Suryaa.co.in

Editorial

మోదీ వెంట తిరుమలకు … జగన్‌కు నో!

– జగనన్నను విడిచి మోదీ వెడలె తిరుమల కొండకు
– ప్రధాని తిరుమల పర్యటనలో విచిత్రం
– తన వెంట జగన్‌ను కొండపైకి రావద్దని సందేశం
– ముందుగానే పీఎంఓ నుంచి సీఎంఓకు సమాచారం
– దానితో మోదీ స్వాగతానికే పరిమితమైన సీఎం జగన్
– ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కివెళ్లిన జగన్
– తెలంగాణ ఎన్నికల ప్రభావమేనా?
– తనతో జగన్ వస్తే సెటిలర్ల ఓట్లు మరింత దూరమవుతాయన్న ముందుచూపే కారణమా?
– ప్రధానులతో సీఎంలు కొండపైకి వెళ్లే సంప్రదాయానికి బ్రేక్ వేసిన మోదీ
– చర్చనీయాంశంగా మారిన మోదీ నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రధానులు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఆయనకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికి, కొండపైకి తీసుకువెళ్లి కలసి ముఖ్యమంత్రులు దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఇది కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నదే. కేంద్ర-రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలున్నా తిరుమల కొండపై మాత్రం ప్రధాని-ముఖ్యమంత్రి కలిసే దర్శనం చేసుకోవడం ఓ సంప్రదాయం. అయితే తాజాగా ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. బ్రేక్ పడిందనే కంటే.. స్వయంగా ప్రధానే దానికి బ్రేకులు వేశారనడం సబబు. ప్రధాని మోదీ తాజా తిరుమల పర్యటనలో.. ఏపీ సీఎం జగన్‌ను పక్కనపెట్టి, తానొక్కరే కొండపైన వెంకన్న దర్శనానికి వెళ్లడం చర్చనీయాంశమయింది.

ఇంతకూ ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచార సమయం మధ్యలో, తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. ఆయనను స్వాగతించేందుకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరితోపాటు బీజేపీ అగ్రనేతలంతా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారు. ఒకవైపు సీఎం జగన్-గవర్నర్, మరోవైపు రాష్ట్ర బీజేపీ ప్రముఖులు ఆయనను బోకే, శాలువాలతో సన్మానించారు. సీఎం జగన్ యధావిధిగా వెంకటేశ్వరస్వామి విగ్రహం బహుకరించారు. అయితే.. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఉప ముఖ్యమంత్రి, పదిమంది మంత్రులు, మంత్రి రోజా మినహా ఉమ్మడి చిత్తూరు ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. అయితే వారిని ప్రధాని వద్దకు వెళ్లేందుకు భద్రతాసిబ్బంది అంగీకరించకపోవడంతో, వారంతా ఎయిర్‌పోర్టు విఐపీ లాంజ్‌కే పరిమితమయ్యారు. ఇక సీఎం జగన్ ప్రధాని రాకకు అరగంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ఆ తర్వాత గవర్నర్ వచ్చారు.

ఇందులో పెద్ద విశేషమేమీలేదు. అయితే ప్రధానితోపాటు తిరుమల కొండపైకి వెళ్లాల్సిన సీఎం జగన్ మాత్రం ఆయనతో వెళ్లకపోవడం చర్చనీయాంశమయింది. బోకే ఇచ్చి, శాలువా కప్పిన జగన్ అక్కడే ఉండిపోగా, ప్రధాని మోదీ మాత్రం ఒక్కరే తిరుమల కొండపైకి వెళ్లడం విశేషం.

సహజంగా ప్రధాని తిరుమలకు ఎప్పుడు వచ్చినా.. సీఎం జగన్ ఆయనతోపాటు, కొండపైకి వెళ్లడం చాలాకాలం నుంచి చూస్తున్నదే. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ప్రధాని ఒక్కరే తిరుమల కొండపైకి వెళ్లడం, సీఎం జగన్ మాత్రం గైర్హాజరు కావడంతో ఆ అంశం సహజంగానే చర్చనీయాంశమయింది.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ వెంట సీఎం జగన్ కొండపైకి కలసి వెళ్లవద్దన్న సమాచారం, పీఎంఓ నుంచి అందినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూలు కూడా ఆమేరకే రూపొందించినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించి పీఎంఓ నుంచి సీఎంఓకు స్పష్టమైన సందేశం వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే జగన్-కేసీఆర్ కలసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అరెస్టు చేయించారన్న ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతోంది. దానికి కేంద్రంలోని బీజేపీ సహకారం-అనుమతి ఉందన్న ఆగ్రహం, హైదరాబాద్-తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లలో బలంగా నాటుకుపోయింది. బహుశా ఈ కారణంతోనే వారంతా కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతునిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన ర్యాలీకి టీడీపీ కార్యకర్తలు జెండాలతో హాజరుకావడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఖైరతాబాద్‌లో పీజేపీ కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్ధి విజయారెడ్డి ప్రచారంలో.. గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలంతా పాల్గొంటున్న దృశ్యాలు మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తిరుమల పర్యటనలో సీఎం జగన్ తన వెంట వస్తే, సెటిలర్ల ఓట్లు పూర్తి స్థాయిలో దూరమవుతాయన్న ముందుచూపుతో ప్రధాని మోదీ.. సీఎం జగన్‌ను తన వెంట రావద్దని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సోమవారం ఉదయం మోదీ వెంకన్న దర్శనం చేసుకుంటారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేందర్‌సింగ్ షెకావత్ ముందుగానే తిరుమల కొండపైకి చేరుకుని, ప్రధాని దర్శన ఏర్పాట్లు సమీక్షించారు.

LEAVE A RESPONSE