సాక్షి, భారతి సిమెంట్ కంపెనీలను ఉద్ధరించడానికేనా మీ స్కీములు?

-సాక్షికి కోట్ల రూపాయల ప్రకటనలు క్విడ్ ప్రో కో కాదా?
-సర్కారు ఇళ్లకు భారతీ సిమెంట్ ఒక్కటే పనికొస్తుందా?
-స్కీముల పేరిట జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ ల గురించే మాట్లాడాను
– ఆయన కు ఎంత ఆయాచిత లబ్ధి చేకూరిందో గణాంకాలతో సహా వివరించా
– అయినా సాక్షి దినపత్రికలో ప్రజలకు లబ్ధి చేకూర్చే స్కీముల గురించి ప్రశ్నించాననడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం
-మీ ఏడుపు మీరు ఏడవండి.. నేను చెప్పదలుచుకుంది కోర్టు, ప్రజలకు చెబుతా
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్కీముల గురించి మాట్లాడలేదని, అందులోని స్కామ్ ల గురించి మాత్రమే మాట్లాడానని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు తెలిపారు . స్కీముల పేరిట జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాములలో ఆయనకు ఎంత ఆయాచిత లబ్ధి చేకూరిందో గణాంకాలతో సహా న్యాయస్థానానికి వివరించానన్నారు .

నేను చెప్పిన దాన్ని యధావిధిగా నమ్మవద్దని… స్కీముల పేరిట జరిగిన స్కాములపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాకున్న హక్కును వినియోగించుకొని న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ( పిల్ ) దాఖలు చేసినట్లు వివరించారు.

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి చెబుతున్న స్కీమ్ లు… స్కీములో, స్కాములో విజ్ఞులైన ప్రజలే నిర్ణయించాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు లక్షల పైగా ఉన్న వాలంటీర్లకు ప్రభుత్వ ధనాన్ని 200 రూపాయల చొప్పున కేటాయించి, సాక్షి దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే, సచివాలయంలోని 11 మంది సిబ్బంది కూడా సాక్షి దినపత్రికను కొనుగోలు చేసి చదవాలన్నారు.

ఒక సచివాలయానికి ఒక పత్రిక వేస్తే సరిపోయే దానికి, 11 మంది సిబ్బందికి గాను 11 మంది చేత సాక్షి దినపత్రిక కొనుగోలు చేయిస్తూ… సాక్షి దినపత్రిక కాపీలను ప్రతిరోజు ఆరు లక్షల అమ్ముకుంటున్నారు. దీన్ని ప్రజాకర్షక పధకం అంటారా?,ప్రజల కోసం తీసుకువచ్చిన స్కీం అంటారా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ప్రతిరోజు ఆరు లక్షల కాపీలు అమ్మేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత లబ్ధి పొందుతున్నారో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు.

వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ, సాక్షి దినపత్రికకు అడ్వర్టైజ్మెంట్లను ఇస్తున్నారు. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత లబ్ధి పొందుతున్నారో అందరికీ తెలిసిందే. అయినా, నాకు పేపర్ లేదు… టీవీలు లేవు అని చెప్పడం వెనుక ఆయన ఏమి పిచ్చోడు కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, తన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రికకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. అది నేరం అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి సాక్షి దినపత్రికలో తనకు వాటా లేదని చెబుతున్నారన్నారు.

