Suryaa.co.in

National

భారత్ ఏమైనా ధర్మసత్రమా?

– ఇప్పటికే 140 కోట్ల జనాభాతో మేం ఇబ్బందులు పడుతున్నాం
– ఆర్టికల్ 19 హక్కులు భారత్ పౌరులకే
– శ్రీలంక పౌరుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ: ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదు. ఇప్పటికే 140 కోట్ల జనాభాతో మేం ఇబ్బందులు పడుతున్నాం. విదేశీ పౌరులందరినీ చేర్చుకోవడానికి ఇది ధర్మశాల కాదు అని సుప్రీంకోర్టు ఓ శ్రీలంక జాతీయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? భారతదేశం మీ కోసం ఎదురుచూడటం లేదు. మీరు కోరుకుంటే మరో దేశానికి వెళ్లవచ్చు” అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

తాను శరణార్థినని, శ్రీలంకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది పదేపదే విన్నవించినప్పటికీ, ధర్మాసనం అంగీకరించలేదు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత పిటిషనర్‌ను శ్రీలంకకు పంపించాలని అధికారులను ఆదేశించింది. తనకు ఆశ్రయం కల్పించాలంటూ సదరు వ్యక్తి పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ దేశంలో స్థిర నివాసం కల్పించాలనే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించింది. జస్టిస్ దిపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. శ్రీలంకలో ఒకప్పుడు క్రియాశీలంగా ఉన్న ఎల్‌టీటీఈ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2015లో శ్రీలంక జాతీయుడిని భారత్ లో అరెస్టు చేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద 2018లో ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి, పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు ఈ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. శిక్షాకాలం పూర్తయ్యాక దేశం విడిచి వెళ్లాలని, అప్పటివరకు శరణార్థుల శిబిరంలో ఉండాలని ఆదేశించింది.

తాను వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తనకు ప్రాణహాని ఉందని, తన భార్యాపిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. శిక్ష పూర్తయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా తనను ఇంకా నిర్బంధంలోనే ఉంచారని, దేశం నుంచి పంపించే ప్రక్రియ కూడా ప్రారంభించలేదని వాపోయాడు. రాజ్యాంగంలోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ, ప్రాథమిక హక్కులు – వాక్ స్వాతంత్ర్యం, సంచార స్వేచ్ఛ వంటివి కింద తమకు హక్కులున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

పిటిషనర్ వాదనలపై జస్టిస్ దత్తా స్పందించారు. భారత్ ధర్మసత్రం కాదు అని వ్యాఖ్యానించారు. పిటిషనర్‌ను చట్ట ప్రకారమే నిర్బంధంలోకి తీసుకున్నారని, కాబట్టి ఆర్టికల్ 21 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 19 హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE