– ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులకు అందుతున్న సాయం
– కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచన
అమరావతి: ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా సాయం అందుతోంది. ఉక్రెయిన్ లో స్థిరపడిన తెలుగు వ్యక్తులు, యూరప్ లోని ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు చేస్తున్న సాయం విద్యార్థులకు చేరుతోంది. విద్యార్ధులకు అందుతున్న సాయం, అక్కడి వారి తాజా పరిస్థితిపై టిడిపి అధినేత చంద్రబాబు జూమ్ కాల్ ద్వారా విద్యార్థులు, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో ఈ సాయంత్రం మాట్లాడారు.
ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు, బోర్డర్ లకు వెళ్లేందుకు ఆ దేశంలో స్థిరపడిన దివ్యారాజ్ సమన్వయం చేస్తున్నారు. ఉక్రెయిన్ లోని జఫ్రోజియా నుంచి ఈ రోజు రెండు రైళ్ల లో 1500 మంది బయలుదేరగా వారిలో 600 మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారు. ఇండియా టైం ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో రైళ్లు బయలు దేరాయి. ఇవి 20 గంటల ప్రయాణం తరువాత హంగేరీ సమీపంలో ఉన్న హుజ్గోర్ ప్రాంతానికి చేరుకుంటాయని ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు ప్రతినిధి దివ్యారాజ్ చంద్రబాబుకు వివరించారు.
గత 4 రోజులుగా విద్యార్థులకు అసవరం అయిన ఆహారం, వసతి అందించడంతో పాటు….అక్కడి ప్రభుత్వంతో దివ్యా రాజ్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ట్రయిన్ బయలు దేరే వివరాలతో పాటు దివ్యారాజ్ నిరంతరం తమకు సమాచారం ఇచ్చి సహాయ పడుతున్నారని విద్యార్థులు జూమ్ కాల్ లో చంద్రబాబుకు వివరించారు. ట్రయిన్ లో బోర్డర్ కు వెళుతున్న విద్యార్థి సాయితో పాటు సౌందర్య, జోత్స్న అనే విద్యార్థులు చంద్రబాబుతో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఎన్ఆర్ఐ టిడిపి ప్రతినిధుల ద్వారా చేస్తున్న సాయంపై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు హంగేరీ, పోలండ్, రుమేనియా బోర్డర్ లలో విద్యార్థులను ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ టిడిపి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో ఇప్పటికే కొందరికి భోజనం, వసతి కల్పించారు. అయితే బోర్డర్ ల వద్ద పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా నే ఉందని…ఇదే సమయంలో ఫ్లైట్స్ కూడా అందుబాటులో లేవని వారు చంద్రబాబుకు వివరించారు. ఈ విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రికి, ఆయా దేశాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మన కేంద్ర మంత్రులకు సమాచారం ఇచ్చి…సహాయం కోరాలని చంద్రబాబు పార్టీ ఎంపిలకు సూచించారు.
సమావేశంలో యూరప్ నుంచి షణ్ముక్, కుమార్,వెంకటపతి, కిషోర్, జయకుమార్, మీరా, చందు, మురళి పాల్గొన్నారు. తాము సమన్వయం చేస్తున్న వివరాలను చంద్రబాబుకు తెలిపారు.