అయినా, సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఎలా భాగస్వామియో కోర్టుకు ఆధారాలతో సహా వివరించాను. నేనే కాదు… తెదేపా నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి కూడా సవివరంగా వివరించారు. సాక్షి దినపత్రికను వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి అమ్ముకోవడం ద్వారా, నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్టైజ్మెంట్లను ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారో వాటి వివరాలన్నింటితో పాటు , చట్టాలను ఎలా విస్మరించారో కోర్టుకు వివరించినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే గృహాలకు జగన్మోహన్ రెడ్డి సర్కారే సిమెంటును సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటాగా వచ్చే నిధులను సిమెంట్ కంపెనీలకు బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారులకు సిమెంట్ సరఫరా చేస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణాలకు సింహభాగం భారతి సిమెంట్ ను సరఫరా చేస్తున్నారు. అలాగే, కొంతమేర క్విడ్ ప్రోకో లో భాగంగా గతంలో తనకు సహకరించిన సిమెంట్ కంపెనీల సిమెంట్ ను కూడా సరఫరా చేస్తున్నారు. అది కూడా తప్పే.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం తో ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి వీలు లేదు. తన కుటుంబ సభ్యులకు కంపెనీ నుంచి ఒక్క బస్తా సిమెంట్ కొనడానికి వీలు లేదు. భారతి సిమెంట్స్ కంపెనీలో 49 శాతం వాటా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులదే. భారతి సిమెంట్స్ కంపెనీ లో తనకు భాగస్వామ్యం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి వీలు లేదు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న గృహాలకు ఎంత సిమెంట్ సరఫరా చేశారన్నది, ఆ కంపెనీ వెబ్ సైట్ పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇది స్కిమ్ అంటారా? స్కాం అంటారా? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. మద్యం కంపెనీల లైసెన్స్ ఎవరెవరికి ఇచ్చారో, గతంలో ఉన్న లైసెన్సును ఎవరెవరు తీసుకున్నారో విచారించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ఉచిత ఇసుక పేరిట జరిగిన కుంభకోణాన్ని ప్రశ్నించటం జరిగింది. ఇసుక కుంభకోణంపై తన శంఖారావం సభలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వివరించారు . ఇసుకలో ఎంత సొమ్ములు చేతులు మారాయన్నది అందరికీ తెలిసిందే. అయినా, జగన్మోహన్ రెడ్డిని ఒక మహానుభావుడి గా పేర్కొంటూ, ఆయన ప్రజలకు మేలు చేసే పథకాలను ప్రవేశ పెడితే, వాటి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే, నేను ప్రశ్నించినట్లుగా సాక్షి దినపత్రికలో దిగజారుడు రాతలు రాశారన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సాగించిన అక్రమార్జనను మాత్రమే నేను ప్రశ్నించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమార్జన పై మాత్రమే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.

దానికి జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాది సమాధానం ఇస్తూ… ఇది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కాదని, వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేయడానికి నాకు అర్హత లేదన్నారు. నాపై ఎన్నో కేసులు ఉన్నాయని జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జగన్మోహన్ రెడ్డి న్యాయవాది వాదనలపై, నేను కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. నేను వేసిన ఈ కేసుకు, నాపై ఉన్న ఏ కేసుకు సంబంధం లేదు.

ఈ కేసుతో ఏదైనా కేసుకు సంబంధం ఉంటే న్యాయస్థానానికి ముందే తెలియజేసే ఉండే వారినని పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఏం జరిగిందో అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురిస్తే… సాక్షి దినపత్రికలో మాత్రం దానికి భిన్నంగా ఎంతోమంది లబ్ధి పొందుతున్న ప్రజాకర్షక పథకాలపై కేసు వేసినట్లుగా, నన్ను ఒక ప్రజా ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే భ్రమిస్తున్నారేమో.

అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు .. నేను మీ స్కీముల గురించి మాట్లాడలేదు… కేవలం మీరు చేసిన స్కాముల గురించి మాత్రమే మాట్లాడానని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. సాక్షి పేపర్ చదివి అపార్థం చేసుకునే వారు అసలు నిజాలను తెలుసుకోవాలన్నారు. ఇక సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా మాట్లాడే వై ‘చీప్స్ ‘ కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అయి, దేని గురించి ప్రశ్నించానో తెలుసుకోవాలని సూచించారు. కన్నాలు వేసిన దాని గురించి మాత్రమే ప్రశ్నించానని, 15వ తేదీన మీ వాదనలు మీరు వినిపిస్తే, నా వాదనలు నేను వినిపిస్తానన్నారు.

మీ ఏడుపు మీరు ఏడిస్తే, నేను ప్రజల బాధలు వివరిస్తాను. ఈ కేసు కోర్టులో ఉన్న దృష్ట్యా ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, వైయస్సార్ ఆసరా పేరిట నొక్కిన బటన్ కు 6000 కోట్ల రూపాయలు ఇంకా పంపిణీ చేయలేదట అని అన్నారు.

