అథవాలే చెప్పారుగా.. ఆవిధంగా ముందుకెళ్లండి మరి!

-తెలంగాణలో కూడా తెరాసను చేర్చుకుంటే సరి
– ఎన్డీఏలో వైసీపీ చేరితే ఇక ఏపీకి సొమ్ములే సొమ్ములట
– ‘కమలవనం’లో చేరితే క్రైస్తవులు-ముస్లిముల సంగతేమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేంద్రమంత్రి అథవాలే వైసీపీ నాయకత్వానికి బంపర్ ఆఫరిచ్చారు. ఎలాగూ బయట నుంచి కేంద్రాన్ని ఆదుకుంటున్నారు కాబట్టి, అదేదో ఎన్డీఏలో చేరితే సుఖంగా ఉంటుందని సెలవిచ్చారు. పైగా ఎన్డీఏలో చేరితే ఏపీ అభివృద్ధిని చూసి, పంచకల్యాణి కూడా కుళ్లుకునేలా ఆంధ్రాను అభివృద్ధిని చేయవచ్చని సలహా ఇచ్చారు. అంటే గతంలో.. అమరావతిలో ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామని మోదీ చెప్పినట్లన్నమాట! కేంద్రమంత్రి స్థాయిలో ఇవన్నీ సెలవిచ్చారు కాబట్టి, అవన్నీ కమలం పువ్వు పార్టీ నాయకత్వం ఆలోచనగానే అనుకోవాలి మరి. ఎందుకంటే జాతీయ పార్టీ.. అందునా క్రమశిక్షణకు మారుపేరైన పువ్వు పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండదు!
ఒకరకంగా ఏపీలో కొందరు కమలనాధులు కూడా.. ఇలాంటి సందేశం కోసమే, కళ్లు కాయలు కాసేలా చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే… వైసీపీ సర్కారుపై పోరాటం చేయాలా? వద్దా అన్నదానిపై ఢిల్లీ బాసులు స్పష్టత ఇవ్వరు. జగనన్న పార్టీ మనకు మిత్రపక్షమా? శత్రుపక్షమా? అని చెప్పరు. అదేమంటే ‘‘మేం పార్లమెంటులో వైసీపీతో ఫ్లోర్ కో ఆర్డినేషన్ చేసుకుంటాం. మీరక్కడ ‘ఫ్యాను’కు ఊపిరాడకుండా చేయమని, కేఏ పాల్- కేకే మాదిరిగా అర్ధమయీ కానట్లు చెబుతుంటారు. అందువల్ల ఎందుకీ జంజాటం? అదేదో వైసీపీని కమలవనంలో చేర్చుకుని, ఆ పవిత్ర తీర్ధమేదో ఇచ్చేస్తే తమకు ఈ పంచాయతీ తప్పుతుంది కదా అన్నది బతకనేర్చిన కమలదళాల అంతర్మథనం.
నిజమే మరి. ఏపీ కమలదళంలో రెండు దుకాణాలు. ఒకటి వైసీపీ అనుకూల- మరొకటి వైసీపీ ప్రతికూల శిబిరాలు. వైసీపీ అనుకూల శిబిరంలో ఉన్న వారికి సర్కారు చందనాది తాంబూలాలిచ్చి ఆనందింపచేస్తోందన్నది ఒక టాక్. అంటే మైనింగ్ డంప్, ఇసుక రీచ్, పవర్‌ప్రాజెక్టులూ, హోటళ్లూ , గన్‌మెన్లూ గట్రా అన్నమాట. ఈ దుకాణం సభ్యులు సర్కారుపై అవసరమైనప్పుడు బలవంతంగా ‘బంతిపూల యుద్ధం’ చేస్తుంటుందని మెదడున్న అందరికీ తెలుసు. మీడియా గర్జనలు-గాండ్రింపులూ చేస్తుంటుంది. అంటే ఒక పదిమందితో ధర్నా- ఫొటో- వీడియో-ప్రెస్‌నోట్- వాట్సాప్‌లో సర్క్యులేషన్ అన్నమాట. ఈ బ్యాచ్‌కు టీడీపీ అంటే సుతరామూ పడదు. వారంతా తమ ‘పార్కింగ్ జోన్’లోకి వచ్చినందుకు చిటపటలాడుతుంటారు.
