– కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి
జాతీయ భద్రతకు అవసరమైన రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో “ఆత్మనిర్భర్” స్వావలంబన అత్యంత కీలకమైనదని కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఓ) ఈ క్రమంలో ప్రధాన పాత్రను పోషిస్తుందని, క్షిపణులు, అధునాతన రక్షణ సాంకేతికతలను అందిపుచ్చుకోవటంలో భారతదేశం ఎన్నో విజయాలను సాధించిందన్నారు.
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ, మాలక్ష్మి గ్రూపు సంయిక్త ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ వివంతా వేదికగా “ఆత్మనిర్భర్ భారత్” దిశగా రక్షణ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి’ అనే అంశంపై నిర్వహించిన యార్లగడ్డ శ్రీరాములు 20వ ధార్మిక ఉపన్యాస కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ పరిశోధన సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య పరస్పర సహకారంతో రక్షణ రంగంలో ‘ఆత్మ నిర్భర్ భారత్’ సుసాధ్యమేనన్నారు. బలమైన రక్షణ పర్యావరణ వ్యవస్థ యొక్క ఆవశ్యకతను ఆత్మ నిర్భర్ భారత్ చర్చిస్తుందని, నూతన ఆవిష్కరణలలో స్టార్టప్‌ల సహకారాన్ని స్వాగతిస్తుందని వివరించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నుండి ‘మేక్ ఫర్ ది వరల్డ్’ స్దాయికి భారతదేశం చేరే సమయం ఎంతో దూరంలో లేదని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ రక్షణ విపణిలో భారతదేశం ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగడానికి నిరంతర పరిశోధన, అభివృద్ది అత్యావశ్యకమన్నారు.
‘మిషన్ శక్తి’ విజయం సామూహిక బలానికి నిదర్శనంగా నిలిచిందని, స్వావలంబన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భారతదేశానికి ఇది ప్రతిరూపంగా మారిందని స్పష్టం చేసారు. చిన్న తరహా పరిశ్రమలకు రక్షణ పరిశోధన రంగం ప్రత్యేక చేయూతను అందిస్తుందని, అభివృద్ది ఉత్పత్తి భాగస్వాములుగా దేశ వ్యాప్తంగా 107 సంస్ధలకు 90 రకాల ఉత్పత్తులలో సాంకేతికతను బదలయిస్తున్నామని వివరించారు.
దేశంలోని 15 అత్యున్నత విద్యా సంస్ధలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఢిఫెన్స్ ఇండస్ట్రియల్ పేరిట డిఆర్ డిఓ భాగస్వామ్య ఒప్పందం చేనుకుందన్నారు. రక్షణ పరిశోధన ఫలాలు కేవలం ఆ రంగానికే పరిమితం కాలేదని, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, ఆరోగ్య రంగాలలో కూడా ఇవి ప్రదాన భూమికను పోషిస్తున్నాయని సతీష్ రెడ్డి గుర్తు చేసారు.
మా లక్ష్మి గ్రూపు అధినేత యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత యార్లగడ్డ శ్రీరాములు పేరిట ప్రతి సంవత్సరం ధార్మిక ఉపన్యాసం నిర్వహిస్తూ, అయా రంగాలలో నిష్ణాతులతో విజయవాడ ప్రజలు మమేకం అయ్యే అవకాశం కల్పిస్తున్నామన్నారు. డాక్టర్ సతీష్ రెడ్డి డిఆర్ డిఓ ఛైర్మన్ గా దేశానికి చేసిన సేవలు అనన్య సామాన్యమైనవన్నారు.
కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్య కె. హేమచంద్రా రెడ్డి మాట్లాడూతూ క్రమం తప్పకుండా జాతీయ, అంతర్జాతీయ స్దాయి ప్రముఖులతో విజయవాడలో ధార్మిక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాలక్ష్మి అధినేత హరిచంద్ర ప్రసాద్ అభినందనీయులన్నారు.
కార్యక్రమంలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సివి శ్రీరామ్, అచార్య ఎంఎల్ఎస్ దేవకుమార్, మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ తదితరులు పాల్గొన్నారు. తొలుత డివంగత యార్లగడ్డ శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధులు రక్షణ రంగానికి సంబంధించిన విభిన్న అంశాలపై ప్రశ్నలు సంధించటంలో ఆసక్తి ప్రదర్శించారు.