కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తెదేపా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా తెదేపా నేతలు కొండబాబు, నవీన్‌పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి మద్దతుదారులు, బోటు నిర్వాహకులు దాడి చేశారని తెదేపా నేతలు ఆరోపించారు.
మాజీ మంత్రి చినరాజప్ప, మాజీ జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న డ్రగ్స్, గంజాయికి సంబంధించిన విషయాలపై పట్టాభి మాట్లాడారు. వైకాపా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ దిగుమతిలో ద్వారంపూడి హస్తం ఉందని ఆరోపించారు.
గత నెలలో కాకినాడ జగన్నాథపురం వద్ద ఉప్పుటేరులో బోటు దగ్ధమైన ఘటనలో హెరాయిన్ ఉండటం వల్లే తెల్లటి పొగలు వచ్చాయని, ఆఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేదని ఆరోపణలు చేశారు. అనంతరం కాకినాడ సీ పోర్టులో తెలుగుదేశం బృందం పర్యటించి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈక్రమంలో పార్టీ నేతలు కొండబాబు, నవీన్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా.. ఒక్కసారిగా ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు, బోటు నిర్వాహకులు వచ్చి దాడికి పాల్పడ్డారు.
దీంతో అప్రమత్తమైన తెదేపా కార్యకర్తలు.. నవీన్, కొండబాబును పార్టీ కార్యాలయంలోనికి తీసుకెళ్లారు. అదే సమయంలో పట్టాభి కూడా పార్టీ కార్యాలయంలోనే ఉండటంతో తెదేపా నేతలకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు, బోటు నిర్వాహకులు నినాదాలు చేశారు. ఈ ఘటనతో కాకినాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.