ఇహ రెండో బ్యాచ్‌కు వైసీపీ అంటే పడదు. వీళ్లలో ఫక్తు పొలిటీషియన్లు ఎక్కువ. పోరాడితేనే ప్రజలకు దగ్గరవచ్చన్న, ‘సతె్తకాలపు చాదస్తులు’ ఈ దుకాణంలో కొద్దిగా ఎక్కువే ఉన్నారు. జగనన్న సర్కారుపై ఇప్పుడు పడిలేస్తున్న కెరటాలు ఈ బ్యాచ్ వాళ్లే. కానీ పాపం వీళ్లను వైసీపీ అనుకూల శిబిరం మాట్లాడనీయకుండా, నోళ్లు సూది-దబ్బనాలతో కుట్టేసింది. మా అనుమతి లేనిదే గొంతు విప్పడానికి లేదని హుకుం జారీ చేసింది. అక్కడికీ.. లంకా దినకర్ లాంటి లౌక్యం తెలియని అమాయకులు.. ‘‘వైసీపీ ఎన్డీఏలో చేరాలన్న అథవాలే వ్యక్తిగత అభిప్రాయం. అథవాలేకు వైసీపీతో వ్యక్తిగత యవ్వారం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. ముందు ఆ సంగతి చూడు. ఏపీ యవ్వారాలతో సంబంధం లేని విషయాలు అతిగా ఆలోచించవద్దు. అమరావతి అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది’’ అని అథవాలేను సర్ఫుతో కడిగేసి, వచ్చిన పని చూసుకోమని చెప్పకనే చెప్పారనుకోండి. అది వేరే విషయం.
ఇక అగ్రస్థానాల్లో ఉన్న ‘ఆ ముగ్గురు మద్దుల నేతల’కు జనంలో పలుకుబడి ఎంతన్నది పక్కనపెడితే, ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ఠికాణా లేకపోయినా.. ఇప్పుడు వారి మాటే చెల్లుబాటవుతుంది. కాకపోతే స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ ఉప ఎన్నిక వరకూ, ‘విజయం తమదే’నని అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారంతే!
వైసీపీ అనుకూల శిబిరం గంట సేపు ప్రెస్‌మీట్‌లో మాట్లాడితే అందులో 50 నిమిషాలు టీడీపీని, మిగిలిన పది నిమిషాలు వైసీపీని మొహమాటానికి తిట్టిపోస్తుంటారు. అదే వైసీపీ వ్యతిరేక శిబిరం నేతలు 50 నిమిషాలు వైసీపీ సర్కారును తిడితే, మిగిలిన 10 నిమిషాలు టీడీపీని తిడతారు. ఎందుకంటే రెండున్నరేళ్ల క్రితమే వైధవ్యం పొందిన టీడీపీని విమర్శిస్తే ఒరిగేదీలేదన్న రాజకీయ సూత్రం వాళ్లది. ఇదీ ఏపీలో రెండుగా చీలిన పువ్వుపార్టీ యవ్వారం.
అందుకే ఇన్ని ఈతిబాధలు, పితలాటకాలు, ముసుగులో గుద్దులాటలకు బదులు.. అదేదో వైసీపీని ‘కమలవనం’లో చేర్చుకుంటే, తమ ప్రాణాలకు హాయిగా ఉంటుంది కదా అన్నది కొందరు కమలనాధుల కవిహృదయం. ఆ పనిచేస్తే జగనన్న సర్కారును ఇప్పటిమాదిరిగా, ఉత్తుత్తిగా కూడా విమర్శించాల్సిన పని ఉండదు. ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది? కేంద్రం ఇచ్చిన డబ్బులేమవుతున్నాయి? రాష్ట్రంలో మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఆలయాలపై దాడులెందుకు జరుగుతున్నాయి? కోడిగుడ్డు సైజు ఎందుకు తగ్గిస్తున్నారు? గుడ్డు సైజు తగ్గించి ఇస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అడగాల్సిన అవసరం ఉండదు. పైగా.. వైసీపీతో కలసిపోతే, ఎంచక్కా ఆ చీమకుర్తిలోనే ఇంకో నాలుగు మైనింగ్ డంపులు, ఇంకొన్ని ఇసుకరీచులు, ఇంకొంతమంది గన్‌మెన్లు, విజయవాడకు ఎంపీలొచ్చినప్పుడు పోలీసు కాన్వాయ్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది కదా అన్నది పువ్వు పార్టీ నేతల వాదన. మరి నిజమే. సీత బాధ సీతది పీత బాధ పీతదీ!
‘ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడొస్తాడన్నట్లు’.. అటు వైసీపేయుల ఫీలింగూ సేమ్ టు సేమ్. కాకపోతే వాళ్లు బయటపడటం లేదు. పువ్వుపార్టీ వాళ్లు బయటపడుతున్నారు. అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్! ఎంచక్కా పువ్వు పార్టీతో కలిస్తే, అథవాలే అన్నయ్య చెప్పినట్లు రాష్ట్రానికి నిధులే నిధులు. పోలవరంలా పారే ఆ నిధులతో ఎంచక్కా ఆంధ్రాను అభివృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు ఈ పిచ్చి బ్రాండ్లు అమ్మాల్సిన పనిలేదు. ఇప్పటిమాదిరిగా ప్రతిరోజూ బుగ్గన రాజేందరన్న ఢిల్లీకి మకాం మార్చి, నిర్మలక్క చాంబరు వద్ద పడిగాపులు కాయాల్సిన పని ఉండదు. నిధులు కోసం ఢిల్లీలో నిలువుజీతం వేయాల్సిన పనిలేదు. మోదీసారు అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సిన పనే ఉండదు. కాకితో కబురంపితే కాసులు స్పెషల్ ఫ్లైట్లో వచ్చేస్తాయంతే. మేమిచ్చిన నిధులేం చేస్తున్నారని కేంద్రంలోని పువ్వు పార్టీ కూడా ఇప్పటిలా కొర్రీలు వేయదు. పువ్వుపార్టీతో జతకడితే ఇన్ని లాభాలున్నప్పుడు, ఈ ముసుగులో గుద్దులాట లేకుండా, అథవాలే అన్నయ్య చెప్పినట్లు హ్యాపీగా ఎన్డీఏ గూటిలో సరిపోతుందన్నది బతకనేర్చిన వైసీపేయుల అంతర్మథనం.
నిజమే కదా? అథవాలే అన్నయ్య చెప్పింది అక్షర సత్యాలే. ఎందుకంటే మోదీ సర్కారు కష్టాల్లో ఉన్నప్పుడల్లా రాజ్యసభలో వైసీపీ నిర్మొహమాటంగా అండగా నిలుస్తోంది. మోదీ నుంచి అమిత్‌షా వరకూ వారి చాంబర్లలో ఎప్పుడు చూసినా, వైసీపీ నేతలే తచ్చాడుతుంటారు. తిరుమల ప్రసాదాలతో కేంద్రమంత్రుల వద్ద, ఎలాగూ బ్రహ్మాండమైన లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. కేంద్రమంత్రులను అడిగి మరీ టీటీడీలో పేర్లు తీసుకుంటున్నారు. పువ్వు పార్టీకి క్లోజయిన అంబానీ ఫ్రెండు నత్వానీకి, రాజ్యసభ సీటు పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చారు. మరో ఫ్రెండు అదానీ ఏది అడిగితే అది కాదనుకుండా, ఆయన మనసు కష్టపెట్టకుండా ఇచ్చేస్తూనే ఉన్నారు.
మరి ఇన్ని పనులు తెరచాటుగా చేస్తున్నప్పుడు.. అదేదో అఫీషియల్‌గా కమలవనంలో చేరి, పువ్వుపార్టీ తీర్థం తీసేసుకుంటే, ఈ ‘ముసుగులో గుద్దులాట’ ఉండదు కదా అన్నది, కొందరు వైసీపేయుల వాదన. పైగా పువ్వు పార్టీతో కలిస్తే, రాష్ట్రంలో సైకిల్‌ను నలిపేయవచ్చు. చంద్రబాబును జైల్లో పెట్టాలన్న జగనన్న జీవితకాల కోరికనూ తీర్చేసుకోవచ్చు అన్నది, వైసీపేయులు చెబుతున్న లాజిక్కు పాయింటు. ఎవరి కోరికలు వారివి మరి!
అయితే..పువ్వు పార్టీతో కలిస్తే, జగనన్నకు జైకొడుతున్న క్రిస్టియన్లు, ముస్లిములూ దూరమవుతారు కదా అన్నది మరికొందరు వైసీపేయుల వాదన. సరే క్రిస్టియన్లంటే మన జగనే కదా సర్దుకుపోవచ్చు. కానీ ముస్లిములు అలా కాదే? చిక్కల్లా అక్కడే! మరి వారి వాదనా నిజమే!! అందుకే.. మధ్యే మార్గంగా అథవాలే అన్నయ్య పార్టీలో విలీనం చేస్తే, బీజేపీతో నేరుగా కలిశామన్న అపవాదు తప్పుతుంది. పైగా మహారాష్ట్రలో ఒకే ఒక్కడున్న అథవాలే అన్నయ్య పార్టీ కూడా బలపడుతుంది. ఎలాగూ షర్మిలక్క పార్టీ తెలంగాణలో ఉంది కాబట్టి, మూడు రాష్ట్రాల్లో చక్రం తిప్పవచ్చన్నది వైసీపేయులు సూచిస్తున్న మధ్యేమార్గం. ఏదేమైనా అథవాలే అన్నయ్య ఇప్పటికి రెండోసారి ఇచ్చిన ఈ సలహాను.. జగనన్న పాటించటం మంచిదేమోనన్నది, ఆయన 30 ఏళ్లు సీఎంగా ఉండాలనుకునే వారి కోరిక.
సరే.. అథవాలే అన్నయ్య జగనన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి, ఆ చేత్తోనే తెలంగాణలో తెరాసనూ ఎన్డీఏ గూటిలో చేర్చుకుంటే ఇహ బీజేపీకి రెండు రాష్ట్రాల్లో పోరాటాలు- ఆరాటాలు- పాదయాత్రలూ ఉండవు. ఎలాగూ వైసీపీ మాదిరిగానే తెరాస కూడా అవసరార్ధం కేంద్రానికి రాజ్యసభలో మద్దతిస్తూనే ఉంది. రాష్ట్రంలో బండి సంజయ్, అరవిందు అన్నయ్యలు టీఆర్‌ఎస్‌పై పోరాడుతున్నా.. కేసీఆర్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు, మోదీ సాబ్ అపాయింట్‌మెంట్ ఇస్తూనే ఉన్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతి కేంద్రమంత్రీ టీఆర్‌ఎస్ పథకాలు అద్భుతమని కితాబునిస్తూనే ఉన్నారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌తో కలసి బీజేపీ నేతలు ఎంత అరిచినా, ఆ ప్రాజెక్టు నీతి నిజాయితీకి ప్రతీక అని కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. ఇక్కడ సంజయన్న నెలలో 30 రోజులు కేసీఆర్‌ను త్వరలో జైలుకు పంపిస్తామని చెబుతున్నా, అక్కడ ఢిల్లీ లైట్ తీసుకుంటుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఉన్నా బేఫికర్. కానీ కాంగ్రెస్ రావద్దు. అద్గదీ పువ్వుపార్టీ పాలిసీ కాబట్టి.. అథవాలే అన్నయ్యనే, టీఆర్‌ఎస్‌ను ఎన్డీఏలో చేర్చే పవిత్ర కార్యంలో పుణ్యం కట్టుకుంటే సరి.

Leave a Reply