కొత్త అప్పులు వస్తే కానీ కుదరదేమోనన్న ఆయన, కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకు పిలిచి మీకు 21 వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాం. ఆ మొత్తం బాకీ తీర్చలేము. నాలుగైదు వేల కోట్ల రూపాయలు అంచలంచెలుగా తీరుస్తాం. గతంలో అసలు అప్పు ఎంతో చెప్పలేదు. ఇప్పుడు అప్పు గురించి చెప్పాము కాబట్టి మమ్మల్ని మంచిగా చూసుకోవాలని కోరారట. ఇప్పటికే ప్రజలకు, ఉద్యోగులకు పరిస్థితి ఏమిటో అర్థం అయింది. ఇంకా మీ పప్పులేమి ఉడకవని రఘురామకృష్ణం రాజు అన్నారు.

మా బంగారం పై నమ్మకం లేదు… విచారణ జరిపించండి
రిషికొండ పర్యావరణ ఉల్లంఘన పై నియమించిన పర్యావరణ కమిటీ చైర్మన్ గౌరప్పన్ తుది నివేదికపై సంతకం చేయడానికి ముందే గుండెపోటుతో మరణించడం అనేక అనుమానాలకు తావునిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రిషికొండపై 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవంతి అక్రమాలను తేల్చడానికి నియమించిన పర్యావరణ కమిటీకి గౌరప్పన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

ఇంత వివాదాస్పద కేసులో తుది నివేదిక పై సంతకం చేసే ముందు ఆయన గుండెపోటుతో మరణించారంటే, అది సహజ మరణమని ఎవరికి అనిపించడం లేదు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే రిషి కొండపై నిర్మించిన భవంతిని కొట్టి వేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, పర్యావరణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం వెనుక బలమైన కారణాలే ఉండవచ్చునని అందరూ అనుమానిస్తున్నారు.

ఇదే విషయాన్ని నేను, ప్రధానమంత్రికి ఒక లేఖ ద్వారా వివరించాను. గౌరప్పన్ కు చనిపోయే ముందు ఆయన కు గత 15 రోజులుగా వచ్చిన ఫోన్ కాల్స్ జాబితాను పరిశీలించాలని కోరాను. ఫోన్ ద్వారా ఒత్తిడి చేయడం వల్లే ఆయన గుండెపోటుతో మృతి చెందడానికి కారణమై ఉండవచ్చు. ముసలాయన గుండె ఆగి చనిపోతే నాపై నీలాప నిందలు మోపుతున్నారని రేపు జగన్ మోహన్ రెడ్డి అన్న అనవచ్చు.

అందుకే జగన్మోహన్ రెడ్డే స్వయంగా గౌరప్పన్ మృతిపై విచారణ చేపట్టాలని ప్రధాన మంత్రిని కోరాలన్నారు. ఎందుకంటే, మా బంగారం మంచిది కాదని ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు. రిషికొండ అక్రమ భవంతి నిర్మాణం పై హైకోర్టులో ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తో పాటు నేను కూడా కేసు వేశాను. భవన నిర్మాణంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డ విషయాన్ని నేను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లాను. ఆలస్యంగా నైనా పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించారన్నారు.

ఏ ప్రాతిపదికను మహీ వీ రాఘవకు స్థలాన్ని కేటాయించారు?!
యాత్ర 2 దర్శకుడు మహి వీ రాఘవకు ఏ ప్రాతిపదికన హార్సిలీ హిల్స్ లో రెండు ఎకరాల స్థలాన్ని వైకాపా ప్రభుత్వం కేటాయించిందని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఆయనేదో బుల్లి స్టూడియో కట్టుకుంటానంటే, ప్రభుత్వం స్థలం కేటాయించటానికి మహి వి రాఘవకు ఉన్న అర్హతలు ఏమిటి అని నిలదీశారు.

ఎవరైనా స్టూడియో లను నిర్మించుకుంటామంటే, ప్రభుత్వం తరఫున స్థలం కేటాయిస్తామని ఏదైనా స్కీం పెట్టారా? అంటూ ప్రశ్నించడమే కాకుండా, ఆయన తీసిన సినిమాలు ఎన్ని అని నిలదీశారు. మహి వి రాఘవ ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించి ఉంటారు. 90 చిత్రాలకు దర్శకత్వం వహించిన కోదండరాంరెడ్డి, వందకు పైగా సినిమాలకు రూపొందించిన రాఘవేంద్రరావుని ప్రభుత్వం ఏమైనా అడిగిందా?. వారిని అడగకుండానే మహి వి రాఘవకు స్థలం ఇవ్వడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?. సొంతంగా సినిమా తీసి నష్టపోవడమేనా?,

ఇలా ఎంతోమంది సినిమాలు తీసి నష్టపోయిన వారు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తుందా? సొంతంగా పనికిమాలిన సినిమాలు తీయించుకొని ప్రభుత్వ స్థలాలను పప్పు బెల్లాల పంచేయటం భావ్యమేనా?, ఏ స్కీము లేకుండా, ముఖ్యమంత్రి కి నచ్చిన రెడ్డి కి స్థలం ఇస్తానంటే ఊరుకోరు. అయినా, మహీ వి రాఘవకు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి.

రాష్ట్రంలో ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి తన బినామీ కంపెనీలకు లక్షల ఎకరాల భూపందెరం చేశారు. నెడ్ క్యాప్ ను అడ్డం పెట్టుకొని సాగించిన భూపందెరంపై ప్రతిపక్షాలు, మీడియా దృష్టి సారించాలని కోరారు.

ఐదేళ్ల పాటు మన జీవితాలతో ఆడుకున్న వారితో ఇప్పుడు ఆడుకోవలసిన సమయం ఆసన్నమయింది
ఐదేళ్లపాటు మన జీవితాలతో ఆడుకున్న వారితో ఆడుకోవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలి. అంతకుమించి సమయం లేదు. కచ్చితంగా మరొక 65 రోజుల తర్వాత పోలింగ్ తేదీ ఉండవచ్చు. ఈ 65 రోజుల వ్యవధిలో మన జీవితాలతో ఆడుకున్న వారిని ఆడించేద్దాం… ఓడించేద్దామని ఆయన అన్నారు.

అందరి జీవితాలతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తమ ఆఖరి రోజును నిర్ణయించుకున్నారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా విశాఖపట్నం వైఎస్ఆర్ స్టేడియంలో ఈ క్రతువుకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు . ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకునే జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా స్టేడియానికి చేరుకోనున్నారు. అయితే, ఈ సందర్భంగా విశాఖలోని వ్యాపార సంస్థలను మూసి వేయించారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులను వైకాపా నాయకులు సరఫరా చేసి, పెట్టుకోవడం ఇష్టం లేనివారి షాపులను పెకిలించి వేసినట్టు చూశాం.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 25 లక్షల 40 వేల మంది ఆడారట. 80 లక్షల మంది వీక్షించారట?… ఇది నమ్మగలమా? కనీసం టీవీలో కూడా 10 శాతం మంది చూసి ఉండరు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతో వినోదాత్మకంగా ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద ఆటగాడి మాదిరిగా, మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పించే విన్యాసంతో మొదలైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముట్టుకుంటే విరిగిపోయే బ్యాట్లు, బురదమయంగా మారిన మైదానాలు, వైకాపా నాయకులే ఒకరిని, ఒకరు కొట్టుకున్న సంఘటనలు చూశాం.

చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర జట్లతో శిక్షణ ఇప్పించి మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని ఈ కళాకారులు పేర్కొనడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి కోసం 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చయినట్లుగా పేర్కొన్నారు. అందులో కచ్చితంగా 100 కోట్లు కమిషన్ల రూపంలో నొక్కేసి ఉంటారు. ఐదేళ్లపాటు మన జీవితాలతో ఆడుకొని రాచి రంపాన పెట్టిన వారితో మనం ఆడుకోవలసిన సమయం ఆసన్నమైందని రఘు రామ కృష్ణంరాజు పునరుద్గాటించారు .

Leave a Reply