Suryaa.co.in

Editorial

కేసీఆర్ ఫ్లూయిడ్స్ వాడారా?

– మళ్లీ తెరపైకి కేసీఆర్ ఖమ్మం దీక్ష అంశం
– తామే ఫ్లూయిడ్స్ ఇచ్చామంటూ తెరపైకొచ్చిన డాక్టర్
– నాటి కలెక్టర్‌తో మాట్లాడి కేసీఆరే తమను నియమించుకున్నారని వెల్లడి
– సీపీఐ నారాయణతో కలసి ప్రెస్‌మీట్ పెట్టిన డాక్టర్ గోపీనాధ్
– కేసీఆర్‌కు ఇచ్చిన వైద్యం వివరాలను బయటపెట్టిన డాక్టర్ గోపీనాధ్
– ఫ్లూయిడ్ బ్రాండ్లు బయటపెడతామని వెల్లడి
– కేసీఆర్‌ది దొంగదీక్షేనని పత్రాలు బయటపెట్టిన ఖమ్మం డాక్టర్ గోపీనాధ్
– సోషల్‌మీడియాలో సందడి చేస్తున్న డాక్టర్ ప్రెస్‌మీట్
– ఇవన్నీ అప్పుడే ఎందుకు బయటపెట్టలేదన్న సందేహాలు
– మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చిన సీపీఐ
– ఇప్పుడు సీపీఐ ఆఫీసులోనే ప్రెస్‌మీట్ పెట్టిన డాక్టర్ గోపీనాధ్
– ఇన్నేళ్ల మౌనం వెనుక మర్మమేమిటి?
– ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌పై ‘దీక్ష బాంబు’
– దీక్షా దివస్ వేళ ‘కారు’లో కలవరం
( మార్తి సుబ్రహ్మణ్యం)

చావునోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాననేది బీఆర్‌ఎస్ అధినేత-సీఎం కేసీఆర్ ప్రతి ఎన్నికల ముందు చెప్పే మాట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉత్తిగా ఇవ్వలేదని, కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి సాధించారని ఇటీవలి కాలంలో ఆయన తనయుడైన ఆ పార్టీ ఉత్తరాధికారి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య. కేసీఆర్ కూతురు కవిత ప్రకటన కూడా డిటో.

అయితే..కేసీఆర్‌ది దొంగదీక్షేనంటూ.. ఆనాడు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ కొత్తగా తెరపైకొచ్చి చేసిన ప్రకటన. నోటిమాట కాకుండా..అప్పుడు ఖమ్మంలో దీక్ష చేసిన కేసీఆర్‌కు అందించిన తన వైద్య సేవ వివరాల చిట్టాను కూడా విప్పారు. సరిగ్గా పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు.. సీపీఐ ఆఫీసు వేదికగా సదరు డాక్టర్ పేల్చిన ‘దీక్ష బాంబు’.. బీఆర్‌ఎస్ శిబిరంలో ఆటంబాంబులా పేలుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దీక్షా దివస్‌కు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌కు, తాజా పరిణామాలు భారీ కుదుపు. ఒక్కముక్కలో చెప్పాలంటే పోలింగ్‌కు ముందు అధికార పార్టీ ఆగంపట్టించే అస్త్రం.

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు సీపీఐ ఆఫీసులో… ఓ గుండె వైద్య నిపుణుడు బీఆర్‌ఎస్‌కు గుచ్చిన ‘పొలిటికల్ సూదిమందు’, రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి కారణమయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి యుపీఏ సర్కారుకు భూకంపం పుట్టించిన కేసీఆర్ ఆమరణదీక్ష అంశం, తాజా ఎన్నికల్లో అనుకోకుండా తె రపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

నాడు ఖమ్మం వేదికగా కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష అప్పట్లో పెను సంచలనం. ఆయన దీక్ష విరవించారన్న వార్త వెలువడిన వెంటనే విద్యార్థిలోకం భగ్గుమంది. కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. దానితో తాను దీక్ష కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించాల్సి వచ్చింది. కేసీఆర్ దీక్ష అటు కేంద్రంలోని యుపీఏ సర్కారునూ కదిలించింది. నాటి సీఎం రోశయ్య, కేంద్రం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత చిదంబరం ప్రకటన, సంబరాలు అన్నీ తెలిసినవే.

అయితే కేసీఆర్ దీక్ష బూటకమని.. ఎలాంటి ఆహారం లేకుండా దీక్ష ఎలా చేయవచ్చో, అప్పటి విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ మీడియా సమక్షంలో సశాస్త్రీయంగా వెల్లడించారు. కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుని దీక్ష చేస్తున్నారని సమైక్యవాదులు విమర్శించారు. ఆ తర్వాత సొంత రాష్ట్రం సిద్ధించింది. అందుకు కృతజ్ఞతగా కేసీఆర్.. సకుటుంబ సపరివారసమేతంగా సోనియా ఇంటికి వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో సైతం రెండుసార్లు సీఎం హోదాలోనే కేసీఆర్.. తెలంగాణ రావడానికి సోనియానే కారణమని, తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా ముందు పేజీ ఆమెదే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. దానిని కాదన్న వారు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అందరికీ తెలిసిన-ముగిసిన ముచ్చట్లే. తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరుండి పరిశీలించిన మేధావులు-జర్నలిస్టులు-ఉద్యమవాదులకూ ఎరుకే.

ఇప్పుడు ఉన్నట్లుండి హటాత్తుగా పదేళ్ల తర్వాత, మళ్లీ కేసీఆర్ ఖమ్మం ఆమరణ నిరాహారదీక్ష అంశం తెరపైకి రావటం చర్చనీయాంశమయింది. అయితే అది కేసీఆర్ దీక్ష విశ్వసనీయత-చిత్తశుద్ధి-నిజాయితీని శంకిస్తూ వెల్లడయిన అంశం కావడంతో, అందరి దృష్టి ఖమ్మం వైపు మళ్లేందుకు కారణమయింది. తాజాగా ఖమ్మం సీపీఐ జిల్లా ఆఫీసులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.

ఆయనతోపాటు ఖమ్మంలో పేరున్న గుండె జబ్బుల నిపుణుడైన డాక్టర్ గోపీనాధ్ కూడా హాజరయ్యారు. ఇంతకూ డాక్టర్ గోపీనాధ్ ఎవరంటే.. నాడు ఖమ్మంలో ఆమరణ దీక్ష నిర్వహించిన కేసీఆర్ ఆరోగ్య వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షించిన డాక్టర్. ఆయన తెరపైకి వచ్చి చెప్పిన, నాటి ఖమ్మం కేసీఆర్ దీక్ష ముచ్చట్లు ఇప్పుడు మీడియా-సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.

ఇంతకూ డాక్టర్ గోపీనాధ్ గుప్పెట విప్పిన అంశాలు ఆషామాషీవి కాదు. చిన్నసన్న సంగతి అసలే కాదు. కేసీఆర్ దీక్ష సమయంలో ఫ్లూయిడ్స్ వాడారన్న రహస్యాన్ని డాక్టర్ గోపీనాధ్ బట్టబయలు చేశారు. ఆమేరకు అప్పుడు కేసీఆర్‌కు అందించిన వైద్యచికిత్సకు సంబంధించిన పత్రాలను మీడియాకు చూపించారు. నాటి కలెక్టర్ ఉషారాణితో మాట్లాడి, కేసీఆర్ స్వయంగా తమను వ్యక్తిగత వైద్యులుగా నియమించుకున్నారని చెప్పారు.

‘‘కేసీఆర్ ఖమ్మంలో ఉన్న 9 రోజులు రాత్రి వేళ మేమే ఆయనకు ఫ్లూయిడ్స్ ఇచ్చాం. అందులో అన్ని రకాల ఫ్లూయిడ్స్ ఉన్నాయి’ అని డాక్టర్ గోపీనాధ్, ఖమ్మం కేసీఆర్ దీక్ష వెనుక ఉన్న రహస్యం గుప్పెట విప్పారు.

‘చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానన్న’ కేసీఆర్ అబద్ధపు మాటలు తట్టుకోలేకనే.. ఆయన దొంగదీక్ష వెనుక ఉన్న రహస్యం బట్టబయలుచేశానన్నది, డాక్టర్ గారి తాజా ప్రెస్‌మీట్‌కు అసలు కారణమట. అంటే దాదాపు పద పదకొండేళ్ల నుంచి డాక్టర్ గారు గరళ కంఠుడిలా దీక్ష నిజాన్ని గొంతులో పెట్టుకుని బతుకుతున్నారన్న మాట.

ఇంతా చెప్పిన డాక్టర్ గోపీనాధ్.. దీక్ష సమయంలో కేసీఆర్ ఏమేమి ఫ్లూయిడ్స్ ఇచ్చామన్నది, అవసరమైనప్పుడు వెల్లడిస్తామనం ఎందుకో అర్ధం కాదు. కేసీఆర్ ఏయే బ్రాండ్ల ఫూయిడ్స్ వాడారన్న వివరాలను అవసరమైనప్పుడు వెల్లడిస్తామని డాక్టర్ గోపీనాధ్ చెప్పడం చూస్తే, ఆ ‘అవసరమైనపప్పుడు’ అనే పదం.. ‘ఎవరికి అవసరమైనప్పుడు’ అన్న ప్రశ్నతో కూడిన సందేహం సహజంగానే తెరపైకొస్తోంది. పైగా కేసీఆర్‌కు ఇచ్చిన మందుల జాబితా లిస్టయితే మీడియాకయితే ప్రదర్శించారు గానీ, దానిని మీడియాకు ఇవ్వకపోవడమే విచిత్రం.

సరే.. డాక్టర్ గోపీనాధ్ సీపీఐ సానుభూతిపరుడా కాదా అన్నది వేరే ముచ్చట. ఆయన నేరుగా సీపీఐ ఆఫీసులో జరిగిన ప్రెస్‌క్లబ్‌కే వచ్చారు కాబట్టి, ఆ పార్టీతో డాక్టరు గారికి బాదరాయణ సంబంధం ఉండవచ్చు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లయింది. ఈలోగా రెండు అసెంబ్లీ, మరిన్ని ఉప ఎన్నికలు కూడా జరిగాయి. అన్ని ఎన్నికల్లోనూ కేసీఆర్ ‘తాను చావునోటో తల పెట్టి తెలంగాణ సాధించా’ననే చెప్పుకున్నారు.

ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో, సీపీఐ-సీపీఎం దయతలిస్తేనే టీఆర్‌ఎస్ గెలిచింది. అంటే కామ్రేడ్లే కమలాన్ని ‘కమిలించాల’న్న కసితో, ‘కారు’ ఎక్కి కాయకష్టం చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాయన్నమాట. మరి ఆ సమయంలో ఈ ‘కేసీఆర్ దీక్ష ఫ్లూయిడ్ల’ కథ చెప్పలేదేందబ్బా?!ఓహో.. ‘అవసరమైన ప్పుడు’ అనే దానికి, ఇంత ‘పదబంధం’ ఉందన్న మాట! అసలు ఇన్నేళ్ల మౌనం వెనుక మర్మమేమిటన్నది డాక్టరుగారే సెలవివ్వాలి.

కేసీఆర్ చేసిన దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందంటున్న బీఆర్‌ఎస్ నాయకత్వం.. ఆమేరకు ఈనెల 29న దీక్షాదివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ దీక్షా దివస్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన కొన్ని గంటల తర్వాతనే, కేసీఆర్ దీక్షలో వైద్యం చేసిన డాక్టర్ గోపీనాధ్.. దానిని దొంగదీక్షగా ఆరోపించి, అందుకు సంబంధించిన మందుల పత్రాలను మీడియాకు చూపించడం పెనుసంచలనం సృష్టిస్తోంది. డాక్టర్ గారు సంధించిన పాతదైన కొత్త ఆరోపణ, బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌పై ఎంతవరకూ ఉంటుందో చూడాలి.

LEAVE A RESPONSE