‘కమలం‘ కొంప ముంచిన అర్వింద్

– అర్వింద్ వ్యాఖ్యలతో నవ్వులపాలైన పువ్వుపార్టీ
-అర్వింద్ చెప్పారు… మరి అంతేగా.. మరి అంతేగా?!
– బీజేపీ-బీఆర్‌ఎస్ బంధం బయటపెట్టిన ఎంపి అర్వింద్
– రేవంత్ కంటే కేసీఆరే బెటరన్న బీజేపీ అభ్యర్ధి అర్వింద్
– కాంగ్రెస్ వస్తే ఆంధ్రోళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెట్టినట్లేనని వ్యాఖ్య
– బీఆర్‌ఎస్ నేతల విమర్శలన్నీ బీజేపీ నేత నోటితో
– తల పట్టుకున్న గ్రేటర్ బీజేపీ నేతలు
– ఆంధ్రా వాళ్ల ఓట్లు పోతాయన్న ఆందోళన
– పోలింగుకు ముందు ఏమిటీ బాధ్యతారాహిత్య ప్రకటనలు
-జాతీయ పార్టీకి ప్రాంతీయ వాసనలుంటాయా?
– గగ్గోలు పెడుతున్న గ్రేటర్ బీజేపీ అభ్యర్ధులు
– పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందిస్తుందా?
-కిషన్‌రెడ్డి నిర్ణయంపై కమలనాధుల చూపు
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీఆర్‌ఎస్ పాత్ర బీజేపీ పోషిస్తే ఎలా ఉంటుంది? తన పాత్ర కూడా బీజేపీ పోషిస్తుంటే బీఆర్‌ఎస్ ఎంత ఆనందపడుతుంది? బీఆర్‌ఎస్ నేతల తిట్లు బీజేపీ బదిలీ చేసుకుని ప్రత్యర్ధిని తిడితే ఎలా ఉంటుంది? అనుకోకుండా తన ప్రత్యర్థి, తనను అందలం ఎక్కిస్తే ఎంత హాయిగా ఉంటుంది? బీఆర్‌ఎస్ తిట్టాల్సిన తిట్లన్నీ బీజేపీ తిడితే ఎంత ఆనందంగా ఉంటుంది?.. అచ్చం బీజేపీ ఎంపి అర్వింద్ మాదిరిగా ఉంటుంది!

తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్‌కు, టీడీపీ శ్రేణులు బహిరంగంగా మద్దతునిస్తున్నా… విమర్శించలేని స్థితి బీఆర్‌ఎస్‌ది. అయితే కృష్ణుడి మాదిరిగా బీజేపీ దన్నుగా నిలిచి, అర్జనుడితో దగ్గరుండి అస్త్రాలు సంధించినట్లు.. పోలింగ్ ముందు.. బీజేపీ సిట్టింగ్ ఎంపి-అసెంబ్లీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్, బీఆర్‌ఎస్‌ను కాపాడిన వైనం బీజేపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాకపోతే అర్వింద్ ఇక్కడ విభీషణుడి పాత్ర పోషించారన్నది కమలదళాల కన్నెర్రకు కారణం.

సరిగ్గా పోలింగుకు ముందు నిజామాబాద్ బీజేపీ ఎంపి అర్వింద్ చేసిన వ్యాఖ్య, బీజేపీ-బీఆర్‌ఎస్ బంధాన్ని బట్టబయలు చేసింది. బీజేపీ మనసులో కోరికను అర్వింద్ బయటపెట్టారు. ‘‘బీజేపీ-బీఆర్‌ఎస్ మ్యాచ్‌ ఫిక్సింగును మేం ఎప్పుడో బయటపెట్టాం. ఇప్పుడు అర్వింద్ తన పార్టీ మనసులో మాటను బయటపెట్టారు. సంతోషం. ప్రజలకు నిజాలు చెప్పినందుకు అర్వింద్‌కు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలు మేం చెప్పింది నిజమని అర్వింద్ మాటలతో నమ్మారు. అంటే మేం అబద్ధం చెప్పలేదని అర్విందే నిరూపించారు. కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ-బీఆర్‌ఎస్ ఆడుతున్న రాజకీయ మాయాజూదాన్ని బీజేపీ ఎంపి అర్వింద్ బట్టబయలు చేశారు. ఇంకా దీనిపై పెద్దగా మాట్లాడటం అనవసరం. అర్వింద్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించాల’’ని పీసీసీ ప్రధాన కార్యదర్శి కె.రఘవీర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఫలితంగా ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షా-పార్టీ అధ్యక్షుడు నద్దా, ఇతర కేంద్రమంత్రులు కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ, బీఆర్‌ఎస్‌పై చేస్తున్న విమర్శలన్నీ నిరుపయోగంగా మారాయి. సొంత పార్టీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు.. తమ విజయావకాశాలకు గండి కొట్టే ప్రమాదం తెచ్చిందని, గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్ధులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.

