. సీబీఎన్‌, ఐఎస్‌బీ తీసుకువచ్చింది ఎవరు.. చంద్రబాబు. కియా పరిశ్రమ తీసుకువచ్చింది ఎవరు, హెచ్‌ సీఎల్‌ తీసుకువచ్చింది ఎవరు.. చంద్ర బాబునాయుడు. ఏపీలో 6 లక్షల ఉద్యోగాలను టీడీపీ ప్రభుత్వం కల్పించిందని స్వయంగా వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో ఒప్పుకుంది. చిత్తూరుకు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, కర్నూలుకు రెన్యూవబుల్‌ ఎనర్జీ పరిశ్రమలు తీసుకువచ్చాం. ఇప్పుడు కంపెనీలు వెయిటింగ్‌.. ఎప్పుడు ఈ బ్యాండేజ్‌ బబ్లూ వెళ్లిపోతాడా అని? ఈ బ్యాండేజ్‌ బబ్లూను పంపిస్తే వంద రోజుల్లో కంపెనీలు నెలకొల్పుతామని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. చంద్రబాబు బ్రాండ్‌ విలువ నాకు తెలుసు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పేంచే బాధ్యత మేం తీసుకుంటాం.

ప్రశ్న: పాదయాత్రలో రాజ్యాంగం పట్టుకుని చిత్తూరులో ఓ డీఎస్పీతో ఫైట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిసారి ప్రజాస్వామ్యం అని మీరు అంటుంటే నాకు ఈ ప్రశ్న అడగాలని అనిపించింది. హెల్దీ డెమోక్రసీ, ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏమిటి?
నారా లోకేష్‌: ప్రజాస్వామ్యంలో జ్యుడీషియరీ, మీడియా, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారి బాధ్యతలు నెరవేర్చుకునేలా చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు మాట్లాడినా కేసు. నాపై 23 కేసులు పెట్టారు. నాపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ప్రజల తరపున, యువత తరపున పోరాడినందుకు కేసులు పెట్టారు. ఇది మంచిది కాదు. శాసనసభలో మా తల్లిని అవమానించారు. నిన్నగాక మొన్న డీప్‌ ఫేక్‌ వీడియో కూడా విడుదల చేశారు. ప్రజల తరపున పోరాడితే మానసికంగా ఇబ్బంది పెట్టడమే వారికి తెలుసు. వెనక్కి తగ్గుతారని వారి ఆలోచన. అయినా తెలుగుదేశం-జనసేన పార్టీ తగ్గేదే లేదు. 4 సంవత్సరాల 11 నెలలుగా వీరు చేస్తున్న తప్పులను ప్రజల్లో నిలదీశాం. ఇక ఉంది 13 రోజులే. టీడీపీ తరపున బాగా చదువుకున్న వారు బరిలో ఉన్నారు. వారిని అసెంబ్లీకి పంపించాల్సిన బాద్యత యువతపై ఉంది. అప్పుడే హెల్తీ డెమోక్రసీ ఏర్పడుతుంది.

ప్రశ్న: ఏం జరిగితే రాష్ట్రంలో హెల్తీ డెమోక్రసీ వస్తుంది?
నారా లోకేష్‌: గతంలో వైఎస్‌ ఉన్నప్పుడు శాసనసభలో మంచి చర్చలు జరిగేవి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అద్భుతమైన చర్చలు జరిగేవి. ఇప్పుడు వైకాపాలో రౌడీలు గూండాలు, గంజాయి బ్యాచ్‌. అసెంబ్లీలో వీరితో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడితే అవమా నిస్తారు. గట్టిగా నిలదీస్తే శాసనమండలిలో నాపై దాడి చేశారు. సన్నబియ్యం సన్నాసి కౌన్సిల్‌ లో షరీప్‌ గారిని అవమానించారు. అలాంటి వారు శాసనసభ, మండలికి వస్తే హెల్తీ డెమోక్రసీ ఉండదు. ప్రజలపై బాధ్యత ఉంది. రాష్ట్రానికి సమర్థ నాయకత్వం ఎవరు వహిస్తారో, నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేస్తారో వారినే గెలిపించాలి.

ప్రశ్న: పారదర్శక ప్రభుత్వం అంటే మీరు ఎలా నిర్వచిస్తారు?
నారా లోకేష్‌: గతంలో మేం చేసి చూపించాం. నేను పంచాయతీరాజ్‌, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధిం చానో పారదర్శకంగా ప్రజల ముందు పెట్టాం. చంద్రబాబు ప్రతి జీవో ప్రజల ముందు పెట్టారు. ఇప్పుడు జీవోలు రహస్యంగా పెడుతున్నారు. అర్థరాత్రి దొంగ జీవోలు విడుదల చేశారు. గతంలో ఏ విధంగా పారద ర్శకంగా వ్యవహరించామో అలానే చెస్తాం.

గాయత్రి: వైసీపీ పాలనలో చాలా అరాచకాలు జరిగాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా మంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు చేస్తామంటున్నారా, ఇవన్నీ కొనసా గాల్సిందేనా?
నారా లోకేష్‌: నాపై 23 కేసులు పెట్టారు. 2019కు ముందు నాపై ఒక్క కేసు లేదు. నన్ను 6,7సార్లు పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారు. పోలీస్‌ స్టేషన్‌ అత్తగారి ఇల్లులా మారిపోయింది. జీవో నెం.1 తీసుకువచ్చి పాదయాత్రలో మైక్‌ పట్టుకుని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. తప్పు చేసిన అధికారులపై న్యాయవిచారణ చేసి జైలుకు పంపిస్తాం. తప్పుచేసిన వారిని ఉపేక్షించకూడదనేది నా ఉద్దేశం. నాది కక్షసాధింపు కాదు. రాజ్యాంగాన్ని కాపా డాల్సిన వారు కాలరాశారు. అందుకే వారిని నేను వదిలిపెట్టనని చెప్పా. నేను చట్టాన్ని పాటించి తప్పుచేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా.

యువకుడు: 2019లో ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ స్థానాల్లో టీడీపీని గెలిపించాం. రేపు కూడా ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తాం. మంగళగిరి మాదిరిగానే ప్రకాశం జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి?
నారా లోకేష్‌: నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కువ నిధులు ఖర్చు చేశాం. ఆనాడు మేం కట్టిన డ్రైయిన్లే, రోడ్లే ఉన్నాయి. దామరచర్ల జనార్థన్‌ నాయకత్వంలో 2,500 కోట్లు ఖర్చుచేశాం. నూటికి నూరు శాతం ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇవ్వండి. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సాగునీరు, తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం ప్రాజెక్టు చేపడితే రద్దు చేశారు. తాగునీరు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు.

రామకృష్ణారెడ్డి: ఇంతమంది ఆలోచనలు తీసుకుని, వారి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారంటే మీ దమ్ము, ధైర్యం అర్థమవుతోంది. పరదాలు కట్టుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రి దమ్ము ఏంటో, మీ దమ్ము ఏంటో అర్థమవుతోంది. వైఎస్‌ షర్మిల క్రిస్మమస్‌ కు శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగ్‌ కార్డు పంపారు. మీరు తిరిగి ట్వీట్‌ చేస్తూ రీవిషెస్‌ చెప్పారు. మీరు కావాలనే చేశారా?
నారా లోకేష్‌: మనకు రాజకీయంగా ప్రత్యర్థులు ఉండవచ్చు. వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. నాకు షర్మిల క్రిస్మస్‌ పండుగకు కేక్‌ పంపారు. అలా పంపడం నాకు నచ్చింది. నేను థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశా. ఆమె నెంబర్‌ నావద్ద లేదు. మేం ప్రతి దీపావళికి మా తల్లి గారు హెరిటేజ్‌ నుంచి గిప్ట్‌ ప్రొడక్ట్స్‌ అందరికీ పంపేవారు. ఇది ఒకరినొకరు గౌరవించుకోవడంలో భాగమే. వేరే ఆలోచన నాకు లేదు. ప్రతి ట్వీట్‌ను రాజకీయ కోణంలో చూడవద్దు. మానవత్వం చూడాలి. బ్యాండేజ్‌ బబ్లూకి మానవత్వం ఉండకపోవచ్చు. మా పోరాటం వ్యక్తిగతంగా కాదు.. వైఎస్‌ పై వ్యక్తిగతంగా మేం ఎప్పుడూ మాట్లాడలేదు. చంద్రబాబు గారు మాకు నేర్పించిన సిద్ధాంతాలకు మేం కట్టుబడి ఉంటాం.

యువకుడు: రాజకీయాలు కాకుండా వ్యక్తిగతంగా అయితే మీరు చాలా మందికి ఇనిస్పిరేషన్‌. గతంలో కంటే మీరు చాలా మారిపోయారు. ఏ సినిమా హీరో మారనంతగా మీరు మారిపోయారు. పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా మారిపోతుందని చెబుతున్నారు. మీరు కూడా మూడు రెట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇదెలా సాధ్యం?
నారా లోకేష్‌: సూపర్‌ సిక్స్‌ లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన. అప్పులు చేసి సంక్షేమం కాదు.. అభివృద్ధి చేసి ఆ వనరులతో సంక్షేమం చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఏపీ ఏకానమీ రెంటు రెట్లు పెరుగుతుంది. అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజల కోసం ఖర్చు చేస్తాం.

యువతి: నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నా. విద్యాదీవెన బటన్‌ నొక్కుతారు కానీ, డబ్బులు పడటం లేదు. దీంతో హాల్‌ టికెట్లు ఇవ్వడం లేదు. పీజీకి స్కాలర్‌ షిప్పులు తీసేశారు. మాలాంటి వారు డిగ్రీతోనే చదువు ఆపేయాలా?
నారా లోకేష్‌: గతంలో స్కూల్‌ ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌, పీజీ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సమయానికి ఇచ్చేవాళ్లం. విదేశీ విద్య పథకాన్ని తీసుకువచ్చాం. జగన్‌ వచ్చిన తర్వాత నాశనం చేశారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానం తీసుకువస్తాం.

Leave a Reply