ఒకవైపు మోదీ నుంచి నద్దా వరకూ రాష్ట్రానికి వచ్చి, కేసీఆర్ సర్కారు అవినీతిని తూర్పారపడుతున్నారు. కిషన్‌రెడ్డి నుంచి లక్ష్మణ్ వరకూ కేసీఆర్ సర్కారు మోసాలను, ఎక్కడ వీలుంటే అక్కడ ఏకరవు పెడుతున్నారు. ప్రధాని మోదీ ఒక మెట్టు పైకెళ్లి.. కేసీఆర్‌ను అరెస్టు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు నద్దా.. కేసీఆర్ ప్యామిలీకి ఏటీఎంలా మారిన కాళేశ్వరం అవినీతి పైసలు, అణాపైసలతో సహా కక్కిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ నాయకత్వం కేసీఆర్ సర్కారు అవినీతికి సంబంధించిన అంశాలతో, పత్రికలకు ప్రకటనలు విడుదల చేస్తోంది. ఇవన్నీ ఎందుకంటే.. బీఆర్‌ఎస్‌తో తమకు ఎలాంటి బాదరాయణ సంబంధం లేదని చెప్పడం కోసమన్నమాట!

తమకూ బీఆర్‌ఎస్‌కు రహస్య అవగాహన ఉందని, అందుకే కేవలం తమ పార్టీ నేతల ఇళ్లపైనే ఐటి దాడులు చేస్తున్నారంటూ, పీసీసీ దళపతి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు క్షేత్రస్థాయికి చేరాయి. దళితబంధుకు ఈసీ అనుమతి కూడా, బీజేపీ-బీఆర్‌ఎస్ అపవిత్ర బంధానికి నిదర్శనమని చేసిన ఆరోపణ చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి భావనకు తెరదింపేందుకే.. మోదీ నుంచి నద్దా వరకూ ప్రముఖులంతా రంగంలోకి దిగి, ఆ ఆరోపణలకు తెరదించేందుకు నానా తంటాలు పడుతున్నారు.

అయితే సరిగ్గా పోలింగ్ మరో మూడురోజులకు ముందు.. బీజేపీ ఎంపి-అసెంబ్లీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు, కమలం కొంపను పూర్తిగా ముంచాయి. దానితోపాటు.. మోదీ-అమిత్‌షా-నద్దా వంటి ప్రముఖుల కష్టాన్ని బూడిలోపోసిన పన్నీరుగా మార్చాయి. రేవంత్‌రెడ్డి కంటే కేసీఆర్ చాలా బెటరన్న అర్వింద్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఆరోపణలను బలపరుస్తున్నట్లు స్పష్టం చేశాయి.

బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పకుండా, రేవంత్ బదులు కేసీఆర్ ఉన్నా బెటరని మాట్లాడిన అర్వింద్, క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌తో పోరాడుతున్న శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీశారంటున్నారు. దీనితో ఏం చేయాలో..అర్వింద్ వ్యాఖ్యలను ఎలా తిప్పికొట్టాలో తెలియని అయోమయ స్థితిలో, కమలనాధులు కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధులు, అర్వింద్ వ్యాఖ్యలపై కారాలుమిరియాలు నూరుతున్నారు. విద్యావంతులు, సెటిలర్లు, యువత ఎక్కువ సంఖ్యలో ఉండే గ్రేటర్ ప్రజలపై.. అర్వింద్ వ్యాఖ్యల ప్రభావం తమ విజయావకాశాలకు గండికొడతాయన్న ఆందోళన, బీజేపీ అభ్యర్ధులలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ-బీఆర్‌ఎస్ కలసి పనిచేస్తున్నాయన్న అనుమానాలను, అర్వింద్ తన వ్యాఖ్యలతో నిజం చేశారంటున్నారు.

నిజానికి దాదాపు 15-19 స్థానాల్లో బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఆదిలాబాద్‌లో 4, వరంగల్‌లో 1, నిజామాబాద్‌లో 1, కరీంనగర్‌లో 2, నల్లగొండలో 1, మహబూబ్‌నగర్‌లో 1, మెదక్‌లో 1, గ్రేటర్ హైదరాబాద్‌లో 8 నియోజకవర్గాల్లో బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. అక్కడ 3 నియోజకవర్గాల్లో బీజేపీ అందరికంటే అగ్రస్థానంలో ఉండగా, మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధితో సమానంగా తలపడుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో అయితే 5-6 నియోజకవర్గాల్లో పోటా పోటీగా ఉండగా, మరో 3 నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉంది. శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఎల్బీనగర్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, ఉప్పల్ వంటి నియోజకర్గాల్లో సెటిలర్ల ఓట్ల కోసం తాపత్రయపడుతున్న సమయంలో.. అర్వింద్ చేసిన వ్యాఖ్యలు తమ ఆశలపై నీళ్లు చల్లాయని బీజేపీ అగ్రనేతలు తలపట్టుకుంటున్నారు.

ఈవిధంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిద్రాహారాలు మాని, అభ్యర్ధుల విజయం కోసం కష్టపడుతున్న సమయంలో.. బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న భావనతో, అర్వింద్ చేసిన తాజా వ్యాఖ్యలు, కమలం కొంపముంచేలా ఉన్నాయన్నది అభ్యర్ధుల ఆవేదన. అర్వింద్ స్వయంగా తమను వేటాడమని కాంగ్రెస్‌కు ఆయుధం అందించినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరి అర్వింద్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయమా? పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందిస్తుందా? లేదా? పోలింగుకు ముందు అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ కోరతారా? అన్నది కమల దళపతి కిషన్‌రెడ్డి తేల్చాలి. ఇప్పుడు పార్టీ విశ్వసనీయతను కాపాడే బాధ్యత కిషన్‌రెడ్డిదేనని కమలనాధులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply